logo

కూటమి జోరు.. వైకాపా బేజారు

సార్వత్రిక ఎన్నికల సమరంలో కూటమి జోరు పెంచింది. ఇప్పటికే   వీరి ఈ పార్టీల అభ్యర్థులు ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఇంటింటికీ, గ్రామాల్లోనూ తెదేపా, జనసేన, భాజపా ఉమ్మడి మేనిఫెస్టోపై విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు.

Updated : 14 Apr 2024 03:39 IST

జిల్లాలో అధినేతల వరుస పర్యటనలు

చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌ల రోడ్డుషోపై నాయకులతో చర్చిస్తున్న రాజు, తాతయ్యబాబు

ఈనాడు, అనకాపల్లి, పాయకరావుపేట, న్యూస్‌టుడే: సార్వత్రిక ఎన్నికల సమరంలో కూటమి జోరు పెంచింది. ఇప్పటికే   వీరి ఈ పార్టీల అభ్యర్థులు ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఇంటింటికీ, గ్రామాల్లోనూ తెదేపా, జనసేన, భాజపా ఉమ్మడి మేనిఫెస్టోపై విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ఈనెల ఏడున జిల్లా అనకాపల్లిలో జరిగిన పవన్‌ పర్యటన కేక పుట్టించింది. క్యాడర్‌లో ఉత్సాహాన్ని రెట్టింపు చేసేందుకు మరోసారి అధినేతల పర్యటనలు ఖరారు చేశారు. దీనిలోభాగంగా తెదేపా అధినేత చంద్రబాబునాయుడు పాయకరావుపేట నుంచి ఆదివారం జిల్లాలో ఎన్నికల శంఖారావం పూరించనున్నారు. మరో రోజు వ్యవధిలో చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌లో భారీ బహిరంగ సభలు నిర్వహించనున్నారు. ఈ మేరకు చోడవరం, ఎలమంచిలిలో ఈ నెల 16న వీరి సభలకు ఏర్పాట్లు చేస్తున్నారు. చంద్రబాబునాయుడు, పవన్‌కల్యాణ్‌ల పర్యటనలు ఖరారు కావడంతో నాయకులు, కార్యకర్తల్లో నూతనోత్సాహం ఉట్టిపడుతోంది. ఆదివారం పాయకరావుపేటలో ప్రజాగళం సభకు సర్వం సిద్ధం చేశారు. పట్టణంలోని ప్రధాన రహదారిపై చంద్రబాబునాయుడు ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. అధినేతల పర్యటనలో ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి పాలనా వైఫల్యాలను ఎత్తి చూపనున్నారు.

రావికమతం, న్యూస్‌టుడే:  కొత్తకోటలో ఈ నెల 16వ తేదీ సాయంత్రం చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌ రోడ్డుషో నిర్వహించనున్నారని చోడవరం అసెంబ్లీ అభ్యర్థి కేఎస్‌ఎన్‌ఎస్‌ రాజు పేర్కొన్నారు. అధినేతలు ఇద్దరూ ఉమ్మడిగా రోడ్డుషోకు రానుండటంతో ఆదివారం సాయంత్రం కొత్తకోటలో జరగాల్సిన చంద్రబాబు రోడ్డుషోను రద్దు చేసినట్లు చెప్పారు. రోడ్డుషోను విజయవంతం చేయడంపై శనివారం రావికమతం, కొత్తకోటలలో తెదేపా, భాజపా, జనసేన నాయకులతో సమావేశమయ్యారు. తాతయ్యబాబు, మల్లునాయుడు తదితరులు పాల్గొన్నారు.

అచ్యుతాపురం: అచ్యుతాపురంలో శనివారం కూటమి నాయకుల సమావేశం జరిగింది. కూటమి అభ్యర్థి సుందరపు విజయ్‌కుమార్‌ మాట్లాడుతూ ఈనెల 16న సాయంత్రం 5గంటలకు అచ్యుతాపురంలో తెదేపా జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబునాయుడు, జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్‌ ఎన్నికల సభలో పాల్గొంటారన్నారు. ఈ నెల 18న ఉదయం ఎలమంచిలిలో కూటమి ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్‌ వేస్తున్నట్లు సుందరపు ప్రకటించారు. తెదేపా నియోజకవర్గ ఇన్‌ఛార్జి ప్రగడ నాగేశ్వరరావు మాట్లాడుతూ గ్రామాల్లో ప్రతి ఓటరును నాయకులు, కార్యకర్తలు మూడుసార్లు కలసి గాజుగ్లాసు, కమలం  గుర్తులపై ప్రచారం చేయాలన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని