logo

గురువులపై గుర్రు!

పాఠాలు బోధించే గురువులను నిర్లక్ష్యం చేసి బడులకు రంగులు, గోడలపై బొమ్మలు వేసి పిల్లల తలరాతలు మార్చేశామని జగన్‌ జబ్బలు చరుచుకుంటున్నారు.

Updated : 22 Apr 2024 06:52 IST

ఉపాధ్యాయులతో ఆడుకుంటున్న జగన్‌
పాఠశాలల్లో దిగజారుతున్న విద్యా ప్రమాణాలు
ఈనాడు, పాడేరు, న్యూస్‌టుడే, రంపచోడవరం

పాఠాలు బోధించే గురువులను నిర్లక్ష్యం చేసి బడులకు రంగులు, గోడలపై బొమ్మలు వేసి పిల్లల తలరాతలు మార్చేశామని జగన్‌ జబ్బలు చరుచుకుంటున్నారు. ఉపాధ్యాయులకు బోధన కంటే ఇతర విధులే ఎక్కువ అప్పజెబితే విద్యావ్యవస్థలో ఎన్ని మార్పులు తెచ్చినా చదువులో పిల్లలు ఎలా రాణిస్తారన్న ఇంగితజ్ఞానం పాలకుల్లో లేకుండా పోతుంది. గత రెండేళ్లలో నమోదైన పదో తరగతి ఫలితాలే ఇందుకు నిదర్శనం. సర్కారు పాఠశాలల్లో బోధనేతర పనులపైనే ఉపాధ్యాయులు ఎక్కువ సమయం గడుపుతున్నారు. టీచర్లు, విద్యార్థుల హాజరు నుంచి మధ్యాహ్న భోజనం, మరుగుదొడ్ల నిర్వహణ వరకు అన్నింటినీ యాప్‌ల్లో నమోదు చేయడానికి తంటాలు పడుతున్నారు. పుస్తకాలు పట్టుకుని పాఠాలు చెప్పడం కంటే సెల్‌ఫోన్లు పట్టుకుని నాడు-నేడు పనులు, కిచెన్‌షెడ్లు, మరుగుదొడ్ల ఫొటోలు తీయడానికే గురువులకు సమయమంతా సరిపోతోంది.

ఒక పూటంతా అదే పని..

  • ఉదయం పాఠశాలకు రాగానే ఉపాధ్యాయులు ఐరిస్‌ ఆధారంగా హాజరు నమోదు చేసుకోవాలి. తొలి పిరియడ్‌లోపు విద్యార్థుల హాజరు కూడా యాప్‌లోనే నిక్షిప్తం చేయాలి. ఒక్కో పాఠశాలలో విద్యార్థులు వందల సంఖ్యలో ఉండడంతో వారి హాజరంతా ఆన్‌లైన్‌లో అప్‌లోడ్‌ చేయడానికి చాలా సమయమే తీసుకుంటుంది. ఆ సమయంలో బోధన కూడా సక్రమంగా జరగడం లేదు.
  • టాయిలెట్‌ మెయింటెనెన్స్‌ ఫండ్‌ (టీఎంఎఫ్‌) యాప్‌లో ఆయాల హాజరు నమోదు చేయాలి. మరుగుదొడ్ల నిర్వహణకు సంబంధించి ఫొటోలు తీసి అప్‌లోడ్‌ చేయాలి. ఎన్ని బేసిన్లు ఉంటే అన్నింటికీ ఫొటోలు తీయాలి.
  • ఐఎంఎంఎస్‌ యాప్‌లో మధ్యాహ్న భోజన వివరాలు నమోదు చేయాలి. వంట గది ప్రదేశం, సరకులు నిల్వచోటు, వండే పాత్రలు, చెత్త డబ్బా, విద్యార్థులు తినే ప్రదేశం, మంచినీటి సదుపాయం, చేతుల శుభ్రత, గుడ్ల ఫొటోలు తీసి యాప్‌లో అప్‌లోడ్‌ చేయాలి.  
  • జగనన్న విద్యాకానుక సమాచారం, పంపిణీ చేసిన కిట్లకు విద్యార్థుల తల్లులతో బయోమెట్రిక్‌ అథంటికేషన్‌ తీసుకోవాలి. పిల్లల కాలిబూట్ల కొలతలు ఉపాధ్యాయులే దగ్గరుండి పర్యవేక్షించాలి. బోధనేతర సిబ్బంది లేనిచోట గురువులే పిల్లల పాదాల కొలతలు తీసి యాప్‌లో నమోదు చేయాలి.
  • నాడు-నేడు పనుల స్థితిని ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌లో నమోదు చేస్తుండాలి. నిధుల లభ్యత, కొరత, నిర్మాణ సామగ్రి వివరాలను యాప్‌లో నమోదు చేస్తుండాలి.

మరుగుదొడ్ల ఫొటోలు తీస్తున్న ఉపాధ్యాయుడు

ఫొటో బాగోలేకున్నా వివరణ ఇవ్వాల్సిందే..

ఐఎంఎంఎస్‌ యాప్‌ను కృత్రిమ మేధతో (ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌) అనుసంధానం చేశారు. మధ్యాహ్న భోజనం, మరుగుదొడ్ల ఫొటోలు తీసి యాప్‌లో అప్‌లోడ్‌ చేయగానే మీరు తీసిన ఫొటోలు బాగోలేవు.. నిర్వహణ సరిగ్గా లేదనే కామెంట్‌ వస్తోంది. దానికి మరలా ఉపాధ్యాయులు వివరణ ఇవ్వాల్సి వస్తోంది. ఒక్క గుడ్డు గురించే మూడు కోణాల్లో ఫొటోలు తీసి పెడుతున్నట్లు ఉపాధ్యాయులు చెబుతున్నారు. పాఠశాలల విలీనం తర్వాత ఏకోపాధ్యాయ పాఠశాలల సంఖ్య గణనీయంగా పెరిగిపోయింది. అక్కడ ఈ యాప్‌ల నిర్వహణ ఇబ్బందులు తెచ్చిపెడుతోంది. ఇటు బోధనపై దృష్టిపెట్టాలా?, లేకుంటే అటు ఆన్‌లైన్‌లో సమాచారం పొందుపరచడమే పనిగా ఉండాలో తెలియడం లేదని గురువులు ఆందోళన చెందుతున్నారు. దీనివల్ల విద్యా ప్రమాణాలు అంతకంతకు దిగజారిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఈ యాప్‌ల నిర్వహణలోనే ఉపాధ్యాయులు ఎక్కువ సమయం గడపాల్సి వస్తోంది.


2019-20, 20-21 వరుస రెండేళ్లు పదోతరగతి పరీక్షలను కొవిడ్‌ కారణంగా నిర్వహించలేదు.. అందరు విద్యార్థులను ఉత్తీర్ణులు చేశారు.
2015-16 నుంచి 2018-19 వరకు పదో తరగతిలో ఎప్పుడు 93 శాతం కంటే తక్కువ ఉత్తీర్ణత నమోదయ్యేది కాదు. 2019-23 వరకు జరిగిన పరీక్షల్లో సగటున 75 శాతం ఉత్తీర్ణతతో తిరోగమన ఫలితాలు కనిపిస్తున్నాయి.


ఉమ్మడి జిల్లాలో ప్రభుత్వ పాఠశాలలు 4,120
ఏకోపాధ్యాయ పాఠశాలలు 501
విద్యార్థులు 3.63 లక్షలు


 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని