logo

నిర్వాసితులను ముంచిన జగన్‌

జగన్‌మోహన్‌రెడ్డి ఎన్నికల ముందు,  ఎన్నికల తర్వాత జిల్లాలో పర్యటించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా పాడేరు పట్టణంలో పర్యటించి అనేక హామీలు గుప్పించారు.

Published : 20 Apr 2024 01:50 IST

పాడేరు/పట్టణం, వరరామచంద్రాపురం  న్యూస్‌టుడే: జగన్‌మోహన్‌రెడ్డి ఎన్నికల ముందు,  ఎన్నికల తర్వాత జిల్లాలో పర్యటించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా పాడేరు పట్టణంలో పర్యటించి అనేక హామీలు గుప్పించారు. అధికారంలోకి వచ్చిన తర్వాత గిరి పుత్రులకు ఇచ్చిన హామీల అమలును పూర్తిగా విస్మరించారు.  పోలవరం ముంపు గ్రామాల బాధితులకు ఇచ్చిన హామీలేవీ నెరవేర్చలేదు. చివరకు గోదావరి వరదల సమయంలోనూ ఆదుకోలేదు. కేంద్రం నిధులిస్తేనే నిర్వాసితులకు పరిహారం అందించగలమని పూర్తిగా మడం తిప్పేశారు.

పరిహారం పెంచలేదు

- బొర్రా నర్సింహరావు, వీఆర్‌పురం

మాకు 14 ఎకరాల పొలం ఉంది. 2008లో ఎకరాకు రూ. లక్షా 15 వేల చొప్పున పది ఎకరాలకు పరిహారం సొమ్ము అందజేశారు. తాను అధికారంలోకి వస్తే, మళ్లీ కొంత సొమ్ముని పరిహారంగా వేస్తానని జగన్‌ హామీ ఇచ్చినా కార్యాచరణ చేపట్టలేదు. ఎన్నికల ముందు మమ్మల్ని మాయ చేశారు. ఆ తర్వాత ఇచ్చిన మాట తప్పారు. ఒక్క రూపాయి కూడా అదనంగా సాయం చేయలేదు.


ముంపు బాధితులను మోసం చేశారు

- ముత్యాల చంద్రశేఖర్‌, వడ్డిగూడెంచ వీఆర్‌పురం మండలం

మాట తప్పను.. మడమ తిప్పను అంటూ ఎన్నికల ముందు, అధికారంలోకి వచ్చిన తర్వాత పదేపదే చెప్పిన జగన్‌ పరిహారం చెల్లింపులో మమ్మల్ని అన్యాయం చేశారు. మాకు ఏడు ఎకరాల పొలానికి అదనంగా పరిహారం వస్తుంది.. అప్పులు తీర్చుకోవచ్చు అనుకున్నాం. వేరేచోట ఉపాధికి అవసరమైన మార్గాలు చూసుకుందామనుకున్నాం. ఆశపెట్టి వదిలేశారు. పోలవరం ముంపు బాధితులను మోసం చేశారు.


మాట నిలుపుకోలేదు

- ఎన్‌ రాజు, శ్రీరామగిరి, వీఆర్‌పురం మండలం

పోలవరం ముంపు బాధితులకు ఇచ్చిన ఏ హామీని జగన్‌ నిలబెట్టుకోలేక పోయారు. పాత పరిహారం ఇవ్వలేదు. పంట నష్టపరిహారం పూర్తిస్థాయిలో ఇవ్వలేదు. నా నాలుగు ఎకరాల భూమికి అప్పటి కాంగ్రెస్‌ ప్రభుత్వంలో పరిహారం వచ్చింది. వైకాపా అధికారంలోకి వస్తే, కొంత పరిహారం అందిస్తానన్న హామీ నీటిమూటలయ్యాయి.


ప్రత్యేక డీఎస్సీ ఊసే లేదు

- రమణమూర్తి, చాపరాతిపాలెం

మాది గూడెంకొత్తవీధి మండలం మారుమూల చాపరాతిపాలెం. మా నాన్న వ్యవసాయ పనులు చేస్తూ నన్ను డైట్‌ చదివించారు. ప్రత్యేక డీఎస్సీ ద్వారా ఉపాధ్యాయ వృత్తిలో స్థిరపడదామని ఐదేళ్ల నుంచి ఆశగా ఎదురు చూస్తున్నాను. వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రత్యేక డీఎస్సీ ప్రకటించలేదు. జీవో నం.3పై రివ్యూ పిటిషన్‌ కూడా వేయలేదు. ప్రభుత్వం మారితే ఉపాధి అవకాశాలు పెరుగుతాయనే భావిస్తున్నాం.


జీవో నం 3పై తాత్సారం

- ఆర్‌.రోజా, కక్కి, పాడేరు మండలం

మాది పాడేరు మండలం మారుమూల కక్కి గ్రామం. డిగ్రీ వరకు చదువుకున్నాను. జీవో నం 3ను సుప్రీంకోర్టు రద్దు చేయడంతో గిరిజన నిరుద్యోగుల పరిస్థితి దయనీయంగా మారింది. వైకాపా ప్రభుత్వం జీవో నం.3పై రిట్‌ పిటిషన్‌ కూడా వేయలేదుŸ మూడేళ్లుగా పోరాటం చేస్తున్నా ఈ ప్రభుత్వానికి చీమ కుట్టినట్లు కూడా లేదు. వైకాపాలో పాలనలో నాలాంటి నిరుద్యోగుల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది.


పునాది రాయేలేదు

- పి.తాతాజీ, రాజయ్యపేట

అనకాల్లి జిల్లా నక్కపల్లి ప్రాంతంలో రెండు జెట్టీలు మంజూరయ్యాయంటే చాలా ఆనందించాం. దీని ద్వారా వేటకు వెళ్లే తెప్పలను ఒడ్డుకు తెచ్చే పని ఉండదు. ప్రధానంగా లభించిన వేటకు నాణ్యత, మంచి ధర లభించేది. చుట్టుపక్కల గ్రామాల మత్స్యకారులకు చాలా మేలు జరిగేది. ఇలాంటి సదుపాయం లేక చాలామంది ఇక్కడినుంచి ఇతర ప్రాంతాల్లో వేటకు వెళ్లిపోతున్నారు. మంజూరై రెండేళ్లవుతున్నా ఇంత వరకు పునాదిరాయే వేయలేదు. అధికారులు వచ్చి వెళ్లడం తప్పితే చేసిందేమీలేదు.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని