logo

నామినేషన్ల పర్వం ప్రారంభం

జిల్లాలో ఆరు అసెంబ్లీ, ఒక ఎంపీ స్థానానికి సంబంధించి గురువారం నామినేషన్లు ప్రక్రియ ప్రారంభమైంది.

Published : 19 Apr 2024 02:06 IST

అనకాపల్లిలో ఎన్నికల పరిశీలకుడికి పుష్పగుచ్ఛం అందిస్తున్న జేసీ జాహ్నవి

కలెక్టరేట్, నక్కపల్లి, న్యూస్‌టుడే: జిల్లాలో ఆరు అసెంబ్లీ, ఒక ఎంపీ స్థానానికి సంబంధించి గురువారం నామినేషన్లు ప్రక్రియ ప్రారంభమైంది. అనకాపల్లి అసెంబ్లీ నుంచి పొలమరశెట్టి అంబికాదేవి (పిరమిడ్‌ పార్టీ), సూదికొండల మాణిక్యాలరావు (బీఎస్పీ), ఎలమంచిలి నియోజకవర్గానికి సంబంధించి సుందరపు విజయకుమార్‌ (జనసేన), బోను నాగేశ్వరరావు (రిఫార్మ్స్‌ పార్టీ ఆఫ్‌ ఇండియా), నర్సీపట్నం నుంచి  రాయపురెడ్డి భద్రాచలం (స్వతంత్ర), బొట్టా నాగరాజు (బీఎస్పీ), . అనకాపల్లి పార్లమెంట్ స్థానానికి సంబంధించి పెందుర్తికి చెందిన ఎస్‌కే.షఫీ ఉల్లా (స్వతంత్ర) అభ్యర్థిగా నామినేషన్‌ వేశారు. ఆర్‌ఓ కార్యాలయాన్ని ఎన్నికల పరిశీలకుడు ఆశిష్‌ కుమార్‌ కొండ పరిశీలించారు. కలెక్టరేట్లో కమాండ్‌ కంట్రోల్‌ రూంను అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల పరిశీలకులు ఎన్‌.సంజయ్‌ గాంధీ, ఆశీష్‌ కుమార్‌పాండే గురువారం తనిఖీ చేశారు.

పేటలో తొలిరోజు నిల్‌: ‘పేట’ నియోజకవర్గానికి సంబంధించి తొలిరోజున నామినేషన్లు దాఖలు కాలేదని ఆర్వో కె.గీతాంజలి వెల్లడించారు. నామినేషన్‌ నోటిఫికేషన్‌ను మండల పరిషత్తు కార్యాలయం వద్ద ఎంపీడీఓ వి.శ్రీనివాసరావు ప్రదర్శించారు.

నేడు కొణతాల రామకృష్ణ నామినేషన్‌

లక్ష్మీదేవిపేట (అనకాపల్లి): కూటమి జనసేన ఎమ్మెల్యే అభ్యర్థిగా కొణతాల రామకృష్ణ శుక్రవారం నామినేషన్‌ వేయనున్నారు. పట్టణంలోని రింగురోడ్డు జనసేన కార్యాలయం నుంచి కూటమి శ్రేణులతో ర్యాలీగా బయలుదేరి ఉదయం 9 గంటలకు రిటర్నింగ్‌ అధికారికి నామినేషన్‌ పత్రాలు అందించనున్నారు.

విశాఖ లోక్‌సభ స్థానానికి ముగ్గురు..

విశాఖపట్నం: విశాఖ లోక్‌సభ నియోజకవర్గానికి గురువారం ముగ్గురు అభ్యర్థులు నామపత్రాలు దాఖలు చేశారు. రిటర్నింగ్‌ అధికారి, జిల్లా కలెక్టర్‌ మల్లికార్జున గురువారం ఉదయం లోక్‌సభ ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల చేశారు. అనంతరం కలెక్టరేట్‌లోని తన ఛాంబరులో నామపత్రాలు స్వీకరించారు. ప్రజాశాంతి పార్టీ అధ్యక్షులు కేఎ పాల్‌ (కిలారి ఆనంద్‌పాల్‌) ఒక సెట్‌ పత్రాలు దాఖలు చేశారు. స్వతంత్ర అభ్యర్థిగా వడ్డి హరిగణేష్‌ నామపత్రాలు దాఖలు చేశారు. ఆపిరమిడ్‌ పార్టీ ఆఫ్‌ ఇండియా తరఫున పొలమరశెట్టి సత్యవతి నామపత్రాలను అందజేశారు.

భారీ భద్రత

నక్కపల్లి ఆర్‌ఓ కార్యాలయం సమీపంలో భద్రతపై సీఐలతో మాట్లాడుతున్న డీఎస్పీ అప్పారావు

నక్కపల్లి, న్యూస్‌టుడే: ప్రధాన పార్టీల నుంచి అభ్యర్థులు వేసే నామినేషన్ల రోజున భారీ భద్రత ఏర్పాటు చేయనున్నట్లు ఎస్‌బీ డీఎస్పీ బి.అప్పారావు వెల్లడించారు. నామినేషన్ల ప్రక్రియకు సంబంధించి నక్కపల్లి కార్యాలయ పరిధిలో భద్రత పరిశీలనకు గురువారం ఆయన ఇక్కడకు వచ్చారు. నియోజకవర్గ పరిధిలోని సీఐలతో ఆయన మాట్లాడారు. జాతీయ రహదారి నుంచి కార్యాలయానికి వెళ్లే మార్గంలో మొదటి గేట్‌ వద్దనే అభ్యర్థులు మినహా ఇతర వ్యక్తులను ఎవరినీ అనుమతించొద్దని స్పష్టం చేశారు. ఆర్‌ఓ కార్యాలయానికి వచ్చే అన్ని మార్గాల్లో బారికేడ్లు సక్రమంగా నిర్మించారా, లేదా అని పరిశీలించారు. ప్రక్రియ పూర్తయ్యేంత వరకు అంతా అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు. సీఐలు విజయకుమార్‌, అప్పన్న, అప్పలరాజు, ఎస్సైలు గఫూర్‌, విభీషణరావు తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని