logo

కట్టుకథల జగనన్న కాలనీలు

విశాఖ నగరం నడిబొడ్డున, సముద్రతీరాన, కొండను పిండిచేసి సుమారు రూ. 500 కోట్ల ప్రజాధనంతో తొమ్మిది ఎకరాల్లో రాజసౌధం నిర్మించుకున్నారు జగన్‌.

Updated : 19 Apr 2024 04:51 IST

పునాదుల దశ దాటని ఇళ్లు సగానికి పైనే
అనువుగాని చోట ఇచ్చి కట్టాలని ఒత్తిడి..
కనీస వసతులు కరవు
ఈనాడు, పాడేరు - న్యూస్‌టుడే, రంపచోడవరం, అరకులోయ, నక్కపల్లి

విశాఖ నగరం నడిబొడ్డున, సముద్రతీరాన, కొండను పిండిచేసి సుమారు రూ. 500 కోట్ల ప్రజాధనంతో తొమ్మిది ఎకరాల్లో రాజసౌధం నిర్మించుకున్నారు జగన్‌. దానికి ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం అని పేరుపెట్టుకున్నారు. మరి అదే ప్రాంతంలో పేదల ఇళ్లకు వచ్చేసరికి మాత్రం సెంటు, సెంటున్నర స్థలాలతో సరిపెట్టేశారు. అంతకంటే ఎక్కువ స్థలం ఇస్తే పెద్దోళ్లయిపోతారేమోనని భయపడినట్లున్నారు. పోనీ అవైనా అనువైన చోట ఇచ్చారంటే ఉన్న ఊరికి దూరంగా కొండలు, గుట్టలు, శ్మశానాలు, గెడ్డలు, వాగుల పక్కన చూపించారు. అక్కడ ఇళ్లు కట్టుకోలేక.. స్థలం వదులుకోలేక లబ్ధిదారులు సతమతం అవుతున్నారు. ఉమ్మడి జిల్లాలో మంజూరైన ఇళ్లలో సగానికి పైగా పునాదుల దశ దాటలేదంటే జగనన్న కాలనీల దుస్థితికి అద్దం పడుతుంది.

ఈ గెడ్డ దాటితేనే నక్కపల్లి మండలం కాగిత లేఅవుట్‌కు చేరేది!

అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో 72,623 ఇళ్లు మంజూరు చేశారు. అనకాపల్లి జిల్లాలో 682 లేఅవుట్లలో సెంటున్నర చొప్పున స్థలాలు ఇచ్చారు. అనకాపల్లి, ఎలమంచిలి, నర్సీపట్నం పరిధిలో 60 గజాల చొప్పున స్థలాలు కేటాయించారు. అల్లూరి జిల్లాలో ఇళ్లను లబ్ధిదారుల సొంత స్థలాల్లో నిర్మించుకునేలా మంజూరు చేశారు. అనకాపల్లి జిల్లాలో లబ్ధిదారులకు ఇచ్చిన స్థలాలు చాలావరకు కొండవాలు, లోతట్టు ప్రాంతాల్లో ఇవ్వడంతో ఇళ్ల నిర్మాణాలకు ఎవరూ ముందుకు రావడం లేదు. ఆ స్థలాలను చదను చేసే పేరుతో అధికార పార్టీ నేతలు రూ.కోట్ల మింగేశారు. లేఅవుట్ల అభివృద్ధి కోసమంటూ కొండలు తవ్వి గ్రావెల్‌ అమ్మేసుకున్నారు. జగనన్న కాలనీలతో పెద్దలయితే లాభం పొందారు.. ప్రభుత్వం ఇచ్చే అరకొర సొమ్ములతో ఇళ్ల పనులు మొదలుపెట్టిన పేదలు మరింత అప్పుల్లో కూరుకుపోయారు.

పాపయ్య సంతపాలెంలో బయటకు అందంగా కనిపిస్తున్న ఇళ్ల లోపల సొగసు ఇదీ..

గుత్తేదారు కట్టింది గూళ్లే

అనకాపల్లి మండలం మామిడిపాలెం, పాపయ్యపాలెం. పాపయ్యసంతపాలెం, కోడూరు, కూండ్రం, వేటజంగాల పాలెం, సత్యనారాయపురం ప్రాంతాల్లో 5425 మందికి సెంటు స్థలం చొప్పున కొండ ప్రాంతాల్లో కేటాయించారు. అవన్నీ కొండవాలు ప్రాంతాలు కావడంతో ప్రభుత్వం ఇచ్చిన సొమ్ముతో నిర్మాణాలకు ఎవరూ ముందుకు రాలేదు. దీంతో ఓ గుత్తేదారునికి ఈ ఇళ్ల నిర్మాణ బాధ్యతను అప్పగించారు. వారు నిర్మించిన ఇళ్లు పైన పటారం..లోన లొటారం అన్న తీరున ఉన్నాయి. రూ.1.8 లక్షలతో అగ్గిపెట్టెలాంటి ఇంటిని నిర్మించి పైన సున్నం పూసి.. లోపల పనులేవీ చేయకుండా వదిలేశారు.

ఒక్క పునాదీ పడలేదు...

ఐ.పోలవరంలో స్థలాలకు మార్కింగ్‌ (పాత చిత్రం)

రంపచోడవరం నియోజకవర్గం 11 మండలాల్లో సుమారు 400 మందికి స్థలాలు కేటాయించారు. కానీ గృహ నిర్మాణాలకు ప్రభుత్వం నిధులు మంజూరు చేయలేదు.. దీంతో నియోజకవర్గం మొత్తంమీద ఒక్క పునాది కూడా పడలేదు.


పిచ్చిమొక్కలే మిగిలాయి!

చింతపల్లిలో సగంలో నిలిచిన నిర్మాణం

చింతపల్లి మండలంలో 98 మంది గిరిజనులకు పట్టాలు పంపిణీ చేశారు. చింతపల్లి, బెన్నవరం, పశువులబందలో లేఅవుట్లు వేశారు. అనువుగాని ప్రాంతం కావడంతో ఏ ఒక్కరూ లేఅవుట్‌లో ఇల్లు నిర్మించుకోలేదు. పశువులబంద లేఅవుట్‌లో సెల్‌ టవర్‌ నిర్మించారు. చింతపల్లి, బెన్నవరంలోలో తుప్పలు, పిచ్చిమొక్కలు పెరిగిపోయాయి.

చింతపల్లి గ్రామీణం, న్యూస్‌టుడే


కొండని చూపించి కాలనీ అంటే ఎలా?

అరకులోయ సీఏహెచ్‌ పాఠశాల సమీపంలో కొండ ఉంది. ఇక్కడ సర్వే రాళ్లు పాతి 120 మంది లబ్ధిదారులకు స్థలం కేటాయించేశామని ప్రకటించేశారు. కనీసం కొండను చదును చేయకపోవడంతో ఎలా నిర్మాణాలు చేపట్టాలో లబ్ధిదారులకు
తెలియడం లేదు. అక్కడకు వెళ్లేందుకు మట్టి రోడ్డు మాత్రమే ఉంది. దీంతో ఒక్కరూ నిర్మాణం ప్రారంభించలేదు.

అరకులోయ, న్యూస్‌టుడే  


కట్టకుంటే పట్టాలు వెనక్కి అంటూ బెదిరింపులు

  • నక్కపల్లి మండలంలో 37 లేఅవుట్లలో సుమారు 1800 మందికి ఇళ్ల పట్టాలిచ్చారు. వీటిలో దాదాపు 600 మందికి పైగా ఇళ్లు నిర్మించుకునే భాగ్యానికి నోచుకోలేకపోయారు. ఇందులో చాలా వరకు అనువుగాని స్థలాలు, మౌలిక సదుపాయాలకు నోచుకోనివే ఉన్నాయి. ఇల్లు కట్టుకోకపోతే స్థలం వెనక్కి తీసుకుంటామని బెదిరించడంతో కొన్నిచోట్ల నిర్మించినా వారు పడుతున్న కష్టాలు వర్ణనాతీతం. గతేడాది కురిసిన భారీ వర్షాలకు ఇవన్నీ జలమయం కాగా, బాహ్య ప్రపంచంతో వీటికి రెండు రోజులపాటు సంబంధం తెగిపోయింది.
  • రావికమతం మండలంలో 22 చోట్ల జగనన్న లేఅవుట్‌లు వేసి 612 మంది లబ్ధిదారులకు ఇళ్లు మంజూరు చేశారు. వీటిలో ఇప్పటి వరకు కేవలం 133 ఇళ్లు మాత్రమే పూర్తయ్యాయి. కాలనీల్లోకి వెళ్లేందుకు రోడ్లు, తాగునీటి కుళాయిలు, విద్యుత్తు, డ్రైనేజీలు వంటి కనీస వసతులు చాలా చోట్ల కనిపించట్లేదు. కొత్తకోట, గంపవానిపాలెంలోని 262 మంది లబ్ధిదారులకు రోలుగుంట మండలం దెబ్బలపాలెంకు చేరువలో ఇంటి స్థలాలు ఇవ్వగా అక్కడ ఇళ్ల నిర్మాణాలు జరగట్లేదు. కవగుంట, పి.పొన్నవోలు, చిలకవానిపాలెం, టి.అర్జాపురంలో గతంలో ఖాళీ చేసిన పాత ఊరిపట్టు, ఉన్న ఊరికి దూరంగా, కొండ వాలు ప్రాంతం, మహిళలు బహిర్భూమి స్థలాల్లో జగనన్న లే అవుట్‌లు వేయగా అక్కడికి వెళ్లేందుకు, ఇళ్లు కట్టుకునేందుకు లబ్ధిదారులు ఆసక్తి చూపట్లేదు.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని