logo

ఛార్జీల బాదుడు.. బాధలు బోలెడు!

ఆర్టీసీ ప్రయాణం.. సురక్షితం. సుఖమయం. ఇది ఒకప్పటి మాట, ఇప్పుడు బస్సు ఎక్కితే సకాలంలో, సరిగ్గా గమ్యం చేరుతామనే నమ్మకం లేని దుస్థితి.

Updated : 22 Apr 2024 06:55 IST

నానాటికీ తీసికట్టుగా ఆర్టీసీ సేవలు
ఛార్జీల పెంపుతో ఐదేళ్లలో రూ. 40 కోట్ల భారం
ఈనాడు, అనకాపల్లి,  న్యూస్‌టుడే, పాడేరు, నర్సీపట్నం అర్బన్‌, సీలేరు, మారేడుమిల్లి

 • ఆర్టీసీ ప్రయాణం.. సురక్షితం. సుఖమయం. ఇది ఒకప్పటి మాట, ఇప్పుడు బస్సు ఎక్కితే సకాలంలో, సరిగ్గా గమ్యం చేరుతామనే నమ్మకం లేని దుస్థితి.
 • నడిచే బస్సు చక్రాలు ఊడిపోవడం, స్టీరింగ్‌ డ్రైవర్‌ చేతిలో వచ్చేయడం, అర్ధరాత్రి అడవి మధ్యలో ఆగిపోయి బిక్కుబిక్కుమంటూ జాగారం చేయడం..
 • ఇలా అయిదేళ్ల జగన్‌ పాలనలో ఆర్‌టీసీ ప్రయాణికులకు చాలా చేదు అనుభవాలే ఎదురయ్యాయి. ఆర్‌టీసీని సొంత జాగీరులా మార్చేశారు. సేవల్లో లోపాలను సరిదిద్దకపోగా ఛార్జీలను మాత్రం రెట్టింపు చేశారు.

గతంలో ఓ వెలుగు వెలిగిన ఉమ్మడి జిల్లాలోని ఆర్టీసీ డిపోలు ప్రస్తుతం డొక్కు బస్సులతో కుంటినడకన నడుస్తున్నాయి. ప్రభుత్వంలో విలీనం చేసి ధీర్ఘకాలిక లీజుల పేరుతో సంస్థ ఆస్తులు, స్థలాలు ప్రైవేటు వ్యక్తులకు అప్పగించేస్తున్న సర్కారు ప్రజలకు మెరుగైన రవాణా వసతిని కల్పించలేకపోయింది. అధికార పార్టీ అడిగిందే తడవుగా బస్సులను సిద్ధం చేస్తున్న ఆర్టీసీ ప్రయాణికుల బాధలను మాత్రం పట్టించుకున్న పాపాన పోవడం లేదు.

ఎడ్లకొండ వద్ద ఊడిపోయిన పాతకోట బస్సు చక్రాలు (పాతచిత్రం)

జగన్‌ బాదుడు ఇలా..

వైకాపా అధికారంలోకి వచ్చాక ఆర్టీసీ ఛార్జీలను ఏటా పెంచుతూ వస్తున్నారు. 2019లో పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్‌, అల్ట్రా డీలక్స్‌, సూపర్‌ లగ్జరీ బస్సుల్లో కిలోమీటర్‌కి 73 పైసల నుంచి రూ. 1.36 వరకు ఉంటే.. జగన్‌ వచ్చాక వాటిని 85 పైసల నుంచి రూ. 1.62కు పెంచేశారు. 2022 ఏప్రిల్‌లో ఒకసారి, అదే ఏడాది జూన్‌లో మరొకసారి ఛార్జీలు బాదేశారు. అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో మూడు ఆర్టీసీ డిపోల పరిధిలో 250 వరకు బస్సులున్నాయి. వీటిద్వారా సేవలు అంతంతమాత్రంగానే అందుతున్నా ఛార్జీల బాదుడుతో ప్రయాణికులపై రూ. 40 కోట్ల భారం మోరం మోపారు. పేద, మధ్యతరగతి ప్రజలే ఎక్కువగా ఆర్టీసీ బస్సులను ఆశ్రయిస్తుంటారు. వారిపైనే ఛార్జీల భారం ఎక్కువగా కనిపిస్తోంది. ఇక విద్యార్థులు, చిరుద్యోగులు నెలవారీ పాస్‌ల రేట్లు రెట్టింపు చేసేశారు. బస్సెక్కే ప్రయాణికుల నుంచి పిండుకోవడమే లక్ష్యంగా సర్కారు అడుగులు వేస్తోంది.

బస్సు సర్వీసులు లేకపోవడంతో ఆటోలో ప్రమాదకరంగా ప్రయాణీస్తున్న గిరిజనులు

 • పాడేరు డిపోలో ఉన్న 45 బస్సుల్లో 24 బస్సులు 8 లక్షల కిలోమీటర్లకు పైబడి తిరిగినవే. మిగతావి సుమారు 6 లక్షల నుంచి ఏడు లక్షల కిలోమీటర్లు తిరిగిన బస్సులతోనే నెట్టుకొస్తున్నారు. ఐదేళ్ల వైకాపా పాలనలో కొత్తవి ఏవీ రాలేదు. ఘాట్‌రోడ్డులో 8 లక్షల కిలోమీటర్లు తిరిగిన బస్సులు మార్చాల్సి ఉన్నా అదేం పట్టించుకోవడం లేదు. పాడేరు నుంచి చింతపల్లి, సీలేరు, డొంకరాయి వెళ్లే ఆర్టీసీ బస్సులు నిత్యం మరమ్మతులకు గురవుతున్నాయి.
 • నర్సీపట్నం డిపోలో 26 అద్దె, 76 సంస్థ బస్సులు ఉన్నాయి. వీటిలో 15 లక్షల కిలోమీటర్లు తిరిగినవి సైతం నిన్నా, మొన్నటివరకు తిరిగాయి. ఇంకో రెండు తక్కుగా మార్చాల్సిన తరుణానికి దగ్గరగా ఉన్నాయి. ఏటా పది నుంచి పదినుంచి 15 వరకు ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇద్దరు లేదా ముగ్గురు ప్రాణాలు కోల్పోతున్న పరిస్థితులు ఉన్నాయి.
 • పాడేరు నుంచి గూడెంకొత్తవీధి వెళ్లే బస్సు బొక్కెళ్లు గ్రామ సమీపంలో టైరు పంక్చరై ఆగిపోయింది. కండక్టర్‌ లోవకుమారి, డ్రైవరు నాయుడు కలిపి టైర్‌ మార్చారు.
 • మారేడుమిల్లి మండలంలోని పాతకోట వెళ్తున్న బస్సు నడుస్తూ ఉండగా వై.రామవరం మండలం ఎడ్లకొండ వద్ద వెనుక చక్రాలు ఊడిపోయాయి. బస్సు కొంతదూరం వెళ్లి నిలిచిపోయింది.
 • భద్రాచలం నుంచి కాకినాడ వెళ్తున్న బస్సుకు మారేడుమిల్లి మండలం వాలమూరు సమీపంలోని ప్రమాదకర మలుపులో బ్రేకులు ఫెయిల్‌ అయ్యియి. డ్రైవర్‌ పక్కనే ఉన్న కొండను ఢీకొట్టి బస్సు ఆపాల్సి వచ్చింది.

సేవలు డీలా..

 • మన్యంలోని గిరిజన గ్రామాలకు సేవలను అందించడంలో ఆర్టీసీ తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. మారేడుమిల్లి మండలంతోపాటు వై.రామవరం మండలం ఎగువ ప్రాంతంలోని వందలాది గిరిజన గ్రామాలకు బస్సు సదుపాయమే లేదు. గోకవరం డిపో నుంచి మారేడుమిల్లి మీదుగా గుర్తేడు, పాతకోట వరకు రోజుకు రెండు సర్వీసులు నడుపుతున్నారు. అవి గిరిజనుల అవసరాలు తీర్చలేకపోతున్నాయి.
 • నర్సీపట్నం నుంచి జెర్రెల, పెదవలస ప్రాంతాలకు బస్సులు పంపేవారు. వాటిని రద్దు చేసేశారు. చింతపల్లికి గతంలో పల్లె వెలుగు బస్సులు నడిచేవి. వాటిస్థానంలో రెండేళ్ల క్రితం నుంచి టూ-స్టాప్‌ సర్వీస్‌ పేరిట ఛార్జీలు పెంచి తిప్పుతున్నారు. నిబంధనల ప్రకారం మధ్యలో రెండుచోట్ల మాత్రమే ఈ సర్వీసు ఆగాల్సి ఉన్నా ఆరుచోట్ల ఆపి ప్రయాణీకులను ఎక్కించుకుంటున్నారు.
 • గతనెల 26న నర్సీపట్నం నుంచి గుమ్మిరేవుల, సీలేరు వెళ్తున్న రెండు బస్సులు ఒకేసారి సప్పర్ల ఘాట్‌ రహదారిలో నిలిచిపోయాయి. నెలరోజుల కిందట డొంకరాయి నుంచి పాడేరు వస్తున్న బస్సు దారకొండ ఘాట్‌రోడ్‌లో ఆగిపోయింది. జనవరి 26న లంబసింగి ఘాట్‌లో విశాఖ నుంచి సీలేరు వెళ్తున్న నైట్‌హాల్ట్‌ బస్సు సాంకేతిక మరమ్మతులతో నిలిచిపోయింది. దీంతో ప్రయాణికులు తెల్లవార్లూ వణికే చలిలో జాగారం చేశారు. రెండు నెలల క్రితం విశాఖపట్నం నుంచి భద్రాచలం వెళ్తున్న బస్సు గూడెంకొత్తవీధి మండలం సప్పర్ల ఘాట్‌రోడ్లో సాంకేతిక లోపంతో ఆగిపోయింది. బస్సులో కనీసం టూల్‌కిట్‌ లేకపోవడంతో ఏమీ చేయలేని పరిస్థితి ఏర్పడింది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని