logo

జగనాసురుల కన్ను పడితే.. జగద్రక్షకుడి ఆస్తులు గోవిందా..

మనకు ఏ కష్టమొచ్చినా ముందు దేవుడినే తలుచుకుంటాం. భగవంతుడా మమ్మల్ని కష్టం నుంచి గట్టెక్కించు నీ దగ్గరకి వచ్చి మొక్కు తీర్చుకుంటామని కోరుకోవడం చూస్తుంటాం

Updated : 17 Apr 2024 07:42 IST

5 వేల ఎకరాలకు పైగా దేవాదాయ భూములు స్వాహా
అన్యాక్రాంతమైనవి కొన్ని.. ఆక్రమణల్లో ఇంకొన్ని..
ఈనాడు, అనకాపల్లి - న్యూస్‌టుడే, బృందం

మనకు ఏ కష్టమొచ్చినా ముందు దేవుడినే తలుచుకుంటాం. భగవంతుడా మమ్మల్ని కష్టం నుంచి గట్టెక్కించు నీ దగ్గరకి వచ్చి మొక్కు తీర్చుకుంటామని కోరుకోవడం చూస్తుంటాం. ఇప్పుడు దేవుడే తనను, తన ఆస్తులను అక్రమార్కుల బారిన పడకుండా కాపాడాలని వేడుకునే పరిస్థితి వచ్చింది. దేవుడికి నిలువు దోపిడీ ఇచ్చే భక్తులు బోలెడుమంది ఉంటారు. సాక్షాత్తూ దేవుడినే నిలువునా దోచేసే వారు వైకాపాలోనే ఉన్నారు. అధికారం మాది.. అంతా మాకే దక్కాలన్న రీతిలో దేవుడికే శఠగోపం పెడుతున్నారు.

వైకాపా సర్కారు కొలువు తీరిన తర్వాత దేవాదాయ భూములకు రెక్కలు వచ్చాయి. అధికార పార్టీ నేతలు, వారి అనుచరులు ఆలయాల భూములను ఆక్రమించుకుంటున్నారు.. రికార్డులను తారుమారు చేసి తమ పేరిట పట్టాలు మార్చేసి దేవుడికే తిరిగి శఠగోపం పెట్టేస్తున్నారు. ఇదేమి తీరు అని అడిగితే కోర్టుల్లో కేసులు వేసి అధికారులను ముప్పతిప్పలు పెడుతున్నారు. దేవాదాయ భూములను లీజుకు తీసుకుని శిస్తులు చెల్లించి చట్టబద్ధంగా సాగు చేసుకుంటున్న రైతులు తక్కువే ఉంటున్నారు. చట్టవిరుద్ధంగా దేవుడి భూముల్లో పాగా వేసినవారే ఎక్కువగా కనిపిస్తున్నారు. అనకాపల్లి జిల్లాలో ఏడు వేల ఎకరాలకు పైగా దేవాదాయ భూములుంటే అందులో 4 వేల ఎకరాలకు పైగా ఆక్రమణదారుల చెరలోనే మగ్గుతున్నాయి. అల్లూరి జిల్లాలోనూ గుడుల పేరిటనున్న భూములు అన్యాక్రాంతమైపోతున్నాయి.


జిల్లా అధికారులు ఆలయాల భూముల లెక్కలన్నీ తిరగేసి ఆక్రమణలను గుర్తించినా వాటిని స్వాధీనం చేసుకోలేకపోతున్నారు. అధికార పార్టీ నేతలే ఆక్రమణదారులకు వెన్నుదన్నుగా నిలుస్తుండటంతో అధికారులు చేష్టలుడిగి చూడాల్సి వస్తోంది.


మరిన్ని ఆక్రమణలివిగో..

మాడుగుల మండలంలో 1,107 ఎకరాలు దేవాదాయ భూములున్నాయి. ఇందులో 1,003 ఎకరాలు ఆక్రమణకు గురయ్యాయి. కె.కోటపాడు మండలంలో 709 ఎకరాల దేవుడి మాన్యానికిగాను 569 ఎకరాలు ఆక్రమణదారుల చెరలోనే ఉన్నాయి. రాంబిల్లి మండలంలో 468 ఎకరాలకు గాను 172 ఎకరాలు, అనకాపల్లిలో 397 ఎకరాల్లో 187, నక్కపల్లిలో 409 ఎకరాల్లో 138 ఎకరాలు ఆక్రమణలకు గురైనట్లు గుర్తించారు. అనకాపల్లి పట్టణంలో దేమునిగుమ్మం శ్రీ వేంకటేశ్వరస్వామి దేవాలయాలకు చెందిన విలువైన స్థలాలు, భూములు అన్యాక్రాంతమయ్యాయి. ఆక్రమణదారుల్లో ఒకరు దేముడు స్థలాన్నే ఏకంగా బ్యాంకులో తనఖా పెట్టి రుణం పొందారు. బాకీ చెల్లించక పోవడంతో బ్యాంకు వారు ఆ స్థలాన్ని స్వాధీనం చేసుకోవడానికి ప్రయత్నించారు. ఈ స్థలం విలువ ప్రస్తుత మార్కెట్‌ ధరల ప్రకారం రూ.15 కోట్లు ఉంటుంది.


ఉప ముఖ్యమంత్రి ఇలాకాలో..

ప ముఖ్యమంత్రి బూడి ముత్యాలనాయుడు సొంతూరు తారువాను ఆనుకుని ఉన్న దేవాదాయ భూములకే రక్షణ లేకుండా పోయింది. మారేపల్లిలో సీతారామస్వామి గుడి పేరున 23.15 ఎకరాలుంటే అవి రెండు మూడు చేతులు మారి ఇప్పుడవి ఓ రియల్టర్‌ ఆధీనంలోకి వెళ్లిపోయాయి. వాటిని స్వాధీనం చేసుకోవడానికి దేవాదాయశాఖ తంటాలు పడుతోంది. ఇటీవలే రిజిస్ట్రేషన్లు జరగకుండా 22ఎ (1సి)లో పెట్టినా ఆ స్థిరాస్తి వ్యాపారికి మంత్రి అండదండలుండటంతో బోర్డులు పెట్టడానికి సాహసించలేకపోతున్నారు. కోర్టుల్లో వివాదం నడుస్తోంది.


రాములోరి భూములపై రాబందులు..

ల్లూరి సీతారామరాజు జిల్లా ఎటపాక మండలంలోని పురుషోత్తపట్నంలో సర్వే నెం.01 నుండి 101 వరకు భద్రాచల శ్రీ సీతారాముల వారి దేవస్థానానికి చెందిన సుమారు 890 ఎకరాల భూములు ఉన్నాయి.  ఆ భూముల్లో ప్రస్తుతం సుమారు 105 ఎకరాల భూమి ఆక్రమణ గురయింది. ఇందులో వైకాపాకు చెందిన ప్రజా ప్రతినిధి ఒకరు 15 ఎకరాల్లో వ్యాపార సముదాయం నిర్మించి అద్దెలకు ఇచ్చి సొమ్ము చేసుకుంటున్నారు. అధికార పార్టీ ప్రజా ప్రతినిధి కావటంతో అధికారులు ఏమి చేయలేక చేతులెత్తేశారు. దీన్ని ఆసరాగా చేసుకొని కొందరు అదే వైకాపా ప్రజా ప్రతినిధి అండదండలతో సుమారు 90 ఎకరాల భూమిని ఆక్రమించారు. ఎమ్మెల్సీ అనంత బాబు అనుచరులు ఆక్రమణలకు పాల్పడుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని