logo

ఊకదంపుడు మాటలు.. ఉత్తుత్తి చేతలు

మాట తప్పనన్నారు..మడమ తిప్పనన్నారు..నా అంతటివాడు లేడన్నారు..విశ్వాసానికి నిలువెత్తు నిదర్శనమంటూ గొప్పలు చెప్పారు..

Published : 20 Apr 2024 02:35 IST

ఐదేళ్లలో అన్నివర్గాలకూ అన్యాయం
అనకాపల్లి జిల్లాను మోసపుచ్చేందుకు నేడు జగన్‌ సిద్ధం
న్యూస్‌టుడే బృందం

మాట తప్పనన్నారు..
మడమ తిప్పనన్నారు..
నా అంతటివాడు లేడన్నారు..
విశ్వాసానికి నిలువెత్తు నిదర్శనమంటూ గొప్పలు చెప్పారు
..

మాటల గారడీలో మాయల మరాఠీని మించిపోయారు
అధికారంలోకి వస్తే అన్ని సమస్యలు తీర్చేస్తానని, అందరినీ ఉద్ధరిస్తానని వాగ్దానాలు చేశారు.

పర్యటించిన ప్రతిచోటా
కొండంత హామీలు కుమ్మరించి
అధికారంలోకి వచ్చిన జగన్‌కు
గోరంత పనులు చేయడానికీ మనసు రాలేదు.అన్నది అన్నచోటే..
విన్నది విన్నచోటే..మరిచిపోయారు.

మళ్లీ ఎన్నికలు  ముంచుకొచ్చాయి..
చేసిందేమీ లేక పోయినా,
ఎంతో చేసేశామంటూ..
మన ముందుకొస్తున్నారు.
‘మేమంతా సిద్ధం’ పేరుతో సీఎం జగన్‌మోహన్‌రెడ్డి  బస్సు యాత్రగా జిల్లాకు వస్తున్న నేపథ్యంలో ఆయన ఇచ్చిన హామీలు, నెరవేరని వైనంపై కథనం.

తాగునీరు.. తాగలేరు

సీఎంగా ప్రమాణ స్వీకారం చేశాక 2019లో తొలిసారిగా విశాఖపట్నంలో అడుగుపెట్టిన జగన్‌మోహన్‌రెడ్డి అనకాపల్లి పట్టణ ప్రజలకు శుద్ధి చేసిన తాగునీరు అందిస్తానని ప్రకటించారు. ఇందుకోసం రూ. 32 కోట్లతో అనకాపల్లి నుంచి అగనంపూడికి పైప్‌లైన్‌ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ ఐదేళ్లలో 50 శాతం పనులు కూడా పూర్తి కాలేదు. పట్టణవాసులు ప్రతి రోజూ కలుషిత నీటినే తాగాల్సి వస్తోంది. స్వయంగా సీఎం శంకుస్థాపన చేయడంతో పరిశుభ్రమైన తాగునీరు అందుతుందన్న అనకాపల్లి వాసుల ఆనందం ఆవిరైంది.

ఉద్యోగాలు  లేవు..

ప్రతిపక్ష నేత హోదాలో జగన్‌ 2018 ఆగస్టులో ఎలమంచిలి నియోజకవర్గంలో పాదయాత్ర చేశారు. అచ్యుతాపురం ప్రత్యేక ఆర్థిక మండలి (సెజ్‌) ఏర్పాటుకు భూములిచ్చిన తమకు ఉపాధి కల్పించలేదంటూ నిర్వాసితులు, అన్నదాతలు ఆయనకు మొర పెట్టుకున్నారు. వైకాపా అధికారంలోకి వచ్చాక నిర్వాసితులకు స్థానిక కంపెనీల్లో 75 శాతం ఉపాధి కల్పించేలా చర్యలు తీసుకుంటామని జగన్‌ హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చాక ఈ మాట మర్చిపోయారు. నిర్వాసితులు ఎవరికీ ఉపాధి కల్పించలేదు.

రైతులకిచ్చిన హామీలు గంగపాలు

అచ్యుతాపురం మండలం లోని కొండకర్ల ఆవ అభివృద్ధి చేస్తామని... రాంబిల్లి మండలంలో పొలాలు ముంపునకు గురికాకుండా ఉప్పరిగెడ్డ, మాలగెడ్డ, ఎర్రిగెడ్డలను ఆధునికీకరిస్తానని పాదయాత్ర సమయంలో హామీ ఇచ్చారు. మేజర్‌, మైనర్‌ శారదా నదుల గట్లు పటిష్ఠం చేస్తామని చెప్పారు. శారదా నది ఆనకట్టను పటిష్ఠం చేస్తామని భరోసా ఇచ్చారు. ఈ ఐదేళ్లలో జల వనరులకు ఒక్క రూపాయీ ఖర్చు పెట్టలేదు. ఉప్పరగెడ్డలో ఆరు ఎకరాలు వైకాపా నాయకుడు ఆక్రమించినా పట్టించుకోలేదు.


బెల్లం రైతుకు జెల్ల!

అనకాపల్లి అంటేనే మనకు గుర్తుకొచ్చేది తియ్యటి బెల్లం. బెల్లానికి గిట్టుబాటు ధరలు లేక రైతులు ఇబ్బందులు పడుతున్నారు. పాదయాత్రలో రైతులు కష్టాలు అడిగి తెలుసుకున్నాను. మన ప్రభుత్వం వచ్చిన వెంటనే బెల్లం రైతులను అన్నివిధాలా ఆదుకుంటాను..’

2018 ఆగస్టు 29న అనకాపల్లి నెహ్రూచౌక్‌ వద్ద నిర్వహించిన బహిరంగ సభలో జగన్‌ అన్న మాటలివీ. కానీ ఇందుకు పూర్తి భిన్నంగా వైకాపా ప్రభుత్వం వచ్చాక బెల్లం రైతుల పరిస్థితి మరింత దిగజారింది. గిట్టుబాటు ధరలు దక్కలేదు సరికదా.. తెదేపా హయాంలో అమలు చేసిన రైతుబంధు ఎత్తివేశారు. గత ప్రభుత్వంలో నల్లబెల్లంపై నిషేధం తొలగిస్తే.. వైకాపా హయాంలో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లోని రైతులు, వ్యాపారులపై నల్లబెల్లం పేరుతో వేధింపులకు దిగారు. దీంతో అనేకమంది వ్యాపారులు బెల్లం అమ్మకాలకు స్వస్తి చెప్పారు. అనకాపల్లి మార్కెట్‌లో 2013-14 సీజన్‌లో 35.95 లక్షల బెల్లందిమ్మలు అమ్మితే ఈ ఏడాది పది లక్షలు దాటలేదు.


ఏలేరు పేరు చెప్పి ఏమార్చారు

‘ఏలేరు-తాండవ కాలువల అనుసంధానం ప్రాజెక్ట్‌ నిర్మాణం ఈ ప్రాంత రూపురేఖలు మార్చబోయే కార్యక్రమం. దీనివల్ల ఆయకట్టుకు సాగునీటి స్థిరీకరణ జరుగుతుంది. రూ.470 కోట్లతో ఆరు లిప్ట్‌లు పెడుతున్నాం. టెండర్లు పూర్తయ్యాయి. సర్వే పూర్తి కావొచ్చింది. త్వరలోనే పనులు ప్రారంభమవుతాయి’

2022 డిసెంబర్‌ 30న నర్సీపట్నం పురపాలికలోని జోగునాథునిపాలెం వద్ద ఏలేరు-తాండవ కాలువల అనుసంధాన ప్రాజెక్టు శంకుస్థాపన ఫలకం ఆవిష్కరణ సమయంలో సీఎం జగన్‌ చెప్పిన మాటలివి. తమకిక సాగునీటికి బెంగ ఉండదని రైతులంతా సంబరపడ్డారు. వాస్తవానికి ఈ ప్రాజెక్ట్‌ 24 నెలల్లో పూర్తి కావాలి. ఏడాదిన్నర గడిచినా సర్వేకు సంబంధించిన పరిశీలన, భూసేకరణకు సంబంధించి నిధుల ప్రతిపాదనలు తప్ప అడుగైనా ముందుకు పడలేదు. ఈ పథకం కార్యాచరణకు ఆరు చోట్ల ఎత్తిపోతల పథకాలు నిర్మించాల్సి ఉంది. ఇందుకు 40 ఎకరాలను భూ-సేకరణ ద్వారా తీసుకోవాల్సి ఉంది. ఇందుకు రూ.7 కోట్లు అవసరమని ధవళేశ్వరం జలవనరులశాఖ అధికారులు ప్రభుత్వానికి నివేదించారు. ఈ ప్రక్రియ పూర్తయితే పనులు మొదలు పెట్టేందుకు వీలుంటుంది.


వలలో మత్స్యకారులు విలవిల

మ్మపెట్టదు... అడుక్కు తిననివ్వదనే సామెత మత్స్యకారుల విషయంలో రుజువైంది. ఏపీఐఐసీ పైపులైన్‌ కారణంగా ఉపాధి కోల్పోయిన మత్స్యకారులకు తెదేపా ప్రభుత్వం రూ. 1.25 లక్షల పరిహారం ప్రకటించింది. దాన్ని తీసుకోవద్దని, తాను అధికారంలోకి వస్తే రూ. 5 లక్షల చొప్పున అందిస్తామని జగన్‌ నమ్మబలికారు. ఈ హామీతో మత్స్యకారులు తెదేపా ప్రభుత్వం ప్రకటించిన ప్యాకేజీ తీసుకోలేదు. ఐదేళ్ల కాలం ఎదురుచూపులే తప్ప జగన్‌ పైసా విదల్చలేదు. దీంతోపాటు పూడిమడకలో మినీ ఫిషింగ్‌ హార్బర్‌ నిర్మిస్తానంటూ ఐదేళ్లూ కబుర్లతో కాలం గడిపేశారు. పూడిమడకలో తెదేపా ప్రభుత్వం ప్రకటించిన పర్యటక ప్రాజెక్టును సైతం అటకెక్కించారు.


ముందు డబ్బులిస్తామని.. ఆనక డబ్బుల్లేవని..

చింతూరు, న్యూస్‌టుడే: జగనన్న పాలనలో తమ బతుకులు మారిపోతాయని ఎదురు చూసిన పోలవరం నిర్వాసితుల కుటుంబాలకు నిరాశే మిగిలింది. 2008, 2010 సంవత్సరాల్లో కాంగ్రెస్‌ ప్రభుత్వం చేపట్టిన భూ సేకరణలో రైతులకు ఎకరాకు రూ. 1.15 లక్షల నుంచి రూ. 1.40 లక్షలు మాత్రమే ఇచ్చారు. ఇది చాలా తక్కువ మొత్తమని, వైకాపా ప్రభుత్వం ఏర్పడగానే ఎకరాకు రూ. 5 లక్షలు అదనంగా చెల్లిస్తామని జగన్‌ ఎన్నికల ప్రచారంలో ఊదరగొట్టారు. మళ్లీ ఎన్నికలు వస్తున్నా ఒక్క రైతుకు కూడా రూపాయి ఇవ్వలేదు. 373 ముంపు గ్రామాల్లో 1,06,006 నిర్వాసిత కుటుంబాల బాగోగులపై ప్రభుత్వం ఏమీ పట్టనట్లు వ్యవహరిస్తోంది. 2022 వరదల సమయంలో 41.15 కాంటూరు పరిధిలోని గ్రామాలను అదే సంవత్సరం సెప్టెంబరు నెలాఖరుకల్లా పునరావాస గ్రామాలకు తరలిస్తామని చెప్పారు. రెండేళ్లు గడుస్తున్నా, ఒక్క గ్రామానికి కూడా పునరావాసం చూపించలేని దుస్థితి. వరదల బాధితులను పరామర్శించేందుకు 2022 జులై 28న ముఖ్యమంత్రి హోదాలో చింతూరు మండలం కుయిగూరు వచ్చారు. పోలవరం పరిహారం చెల్లించేందుకు డబ్బులు లేవంటూ చెప్పడానికే వచ్చానని ఆయన చెప్పడంతో నిర్వాసితులు విస్తుపోయారు.


గిరిజనులకు చెప్పినవన్నీ అబద్ధాలే

పాడేరు, న్యూస్‌టుడే: మన్యం ప్రజలకు 2019 సాధారణ ఎన్నికల ప్రచారంలో భాగంగా పాడేరు పట్టణ నడిబొడ్డున జగన్‌ పలు హామీలు గుప్పించారు. అధికారంలోకి వచ్చాక వాటన్నింటినీ గాలికొదిలేశారు.

  • గిరి ప్రజల జీవితాలను విఘాతం కలిగించే బాక్సైట్‌ తవ్వకాలను ఎట్టి పరిస్థితుల్లో తవ్వేది లేదని సభాముఖంగా ప్రకటించారు. ప్రత్యక్షంగా బాక్సైట్‌ తవ్వకాలు జరపక పోయినా లేటరైట్‌, ఇతర ఖనిజ సంపదను తరలించి గిరిపుత్రులకు నమ్మకద్రోహం చేశారు.
  • వైకాపా అధికారంలో వచ్చిన తక్షణమే ప్రతి ఐటీడీఏ కేంద్రంలో ఓ సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మిస్తామని నమ్మబలికారు. తీరా ఐదేళ్లు గడిచినా ఏ ఒక్క ఐటీడీఏ కేంద్రంలోనూ ఈ హామీ నెరవేరలేదు.
  • 500 జనాభా దాటిన తండాలను పంచాయతీలుగా మారుస్తామని హామీ ఇచ్చారు. ఈ ఐదేళ్లలో మన్యంలో ఒక్క పంచాయతీ ఏర్పడలేదు
  • ఐటీడీఏ పరిధిలో ఏళ్ల తరబడి భర్తీ కాక పేరుకుపోయిన బ్యాక్‌లాగ్‌ పోస్టులు దశలవారీగా భర్తీ చేస్తామని చెప్పారు. కానీ ఏ ఒక్క పోస్టూ భర్తీ చేయలేదు. పైగా స్థానికులకు వంద శాతం ఉద్యోగాలు కల్పించే జీఓ నం. 3ని సుప్రీంకోర్టు రద్దు చేస్తే కనీసం ప్రభుత్వం తరపున రిట్‌ పిటిషన్‌ కూడా వేయలేదు.
  • 45 ఏళ్లు దాటిన గిరిజనులకు పింఛను పథకాన్ని అమలు చేస్తామని చెప్పారు. పాడేరు కేంద్రంగా ఇంజినీరింగ్‌ కళాశాల తీసుకొస్తామని చెప్పారు. అరకులోయలో గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటు చేస్తామన్నారు. ఈ హామీలు నీటిమూటలుగానే మిగిలిపోయాయి.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని