logo

రేషన్‌లో కోత.. ధరల వాత

ఇంటింటా రేషన్‌ ఇస్తున్నామని ప్రచారం తప్ప కార్డుదారులకు అందించాల్సిన నిత్యావసరాలను మాత్రం ఇవ్వడం లేదు. బియ్యం తప్ప ఇతర సరకులేవీ లబ్ధిదారులకు అందడం లేదు. అది కూడా కేంద్రం ఇచ్చిన బియ్యంతోనే సరిపెట్టేస్తున్నారు.

Published : 18 Apr 2024 02:25 IST

కందిపప్పు పంపిణీపై చేతులేత్తేసిన జగన్‌
ఈనాడు-అనకాపల్లి, న్యూస్‌టుడే- పాడేరు

ఇంటింటా రేషన్‌ ఇస్తున్నామని ప్రచారం తప్ప కార్డుదారులకు అందించాల్సిన నిత్యావసరాలను మాత్రం ఇవ్వడం లేదు. బియ్యం తప్ప ఇతర సరకులేవీ లబ్ధిదారులకు అందడం లేదు. అది కూడా కేంద్రం ఇచ్చిన బియ్యంతోనే సరిపెట్టేస్తున్నారు. కందిపప్పు ఏ నెలా సక్రమంగా సరఫరా చేయడం లేదు. కాగితాల్లో కేటాయింపులు చూపిస్తున్నా గోదాములకు నిల్వలు చేరడం లేదు. పప్పులే కాదు మిగతా సరకులు అరకొరగానే అందిస్తున్నారు. ఒకనెల పంచదార ఇస్తే మరోనెల గోధుమపిండి ఇస్తున్నారు. ఎప్పుడూ పూర్తిస్థాయిలో రేషన్‌ అందడం లేదు. పైగా వైకాపా సర్కారు వచ్చాక రేషన్‌ సరకుల ధరలు పెంచేసి పేదలపై భారీగా భారం మోపారు.

మ్మడి జిల్లాలో 12.38 లక్షల కుటుంబాలకు బియ్యం కార్డులున్నాయి. కార్డులో ప్రతి కుటుంబ సభ్యునికి ఐదు కేజీల చొప్పున బియ్యం, ఒక్కో కార్డుకు కేజీ కందిపప్పు, అరకేజీ పంచదార ఇవ్వాలి. తెదేపా హయాంలో కేజీ కందిపప్పు రూ.40 చొప్పున రెండు కేజీలు అందజేసేవారు. వైకాపా సర్కారు వచ్చాక కందిపప్పు పరిమాణం కేజీకి తగ్గించేసి.. ధర రూ.67కు పెంచేశారు. అలాగే రూ.10కు అందజేసే అరకేజీ పంచదారను రూ.17కు పెంచారు. అంటే ఒక్కో కార్డుపై రూ.34 అదనంగా భారం పడుతోంది. ఈ లెక్కన జిల్లా మొత్తం మీద 12.28 లక్షల కార్డుదారులపై నెలకు రూ.4.38 కోట్ల ధరల భారం మోపారు. పోనీ సరకులైనా సక్రమంగా అందిస్తున్నారా అంటే అదీ లేదు. జిల్లాలోని కార్డుదారులందరికీ కేజీ కందిపప్పు చొప్పున అందించాలంటే నెలకు 1,238 మెట్రిక్‌ టన్నులు అవసరం. ఆ మేరకు నిల్వలు ఏ నెలా రేషన్‌ దుకాణాలకు చేరడం లేదు. గతేడాది జనవరి నుంచి ఈ ఏడాది ఏప్రిల్‌ వరకు కందిపప్పు కనీస నిల్వలు కూడా పంపించలేకపోయారు. బహిరంగ మార్కెట్‌లో అధిక ధరకు కొనుగోలు చేయలేక బియ్యం, పంచదారతోనే సరిపెట్టుకోవాల్సి వస్తోంది. గోధుమపిండి ఇస్తున్నా, నాణ్యత బాగోలేక తీసుకోవడానికి కార్డుదారులు ఇష్టపడడం లేదు.  

రేషన్‌ కందిపప్పు పంపిణీ చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైంది. రాయితీపై కేజీ రూ.67 చొప్పున ఇవ్వాల్సి ఉండగా ఈ నెల రాలేదు బయటే కొనుక్కోండి అనే మాటే ఎక్కువ వినిపిస్తోంది. బయట మార్కెట్‌లో కేజీ రూ.160 నుంచి రూ.170 పలుకుతోంది. అంటే రేషన్‌ దుకాణాల కంటే బయట కేజికి అదనంగా రూ. 90 నుంచి రూ.100 పైగా ఖర్చుచేయాల్సి వస్తోంది. అంత డబ్బులు పెట్టి పప్పులు కొనలేక పేదలు చింతపండు చారుకే పరిమితం అవుతున్నారు.


కేంద్రం బియ్యంతో జగన్‌ ప్రచారం..

కొవిడ్‌ తర్వాత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వేర్వేరుగా బియ్యం పంపిణీ చేస్తుండేవి. కేంద్రం ఉచితంగా ఇస్తే, రాష్ట్ర ప్రభుత్వం రూ.1 చొప్పున ఇస్తుండేది. గత రెండేళ్లుగా ప్రధానమంత్రి గరీబ్‌ కళ్యాణ్‌ అన్నయోజన (పీఎంజీకేఏవై) ద్వారా ఉచిత బియ్యం మాత్రమే ఇస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే కేజీ రూపాయి బియ్యాన్ని నిలిపేసింది. ఆ మేరకు బియ్యంపై చేసే రూ.కోట్ల ఖర్చును ప్రభుత్వం మిగుల్చుకుంది. కందిపప్పు సరఫరాపైనా చేతులేత్తేశారు. వాస్తవానికి రాష్ట్ర ప్రభుత్వం కేవలం అరకేజీ పంచదార మాత్రమే కార్డుదారుకు అందిస్తోంది. కేంద్రం ఇచ్చే బియ్యాన్ని జగన్‌ బొమ్మలతో ఎండీయూ వాహనాల్లో చేరవేసి తామే ఇస్తున్నట్లు ప్రచారం చేసుకుంటోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని