logo

ఒడ్డుకు చేరుకున్న తెప్పలు

పగలనక.. రేయనక.. నడి సంద్రంలో ప్రాణాలకు తెగించి చేపల వేట సాగించే మత్స్యకారుల తెప్పలు ఒడ్డుకు చేరనున్నాయి. ఏటా తూర్పు తీరంలో రెండు నెలల పాటు చేపల వేట విధించే నిషేధం ఈనెల 14వ తేదీ అర్ధరాత్రి నుంచి జూన్‌ 14వ తేదీ అర్ధరాత్రి వరకు 61 రోజుల పాటు అమలు కానుంది.

Updated : 14 Apr 2024 03:38 IST

నేటి అర్ధరాత్రి నుంచి చేపల వేటపై నిషేధం


పడవను ఒడ్డుకు తీసుకొస్తున్న మత్స్యకారులు

పగలనక.. రేయనక.. నడి సంద్రంలో ప్రాణాలకు తెగించి చేపల వేట సాగించే మత్స్యకారుల తెప్పలు ఒడ్డుకు చేరనున్నాయి. ఏటా తూర్పు తీరంలో రెండు నెలల పాటు చేపల వేట విధించే నిషేధం ఈనెల 14వ తేదీ అర్ధరాత్రి నుంచి జూన్‌ 14వ తేదీ అర్ధరాత్రి వరకు 61 రోజుల పాటు అమలు కానుంది.

నక్కపల్లి, న్యూస్‌టుడే : జిల్లాలో నక్కపల్లి, పాయకరావుపేట, ఎస్‌.రాయవరం, రాంబిల్లి, అచ్యుతాపురం, పరవాడ మండలాలు తీరంలో ఉన్నాయి. ఈ మండలాల పరిధిలో 73 కిలోమీటర్ల పొడవునా తీరం ఉండగా, 31 మత్స్యకార గ్రామాలున్నాయి. సుమారు 90 వేల జనాభా ఉండగా, 28 చేపల రేవులున్నాయి. సముద్రంలో వేటచేసే మత్స్యకారులకు చేపలు, రొయ్యలే ప్రధాన జీవనాధారం. వీటి సంపద లభించాలంటే వీటి ఉత్పత్తి పెరగాలి, తద్వారా మత్స్యకారులకు ఉపాధి లభిస్తుంది. దీన్ని పరిగణనలోకి తీసుకుని మత్స్యసంపద సంతానోత్పత్తి జరిగే ఏప్రిల్‌, మే, జూన్‌ నెలల్లో 61 రోజులను వేట నిషేధంలో పెడతారు. ఈ సమయంలో మత్స్యకారులు సంప్రదాయ తెప్పలతో మాత్రమే వేటకు వెళ్లాలి. మర, ఇంజిన్‌ తెప్పలను వినియోగిస్తే నేరం చేసినట్లే. జిల్లాలో 2284 తెప్పలుంటే, ఇందులో 1955 ఇంజిన్‌, 329 కర్ర తెప్పలున్నాయి. ఇంజిన్‌ తెప్పలున్న మత్స్యకారులు ఈ రెండు నెలల పాటు ప్రత్యామ్నాయ ఉపాధిని వెతుక్కోవాలి. ఈ ఏడాది ఎన్నికల జరుగుతుండగా, కోడ్‌ నేపథ్యంలో మత్స్యకారుల గణన జరుగుతుందా లేదాని చూడాలి. గతేడాది సుమారు 11వేల మంది మత్స్యకారులు చేపల వేటకు దూరంగా ఉన్నట్లు గుర్తించారు. అయితే ప్రభుత్వం ఇచ్చే రూ. 10 వేల పరిహారం మాత్రం అందరికీ చేరలేదు. బ్యాంకు ఖాతాలు, ఆధార్‌లోని తప్పిదాల పేరిట సుమారు 300 మందికి ఇప్పటికి లబ్ధి అందలేదు. ఏటా ఇలాంటి సమస్య ఉంటున్నా అధికారులు తగిన పరిష్కారం చూపకపోవడంతో మత్స్యకారులకు ఇబ్బందులు తప్పడంలేదు.

పక్కాగా అమలు చేస్తాం

రెండు నెలలపాటు ఇంజిన్‌, మర పడవలతో వేట చేయడం నిషేధం. దీన్ని అతిక్రమిస్తే చర్యలుంటాయి. కర్ర తెప్పలకు ఏ ఆంక్షలు ఉండవు. ప్రస్తుతం ఎన్నికల కోడ్‌ ఉండటంతో వేటకు దూరమయ్యే మత్స్యకారుల గణన చేయడానికి ఇంతవరకు ఏ ఆదేశాలు రాలేదు. నిషేధం పక్కాగా అమలు చేసేలా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాం.

ప్రసాద్‌, మత్స్యశాఖ జిల్లా అధికారి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని