logo

సివిల్స్‌లో మనోళ్ల మెరుపులు

పట్టుదల, ఆత్మ విశ్వాసంతో చదివితే దేన్నైనా సాధించవచ్చని నిరూపించాడు గిరి యువకుడు. హుకుంపేట మండలం అండిభ గ్రామానికి చెందిన చిట్టపులి నరేంద్ర పడాల్‌ సివిల్స్‌లో 545వ ర్యాంక్‌ సాధించారు.

Published : 17 Apr 2024 02:32 IST

హుకుంపేట, న్యూస్‌టుడే: పట్టుదల, ఆత్మ విశ్వాసంతో చదివితే దేన్నైనా సాధించవచ్చని నిరూపించాడు గిరి యువకుడు. హుకుంపేట మండలం అండిభ గ్రామానికి చెందిన చిట్టపులి నరేంద్ర పడాల్‌ సివిల్స్‌లో 545వ ర్యాంక్‌ సాధించారు. ఈయన హైదరాబాద్‌లోని బ్రహ్మప్రకాష్‌ దయానంద్‌ ఆంగ్లో వేద పాఠశాలలో ఇంటర్‌, నారాయణ ఐఏఎస్‌ అకాడమీలో డిగ్రీ పూర్తిచేశారు. ఉస్మానియా యూనివర్సిటీలో రాజకీయ శాస్త్రంపై పీజీ రెండో సంవత్సరం చదువుతున్నారు. రెండో ప్రయత్నంలో సివిల్స్‌ విజయం సాధించారు. పాఠశాల నుంచి సివిల్స్‌ విజయమే లక్ష్యంగా చదివి అనుకున్నది సాధించారు. ఈయన తల్లిదండ్రులు డాల్‌ పడాల్‌, విజయభారతి. తండ్రి ఉద్యోగ రీత్యా హైదరాబాద్‌లో ఉంటున్నారు. నరేంద్ర విద్యాభ్యాసం మొత్తం అక్కడే సాగింది.

ఈ సందర్భంగా నరేంద్రపడాల్‌ ‘న్యూస్‌టుడే’తో ఫోన్‌లో మాట్లాడారు. ‘ విజయం సాధించాలంటే పట్టుదల చాలా ముఖ్యం. పట్టుదలతో చదివి సివిల్స్‌లో విజయం సాధించాను. నేటి యువత కష్టాలను సాకుగా చూపిస్తూ ఇంటికే పరిమితం అవుతూ,  అనుకొన్న లక్ష్యాన్ని సాధించలేకపోతున్నారు. లక్ష్యసాధనలో అనేక ఇబ్బందులు వస్తాయి. వాటిని అధిగమించి ముందుకు సాగాలని’పేర్కొన్నారు. నరేంద్ర పడాల్‌ను సర్పంచి సత్యనారాయణ, స్థానికులు అభినందించారు.


ఈనాడు, విశాఖపట్నం: యూపీఎస్సీ మంగళవారం విడుదల చేసిన సివిల్స్‌ తుది ఫలితాల్లో విశాఖ నగరానికి చెందిన వేములపాటి హనిత 887 ర్యాంకుతో మెరిశారు. గతేడాది గ్రూప్‌-1లో రాణించి వైద్యారోగ్యశాఖలో కొలువు సాధించిన ఈమె ఏడాది తిరక్కుండానే సివిల్స్‌లోనూ సత్తాచాటారు. మూడు ప్రయత్నాల్లో మెయిన్స్‌ వరకు వచ్చి ఆగిపోయిన హనిత నాలుగో ప్రయత్నంలో విజయం సాధించి తన కలను నెరవేర్చుకున్నారు. సివిల్స్‌ కోసం ప్రత్యేకంగా ఎక్కడా కోచింగ్‌ తీసుకోలేదు. దాదాపు ఇంటి దగ్గరే సొంతంగా సాధన చేశారు. ఓవైపు ఉద్యోగం చేస్తూనే మరోవైపు సివిల్స్‌కు ప్రిపేర్‌ అవుతూ వచ్చారు. మెయిన్స్‌, మౌఖిక పరీక్షల సమయంలో హైదరాబాద్‌లో ట్రైనర్‌ బాల లత నుంచి సలహాలు, సూచనలు తీసుకుని విజయం సొంతం చేసుకున్నారు. ఆమె తండ్రి రాఘవేంద్రరావు, తల్లి ఇందిరా ఇద్దరు ప్రభుత్వ ఉద్యోగులే. తమ కుమార్తె విజయం ఎంతో ఆనందం నింపిందని పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు