logo

వినలేదు వేదన... ఎందుకీ వంచన!

వైకాపా ఎన్నికల మేనిఫెస్టోని భగవద్గీత, బైబిల్‌, ఖురాన్‌గా వర్ణిస్తూ.. 99 శాతం హామీలు నెరవేర్చేశామని డాంబికాలు పలుకుతున్నారు జగన్‌.

Updated : 19 Apr 2024 04:50 IST

సీపీఎస్‌ రద్దుపై జగన్‌ తొండాట
ప్రశ్నించిన ఉద్యోగులపై ఉక్కుపాదం
ఈనాడు, పాడేరు

సీపీఎస్‌ హామీకి సమాధి కట్టేశారంటూ నిరసన వ్యక్తం చేస్తున్న ఉపాధ్యాయులు (పాత చిత్రం)

వైకాపా ఎన్నికల మేనిఫెస్టోని భగవద్గీత, బైబిల్‌, ఖురాన్‌గా వర్ణిస్తూ.. 99 శాతం హామీలు నెరవేర్చేశామని డాంబికాలు పలుకుతున్నారు జగన్‌. విపక్షనేతగా ఇడుపులపాయ నుంచి ఇచ్ఛాపురం వరకు చేసిన పాదయాత్రలో ఉద్యోగులు కనిపించిన చోటల్లా కాంట్రిబ్యూటరీ పింఛన్‌ విధానాన్ని (సీపీఎస్‌) అధికారంలోకి వచ్చిన వారంలో రద్దు చేసేస్తామని హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చి అయిదేళ్లు గడిచినా ఈ హామీని నిలబెట్టుకోలేకపోయారు. పైగా గ్యారంటీ పెన్షన్‌ స్కీం (జీపీఎస్‌) అంటూ కొత్త విధానాన్ని బలవంతంగా రుద్దుతున్నారు. పాత పింఛను విధానాన్ని (ఓపీఎస్‌) అమలుచేస్తామని ఇచ్చిన హామీ నెరవేర్చాలని అడిగిన వారిని గృహనిర్బంధం చేస్తూ వేధిస్తున్నారు.

అందలమెక్కించిన వారినే అరెస్టులతో అణిచేశారు: సీపీఎస్‌ రద్దుచేస్తానని జగన్‌ ఇచ్చిన హామీని ఉద్యోగ, ఉపాధ్యాయులు నమ్మేశారు. గత ఎన్నికల్లో బహిరంగంగానే వైకాపాకు జైకొట్టారు. పాదయాత్రలో జగన్‌తో కలిసి అడుగులో అడుగువేసి అధికార పీఠంపై కూర్చోబెట్టారు. తీరా అధికారంలోకి వచ్చిన జగన్‌ ఉద్యోగ, ఉపాధ్యాయులకే తిరిగి పాఠాలు నేర్పారు. సీపీఎస్‌ రద్దుచేయడం వీలుకాదని దీని స్థానంలో జీపీఎస్‌ తీసుకొస్తామని ప్రకటించారు. దీనిని వ్యతిరేకిస్తూ ఓపీఎస్‌నే పునరుద్ధరించాలని ఆందోళనలకు పిలుపునిచ్చారు. దీంతో ఉద్యోగ, ఉపాధ్యాయులను ఎక్కడికక్కడ గృహనిర్బంధాలు చేస్తూ, అరెస్టులతో ఉద్యమాలను అణిచేశారు.

నిర్బంధాలతో వేధింపులు

ఉమ్మడి జిల్లాలో 2004 తరవాత నియమితులైన ఉద్యోగులు, ఉపాధ్యాయులు 18,400 మంది వరకు ఉన్నారు. వీరంతా సీపీఎస్‌ పరిధిలో ఉన్నారు. తమకు ఆర్థిక భద్రత లేని సీపీఎస్‌ రద్దు చేయాలని పలు    మార్లు ఆందోళనలు చేపట్టారు. అందులో పాల్గొన్న ఉద్యోగులపై పోలీసు కేసులు పెట్టారు. సంఘ విద్రోహశక్తులపై పెట్టే కేసులు గురువులపై నమోదు చేశారు. ఉద్యోగ సంఘాల చర్చల తర్వాత కొంతమందిపై కేసులు తొలగించినా ఇప్పటికీ ఉమ్మడి విశాఖ జిల్లాలో 10 మందికి పైగా ఉపాధ్యాయులు కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. 2019లో విశాఖలో సాగర సంగ్రామ దీక్ష, 2023 మే నెలలో ఉద్యోగుల ఉప్పెన, జులైలో ఓపీఎస్‌ సాధన ప్రతిఘటనా దీక్ష, గతేడాది సెప్టెంబర్‌ 1న చలో విజయవాడకు పిలుపునివ్వడంతో సీపీఎస్‌ ఉద్యోగులందరినీ నిర్బంధించి ఉద్యమంపై జగన్‌ ఉక్కుపాదం మోపారు.


అడిగితే కేసులు పెడుతున్నారు: సీపీఎస్‌పై ప్రశ్నిస్తే కేసులుపెట్టి వేధిస్తున్నారు. నాపై నాన్‌బెయిలబుల్‌ కేసు పెట్టారు. కోర్టుల చుట్టూ తిరుగుతున్నాం. మా ఉద్యోగుల జీతాల నుంచి ప్రభుత్వం 10 శాతం మినహాయించి దానికి ప్రభుత్వం మరో పది శాతం కలిపి ఉద్యోగి ప్రాన్‌ ఖాతాకు జమచేయాలి. ప్రభుత్వం ఆ సొమ్ములు కూడా సకాలంలో జమ చేయడం లేదు. జీపీఎస్‌ తీసుకురావడం వల్ల ఉద్యోగుల పరిస్థితి పెనం నుంచి పొయ్యిలో పడినట్లయింది.

గూనూరు శ్రీను, సీపీఎస్‌ ఉద్యోగుల సంఘం విశాఖ జిల్లా అధ్యక్షుడు


మోసపోయాం: ఎలమంచిలి పాదయాత్రలో జగన్‌ని కలిసి సీపీఎస్‌ గురించి హామీ పొందాం. బహిరంగంగానే వారం రోజుల్లో రద్దుచేస్తామని ప్రకటించడంతో మేమంతా నమ్మేశాం. అధికారంలోకి వచ్చాకే సీఎం అసలు స్వరూపం బయటపడింది. సీపీఎస్‌ రద్దు చేయకపోగా జీపీఎస్‌ మాపై రుద్దుతున్నారు. జగన్‌ని నమ్మి మోసపోయాం.  

త్రినాథస్వామి, సీపీఎస్‌ ఉద్యోగుల సంఘం అనకాపల్లి జిల్లా ప్రధాన కార్యదర్శి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని