logo

మాటల్లోనే మంచి.. యువతను ముంచి!!

ప్రభుత్వ కొలువు సాధన ఎంతో మంది చిరకాల వాంఛ. ఇందుకు ఎంతో శ్రమిస్తుంటారు. కుటుంబాలకు దూరంగా ఉంటూ రూ.వేలు, రూ.లక్షల్లో ఖర్చు చేస్తూ ఆహోరాత్రులు పుస్తకాలతో కుస్తీపట్టేవారు ఎందరో.

Updated : 14 Apr 2024 03:40 IST

డీఎస్సీ పేరిట నిరుద్యోగులను మోసగించిన ముఖ్యమంత్రి

ప్రభుత్వ కొలువు సాధన ఎంతో మంది చిరకాల వాంఛ. ఇందుకు ఎంతో శ్రమిస్తుంటారు. కుటుంబాలకు దూరంగా ఉంటూ రూ.వేలు, రూ.లక్షల్లో ఖర్చు చేస్తూ ఆహోరాత్రులు పుస్తకాలతో కుస్తీపట్టేవారు ఎందరో. ఆర్థిక పరిస్థితి సహకరించకున్నా తమ లక్ష్యం కోసం ప్రయత్నిస్తూనే ఉంటారు.

ఈనాడు డిజిటల్‌, విశాఖపట్నం: ఓట్ల కోసం ఇదే అవకాశంగా భావించిన అప్పటి ప్రతిపక్షనేత జగన్‌మోహన్‌రెడ్డి అధికారంలోకి రాగానే ‘మెగా డీఎస్సీ’ ప్రకటిస్తానంటూ ప్రగల్భాలు పలికారు. తీరా వచ్చాక అదిగో ఇదిగో అంటూ అయిదేళ్లు పుణ్యకాలం గడిపేశారు. కోడ్‌ అమల్లో ఉంటుందని తెలిసినా ఎన్నికలకు రెండు నెలల ముందు నోటిఫికేషన్‌ ఇచ్చి చేతులు దులిపేసుకున్నారు. పైగా ఉపాధ్యాయ పోస్టులకు భారీగా కోత పెట్టారు. దీంతో అభ్యర్థుల్లో ఆందోళన నెలకొంది. ఒక్క అవకాశమిస్తే తమ జీవితాలతో ఆడుకున్నారంటూ అభ్యర్థులు మండిపడుతున్నారు.

పేదల దీన స్థితి

తెలియాదా?: మెగా డీఎస్సీ వస్తుందనే ఆశతో దాదాపు అయిదేళ్లుగా అభ్యర్థులు శిక్షణకు భారీగా ఖర్చు చేశారు. కుటుంబాలకు దూరంగా ఉంటూ.. సరదాలు, సంతోషాలు పక్కనపెట్టి పుస్తకాలతో కుస్తీలు పడుతూనే ఉన్నారు. ఎన్ని అవరోధాలు ఎదురైనా ఉద్యోగం సాధిస్తే అన్నీ సర్దుకుంటాయనే ఆశతో తమ లక్ష్యంపైనే గురి పెట్టారు. కానీ వైకాపా అవేవీ పట్టవన్నట్లు వ్యవహరించింది. పైగా తమ పార్టీ అభ్యర్థుల ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమేనంటూ చెప్పుకొస్తున్న జగన్‌కు పేద యువత దీనస్థితి అర్థం కాలేదా అంటూ నిరుద్యోగులు ప్రశ్నిస్తున్నారు. మరోసారి జగన్‌ను నమ్మే పరిస్థితి లేదని తేల్చి చెబుతున్నారు.

ఈ ప్రశ్నలకు బదులేది..?: గతంలో 2019 ఏప్రిల్‌లో ఎన్నికలు జరిగాయి. అంతకుముందు 2018లో తెదేపా హయాంలో డీఎస్సీ ఇవ్వడంపై నాటి ప్రతిపక్షనేతగా జగన్‌ ప్రశ్నించారు. కానీ వైకాపా అధికారంలోకి వచ్చాక నాలుగున్నరేళ్లకు పైగా నోటిఫికేషన్‌ ఎందుకివ్వలేదు? ‘త్వరలో డీఎస్సీ’ అంటూ గతేడాది ఆగస్టు నుంచి మంత్రి బొత్స సత్యనారాయణ చెబుతూ వచ్చారు. త్వరలో అంటే ఎన్నికల ముందు హడావుడిగా ఇచ్చేసి.. అభ్యర్థులను మరోసారి మోసం చేయాలనుకున్నారా? ఎన్నికల షెడ్యూల్‌ విడుదలైతే నియామక ప్రక్రియ ముందుకు సాగదని అధికారులకు తెలియదా? రాష్ట్రంలో 23 వేల ఖాళీలున్నాయని స్వయంగా జగనే చెప్పారు. మరి అధికారంలోకి వచ్చాక ఆ ఖాళీలెందుకు తగ్గిపోయాయి? ఇలా అనేక ప్రశ్నలు అభ్యర్థుల్లో ఉత్పన్నమవుతున్నాయి.

ఉమ్మడి జిల్లాల్లో 329 ఖాళీలు.: గ్రామీణ ప్రాంతాలకు చెందిన ఎక్కువ మంది డీఎస్సీ రాసేందుకు ఆసక్తి చూపుతారు. ఉమ్మడి జిల్లాకు చెందిన అభ్యర్థుల్లో ఎక్కువ శాతం సెకండరీ గ్రేడ్‌ టీచర్‌ పోస్టులకు సన్నద్ధమవుతున్నారు. ఇటీవల విడుదల చేసిన 6,100 ఉద్యోగాల్లో ఉమ్మడి జిల్లాలోని ఖాళీలు కేవలం 329. అందులో ఎస్జీటీ 101, స్కూల్‌ అసిస్టెంట్‌ 133, టీజీటీ 95. వాటికి 12 వేల మందికి పైగా దరఖాస్తు చేసుకున్నారు.

  • జిల్లాలోని పౌర గ్రంథాలయం, ఏయూలోని వీఎస్‌ కృష్ణా గ్రంథాలయం, ఆర్సీ రెడ్డి కోచింగ్‌ సెంటర్‌, రీడింగ్‌ రూంలలో... అలాగే విజయనగరంలోని కేంద్రాల్లో అభ్యర్థులు సన్నద్ధమవుతున్నారు. ఏడాది క్రితం నోటిఫికేషన్‌ ఇచ్చి ఉంటే ఇప్పటికే పరీక్షలు పూర్తయ్యేవి. కొత్త ప్రభుత్వం కొలువుదీరాక.. మరో నోటిఫికేషన్‌ వచ్చేది. గతంలో తెదేపా మాదిరిగా విద్యా వాలంటీర్లను తీసుకున్నా అభ్యర్థులకు అవకాశం వచ్చేదని నిరుద్యోగుల సంఘం ప్రతినిధులు చెబుతున్నారు.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని