logo

మాటకారి మామయ్యా.. ‘దీవెన’లేవయ్యా?

పథకాల పేర్లు మార్చి గొప్పలు చెప్పుకోవడంలో జగన్‌ ఘనాపాటి. తెదేపా హయాంలో ఉన్నత విద్య చదువుకునే వారికి ఫీజు రీయింబర్స్‌మెంట్‌, పోస్టుమెట్రిక్‌ స్కాలర్‌షిప్‌ పథకాలను అమలు చేసేవారు.

Updated : 14 Apr 2024 04:58 IST

ఈ ఏడాది మూడు విడతల సాయం
వసతిగృహ విద్యార్థులకు 50 శాతం ఎగవేత

పథకాల పేర్లు మార్చి గొప్పలు చెప్పుకోవడంలో జగన్‌ ఘనాపాటి. తెదేపా హయాంలో ఉన్నత విద్య చదువుకునే వారికి ఫీజు రీయింబర్స్‌మెంట్‌, పోస్టుమెట్రిక్‌ స్కాలర్‌షిప్‌ పథకాలను అమలు చేసేవారు. వైకాపా సర్కారు అదే పథకానికి జగనన్న విద్యాదీవెన, వసతి దీవెనలుగా మార్చి తానే కొత్తగా తీసుకొచ్చినట్లు ప్రచారం చేసుకుంటుంది. వాటినైనా సక్రమంగా అందిస్తున్నారా అంటే అదీ లేదు. దశలవారీగా ఇస్తామని ఏటా ఒకటి రెండు విడతల ఆర్థిక సాయాన్ని సర్కారే ఎగ్గొట్టి దగా చేస్తోంది. ఆ మేరకు విద్యార్థులపై ఫీజుల భారం పడుతోంది. రుసుములు చెల్లించలేని పిల్లల ధ్రువపత్రాలను కళాశాలలు ఇవ్వకపోవడంతో విద్యార్థులకు దిక్కుతోచడం లేదు.

ఈనాడు, అనకాపల్లి, న్యూస్‌టుడే, పాడేరు: అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో అన్ని సామాజిక వర్గాల విద్యార్థులు సుమారు 70 వేల మంది ఉన్నారు. ఐటీఐ మొదలుకొని ఇంజినీరింగ్‌, మెడిసిన్‌ చదివే విద్యార్థులున్నారు. వీరికి ఏటా విద్యాదీవెన నాలుగు దశల్లో తల్లిదండ్రుల ఖాతాల్లో సొమ్ములు జమ చేయాల్సి ఉంటుంది. ప్రభుత్వ కళాశాలల్లో చదువుకునే విద్యార్థులు మినహా మిగతావారికి వసతి దీవెన కింద ఏటా రెండు దశల్లో ఆర్థిక సాయం అందజేయాలి. ఐటీఐ విద్యార్థులకు రూ.10 వేలు, పాలిటెక్నిక్‌ చదువుతున్న వారికి రూ.15 వేలు, ఇంజినీరింగ్‌, మెడిసిన్‌ విద్యార్థులకు రూ.20 వేల చొప్పున ఖాతాల్లో వేయాలి. విద్యాదీవెన సొమ్ములు కొంతవరకు అందుతున్నా రెండు విడతల్లో ఇవ్వాల్సిన వసతి దీవెన మాత్రం ఏటా ఒక విడత చెల్లించి మరో విడత ఇవ్వకుండా మడత పెట్టేస్తున్నారు.

బటన్‌ నొక్కడంతో సరి

2023-24 విద్యాసంవత్సరానికి సంబంధించి నాలుగు విడతలుగా చెల్లించాల్సిన విద్యాదీవెన సొమ్ముల్లో ఒక విడత మాత్రమే విడుదల చేశారు. అదీ ఎన్నికలున్నాయని మార్చి 1న బటన్‌ నొక్కారు. ఇప్పటికీ చాలామంది ఖాతాలకు ఆ సొమ్ములు చేరనేలేదు. ఇంకా మూడు విడతల సొమ్ము బకాయిలున్నాయి. ఎన్నికల షెడ్యూల్‌ విడుదల చేయడంతో ఇక సర్కారు సాయం మర్చిపోయినట్లే. ఆ మేరకు తల్లిదండ్రులపై ఫీజుల భారం పడుతోంది.

వసతికి సొమ్ముల్లేవ్‌..

గతేడాది వరకు వసతి దీవెన కింద ఒక విద్యార్థికి రూ.20 వేలు చెల్లించాలంటే రూ.10 వేలు మాత్రమే ఖాతాల్లో వేసేవారు. మిగతా సొమ్ము ఆ విద్యార్థులు భరించేవారు. ఈ ఏడాదికి వచ్చేసరికి ఒక్క విడత వసతి దీవెన సొమ్ములు విద్యార్థులకు అందలేదు. మొత్తం డబ్బులు విద్యార్థుల తల్లిదండ్రులే చెల్లించుకోవాల్సి వస్తోంది. సొమ్ముల్లేకుండానే ఉత్తుత్తి బటన్‌ నొక్కేసి విద్యార్థుల జీవితాలతో జగన్‌ ఆటలాడుకుంటున్నారు.

  • అల్లూరి జిల్లాలో 12457 మందికి కేవలం తొలివిడత మాత్రమే విద్యాదీవెన అందించారు. ఇంకా మూడు విడతలుగా రూ.18 కోట్లకు పైగా చెల్లించాల్సి ఉంది.
  • అనకాపల్లి జిల్లాలో వసతి దీవెన కింద 2022-23లో (గతేడాది) 37,377 మందికి రూ. 34.61 కోట్లు ఒక విడతగా చెల్లించారు. మరో విడతగా చెల్లించాల్సిన రూ.34 కోట్లకు ఎగనామం పెట్టేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు