logo

పాడేరులో పాట్లెన్నో..

జిల్లా కేంద్రం పాడేరు పట్టణంలో సమస్యలు తాండవం చేస్తున్నాయి. డివిజన్‌ కేంద్రంగా ఉన్న ఇది రెండేళ్ల క్రితం జిల్లా కేంద్రంగా అవతరించింది. ఇక్కడ ప్రజలకు కనీస సౌకర్యాలు కల్పించడంలో ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం చేస్తోంది.

Published : 17 Apr 2024 01:55 IST

పాడేరు పట్టణం, న్యూస్‌టుడే

జిల్లా కేంద్రం పాడేరు పట్టణంలో సమస్యలు తాండవం చేస్తున్నాయి. డివిజన్‌ కేంద్రంగా ఉన్న ఇది రెండేళ్ల క్రితం జిల్లా కేంద్రంగా అవతరించింది. ఇక్కడ ప్రజలకు కనీస సౌకర్యాలు కల్పించడంలో ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం చేస్తోంది.

ఈ పట్టణానికి రోజూ జిల్లాలోని 22 మండలాల నుంచి ప్రజలు వస్తున్నారు. వందలాది మంది ఉద్యోగుల కుటుంబాలు ఇక్కడకు తరలివచ్చాయి. విస్తరిస్తున్న జనసాంద్రతకు తగ్గట్లుగా ఇక్కడ మౌలిక సదుపాయాలు కల్పించలేదు. తాగునీరు, రోడ్లు, డ్రైనేజీ తదితర పనులు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న మాదిరిగా ఉన్నాయి.

తాగునీటికి కటకట

పాడేరు పట్టణ పరిధిలో ప్రజలు తాగునీటి కోసం ఏళ్ల తరబడిగా అల్లాడుతున్నారు. సుండ్రుపుట్టు, లోచలిపుట్టు, మసీదు వీధి, సినిమాహాల్‌ సెంటర్‌, ఆర్టీసీ కాంప్లెక్సు రోడ్డు, అంబేడ్కర్‌ కూడలిలో నీటి సమస్య తీవ్రంగా ఉంది. తెదేపా హయాంలో పాడేరుకు పది కిలోమీటర్ల దూరంలోని పరదానిపుట్టు గెడ్డ నీటిని శుద్ధి చేసి పట్టణవాసులకు సరఫరా చేసేవారు. ఆ తర్వాత రేకుల కాలనీ, సుండ్రుపుట్టు, ఐటీడీఏ వెనుక భాగంలో రక్షిత పథకాలు నిర్మించారు. వీటి నిర్వహణలో లోపంతో ప్రస్తుతం ప్రజలకు తాగునీరు అందడం లేదు.

నిరుపయోగంగా రైతు బజార్‌

పట్టణంలో తెదేపా ప్రభుత్వ హయాంలో నిర్మించిన రైతు బజార్‌ నిరుపయోగంగా ఉంది. సరైన స్థలం లేక రోడ్డుకు ఇరువైపులా దుకాణాలు ఏర్పాటు చేస్తున్నారు. దీంతో తరచూ ట్రాఫిక్‌ సమస్య ఏర్పడుతోంది. రైతు బజార్‌ను వినియోగంలోకి తీసుకొస్తే చిరువ్యాపారులకు ఉపయోగకరంగా ఉంటుంది. ట్రాఫిక్‌ సమస్య కొంత తగ్గుముఖం పడుతుంది.

  • పట్టణ శివారులోని సిల్వర్‌నగర్‌లో దాదాపు వంద కుటుంబాలు నివాసముంటున్నాయి. కాలనీకి సమీపంలో డంపింగ్‌ యార్డును ఏర్పాటు చేయడంతో స్థానికులు దుర్వాసనతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. డంపింగ్‌యార్డును మరో చోటకు మార్పు చేయాలని కలెక్టర్‌ సుమిత్‌కుమార్‌ను అప్పట్లో ప్రజలు వేడుకున్నారు. డంపింగ్‌యార్డును మరో చోటకు మారుస్తామని ఆయన హామీ ఇచ్చినా నేటికీ పరిష్కరించలేదు.
  • పాడేరులో ఒక సులభ్‌ కాంప్లెక్స్‌ కూడా లేదు. ప్రభుత్వ ఉద్యోగులకు ప్రభుత్వం వసతి సౌకర్యం కల్పించకపోవడంతో అద్దె ఇళ్లపై ఆధారపడుతున్నారు. ఇంటి అద్దె రూ.8 వేల నుంచి రూ.10 వేల వరకూ వసూలు చేస్తున్నారు.

విస్తరణ ఊసే లేదు..

పాడేరులో రోజురోజుకూ ట్రాఫిక్‌ సమస్య తీవ్రమవుతోంది. అంబేడ్కర్‌ కూడలి, ఆర్టీసీ కాంప్లెక్సు, మెయిన్‌ రోడ్డు ప్రాంతాల్లో రద్దీ ఎక్కువగా ఉంటోంది. మార్కెట్‌ జరిగే సమయంలో, వారపు సంతల రోజు ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది.  తరచూ ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ సమస్య పరిష్కారానికి పాడేరు టౌన్‌ ప్రాజెక్టుకు రూ.50 కోట్లతో ప్రతిపాదించారు. ఈ పనుల్లో వైకాపా ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం చేసింది. ఆర్నెల్ల క్రితం హడావుడిగా రోడ్డు విస్తరణ పేరిట ఉన్న కాలువలను తవ్వేసి వదిలేశారు. దీని వల్ల ప్రమాదాలు ఎక్కువయ్యాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని