logo

ఒక వైపే.. అధికారుల చూపు!!

ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి వస్తే...అధికార పక్షమైనా, ప్రతిపక్షమైనా ఒకటే. ఎన్నికల అధికారులు అందర్నీ సమానంగా చూడాల్సిందే. ఏ విషయంలోనూ ఎక్కువ, తక్కువ అనే తారతమ్యాలు చూపకూడదు.

Updated : 14 Apr 2024 04:49 IST

అధికార పార్టీ నేతల ఉల్లంఘనలు
పట్టించుకోని యంత్రాంగం
ప్రతిపక్షాలపై మాత్రం నిరంతర నిఘా

ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి వస్తే...అధికార పక్షమైనా, ప్రతిపక్షమైనా ఒకటే. ఎన్నికల అధికారులు అందర్నీ సమానంగా చూడాల్సిందే. ఏ విషయంలోనూ ఎక్కువ, తక్కువ అనే తారతమ్యాలు చూపకూడదు. ముఖ్యంగా ఎవరు ప్రలోభాలకు గురి చేసినా చర్యల విషయంలో నిష్పక్షపాతంగా వ్యవహరించాల్సిందే. క్షేత్రస్థాయిలో ఆ పరిస్థితి కనిపించడం లేదన్న విమర్శలు ప్రతిపక్షాల నుంచి తీవ్రంగా వినిపిస్తున్నాయి.

ఈనాడు, విశాఖపట్నం: ప్రతిపక్షాలు చేపట్టిన కార్యక్రమాలు ఉల్లంఘనల కింద రాకున్నా అధికారులు ప్రశ్నిస్తున్నారు. వైకాపా నేతలు బాహాటంగానే ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తుంటే కళ్లుమూసుకుంటున్నారు. కనీసం అటువైపే చూడడం లేదు. ఆయా నియోజకవర్గాల్లోని తనిఖీ అధికారుల నిర్లక్ష్యం మీద జిల్లా ఎన్నికల అధికారి హెచ్చరించాల్సినప్పటికీ  పట్టించుకోవడం లేదు’ అన్న ఆరోపణలు వస్తున్నాయి.

తెదేపా నేతలపై కేసులు: మధురవాడలో ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించారని భీమిలి తెదేపా అభ్యర్థి గంటా శ్రీనివాసరావు కుమారుడు రవితేజతో పాటు మరో ముగ్గురిపై అధికారులు కేసు నమోదు చేశారు. రంజాన్‌ సందర్భంగా ముస్లింలకు శుభాకాంక్షలు తెలిపేందుకు సద్గురు సాయినాథకాలనీలోని మసీదులో పార్టీ స్టిక్కర్లు అంటించిన మిఠాయి పొట్లాలను పంపిణీ చేశారు. దీనిపై ఓ పత్రికలో వార్త రావడంతో అప్రమత్తమైన యంత్రాంగం కేసు నమోదు చేసింది. అయితే... వైకాపా నాయకులు నగరంలోని పలు మసీదుల్లో ప్రలోభాలకు గురిచేసినా పట్టించుకోలేదు. మద్దిలపాలెంలోని మసీదులోకి వైకాపా నేత ఒకరు వెళ్లి ఓటర్లకు గాలం వేసేలా మాట్లాడినా స్పందించలేదు.  పాతనగరం, గాజువాక ప్రాంతాల్లో అధికార పార్టీ నేతలు ప్రలోభాలకు గురి చేసినా తనిఖీ అధికారులకు పట్టలేదు.

అధికార పార్టీ నేతలు ప్రశ్నించరా?: అధికార పక్షం నిర్వహిస్తున్న కొన్ని కార్యక్రమాలను పట్టించుకోకుండా.. ప్రతిపక్షాలవైతే హెచ్చరించే ధోరణిలో అధికారులు వ్యవహరిస్తున్నారు. ఫిర్యాదు చేసినా కనీసం పట్టించుకోవడం లేదంటున్నారు. జీవీఎంసీ 63వ వార్డు జైఆంధ్ర కాలనీలో ఇటీవల గీతం వైద్య కళాశాల ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఆ రోజు అధిక సంఖ్యలో పేదలు వచ్చి ఆర్యోగ పరీక్షలు చేయించుకున్నారు. గీతం ఆధ్వర్యంలో వైద్య శిబిరాలు నిర్వహించడం సాధారణం. అయినప్పటికీ నిర్వహణపై ఎన్నికల తనిఖీ అధికారులు తెదేపా నాయకులను ప్రశ్నించారు. శిబిరానికి, తెదేపాకు ఎలాంటి సంబంధం లేదని చెప్పడంతో నిమ్మకుండిపోయారు. ఈ నెల 11న 62వ వార్డులో ఆడారి తులసీరావు ఛారిటబుల్‌ ట్రస్టు ఆధ్వర్యంలో వైద్య శిబిరం నిర్వహించారు. ఇందులో పశ్చిమ వైకాపా అభ్యర్థి ఆడారి ఆనంద్‌కుమార్‌ తరఫున ఆయన సోదరి ప్రచారం చేయడంతో పాటు కొందరు వైకాపా నాయకులు పాల్గొన్నారు. అధికారులకు విషయం తెలిసినా స్పందించలేదు. ఆ తర్వాత ఫిర్యాదు చేస్తే శిబిరం ముగిసింది  ఎలాంటి చర్యలు తీసుకోలేమంటూ చేతులెత్తేశారు.

ఆర్పీలతో దర్జాగా: ఎన్నికల నియమావళి అమల్లో ఉండగా జీవీఎంసీ యూసీడీ విభాగంలో కొందరు అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్న సంఘటనలు ఎన్నో బయటపడుతున్నాయి. అయినా చర్యలుకానరావడం లేదు. డ్వాక్రా సంఘాల్లోని రిసోర్సుపర్సన్లు, కమ్యూనిటీ ఆర్గనైజర్లు కొందరు వైకాపా నేతలకు బాహాటంగానే కొమ్ముకాస్తున్నారు. తూర్పు, పశ్చిమంలో మహిళా సంఘాలతో వైకాపా నేతలు సమావేశాలు నిర్వహించి వారి ద్వారా ప్రలోభపెడుతున్నారు. బహిరంగ సభల్లో వారితో మాట్లాడిస్తున్నారు. జీవీఎంసీ యూసీడీలోని ఓ కీలకాధికారి ఆధ్వర్యంలో పనిచేస్తున్నారనే ఆరోపణలు తీవ్రంగా ఉన్నాయి. సదరు అధికారే ఆర్పీలను ఆ దిశగా ప్రోత్సహిస్తున్నట్లు విమర్శలున్నాయి.  
సమయం మించినా: అధికార పార్టీ నేతల ప్రచారాల్లో యథేచ్ఛగా ఉల్లంఘనలు జరుగుతున్నా అధికారులు ప్రశ్నించడం లేదు. రాత్రి పది గంటలు దాటితే ప్రచారాలు ఆపేయాలి. అటువంటిది కొన్ని చోట్ల కొనసాగిస్తున్నారు. తనిఖీ అధికారులు అక్కడే ఉంటున్నా కేసు నమోదు చేయకపోగా కనీసం ప్రశ్నించడం లేదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని