logo

కాంబోడియాలో విశాఖ యువత నరకయాతన

ఉద్యోగం సంపాదించాలి...కుటుంబాన్ని పోషించాలి అనే ఒకే ఒక్క ఆశతో ‘ఏజెంట్ల’ను నమ్మిన యువకులు సైబర్‌నేరగాళ్ల ఉచ్చులో చిక్కుకున్నారు.

Updated : 19 May 2024 10:53 IST

మోసం చేస్తేనే...భోజనం!!
ఎదురుతిరిగితే చిత్రహింసలే

న్యూస్‌టుడే, ఎంవీపీకాలనీ: ఉద్యోగం సంపాదించాలి...కుటుంబాన్ని పోషించాలి అనే ఒకే ఒక్క ఆశతో ‘ఏజెంట్ల’ను నమ్మిన యువకులు సైబర్‌నేరగాళ్ల ఉచ్చులో చిక్కుకున్నారు. వారు పెట్టే నరకయాతన అనుభవిస్తూ మగ్గిపోతున్నారు. కాంబోడియాలోని చైనా దేశీయుల గుప్పిట్లో బలైపోతున్న విశాఖ యువకుల కష్టాలు పోలీసులు విచారణలో వెలుగులోకి వచ్చాయి. ఆ క్రూరుల బారి నుంచి తప్పించుకొచ్చి ఒకరు ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు వివరాలు రాబట్టారు. నగరం నుంచి వెళ్లిన దాదాపు 150 మంది వారి బారినపడినట్లు ప్రాథమికంగా భావిస్తున్నారు. యువకులు పడుతున్న బాధలను సీపీ రవిశంకర్‌ శనివారం వివరించారు. బాధితుల్లో మహిళలు కూడా ఉన్నట్లు సమాచారం.

మాట వినకుంటే చిత్రవధే: బ్యాంకాక్‌లో ఆకర్షణీయ జీతం, ఏసీ గదుల్లో కంప్యూటర్‌ ముందు కూర్చుని పనిచేయటమే అని తీయని మాటలు చెప్పిన ఏజెంట్లే ఈ మానవ అక్రమ రవాణాలో కీలక వ్యక్తులు. వారి మాటలు నమ్మిన నిరుద్యోగులు కేవలం రూ.90 వేలు నుంచి రూ.1.50 లక్షలు చెల్లించి మోసపోయారు.  ఏజెంట్లు జిల్లా నుంచి నుంచి నిరుద్యోగులను ముందుగా బ్యాంకాక్‌ తీసుకువెళతారు. బాధితులకు విమాన టికెట్లు, ట్రావల్‌ ఇన్సూరెన్స్, హోటల్‌ బుకింగ్, పాసుపోర్టు సదుపాయాలతోపాటు కొంత నగదు సమకూరుస్తారు.

బ్యాంకాక్‌లో ఏజెంట్లకు అప్పగించే వరకే వీరి పని. అక్కడి ఏజెంట్‌ ట్రావెల్‌ వీసా ద్వారా నెల రోజుల నిమిత్తం టూరిస్టు వీసా తీసుకుంటాడు. ఎలాంటి అనుమానం లేకుండా కంపెనీ తరఫున కారు కూడా సమకూరుస్తారు. ఆ తర్వాత వీరిని కాంబోడియాలోని చైనా సంస్థలకు అప్పగిస్తారు. అక్కడ వీరి నైపుణ్యత ప్రకారం ఏడాది పాటు ఒప్పందం రాయించుకుంటారు. అలాగే 400 డాలర్లకు స్యూరిటీ తీసుకుంటారు. తిరిగి వెళ్లాలంటే ఆ 400 డాలర్లను చెల్లించాల్సి ఉంటుంది. ఆ అవకాశాన్ని మోసగాళ్లు వీరికి ఇవ్వరు. ఎందుకంటే ముందుగా చెప్పినంత జీతం ఇవ్వరు. వారు చెప్పిన రీతిలో సైబర్‌ మోసాలకు పాల్పడితేనే భోజనం పెడతారు. మరో వైపు పలు రకాల వ్యసనాలకు బానిసలుగా మార్చేస్తారు.

చీకటి గదుల్లో ఉంచి.. : నిరుద్యోగులను కాంబోడియాలోని చైనా కంపెనీ ప్రతినిధులు తమ వెంట తీసుకువెళ్లి ముందుగా చీకటి గదుల్లో ఉంచి చిత్రహింసలకు గురి చేస్తారు.  వారు  చెప్పినట్లు వినకపోతే పలు రకాలుగా హింసిస్తారు. కనీసం తాగునీరు, భోజనం అందించకుండా ఇబ్బందులకు గురిచేస్తారు. చివరికి చెప్పినట్లు చేస్తామనే స్థాయికి తెస్తారు. అలా దారికి వచ్చిన వారికి శిక్షణ ఇచ్చి భారతీయులపై సైబర్‌మోసాల వల విసురుతారు. వీరి నైపుణ్యం ప్రకారం దోచిన సొమ్ములో ఒక శాతం మాత్రమే కమీషన్‌గా ఇస్తారు. వీరి ద్వారా జాబ్‌ స్కామ్, ట్రేడింగ్‌ ఇన్వెస్టిమెంట్, ఫెడెక్స్, టాస్క్‌గేమ్స్, ఫేక్‌ ఫేస్‌బుక్‌ సృష్టించటం, హనీ ట్రాప్‌ వంటి నేరాలను చేయిస్తారు. భారతీయుల ద్వారా భారతీయులే మోసపోయేలా చేస్తున్నారు. ఒకసారి వీరి వలలో చిక్కితే బయటకు రావటం కష్టమని పోలీసులు చెబుతున్నారు.  ప్రధానంగా విశాఖపట్నం, శ్రీకాకుళం, రాజమహేంద్రవరం, అనంతపురం, పలాస, తుని, అనకాపల్లి, తెలంగాణ, కోల్‌కతాకు చెందిన బాధితులు పెద్ద సంఖ్యలో కాంబోడియాలో ఉన్నట్లుగా పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు.

ఎవరైనా  ఏజెంట్ల చేతిలో ఈ తరహాలో మోసపోతే, వెంటనే 9490617917 ఫోన్‌నెంబరుకు ఫిర్యాదు చేయాలని పోలీసులు కోరుతున్నారు.


ఫెడెక్స్‌ కొరియర్‌ మోసంపై 12 కేసులు నమోదు

సైబర్‌ మోసగాళ్లు ఫెడెక్స్‌ కొరియర్‌ పేరిట పలు మోసాలకు పాల్పడుతున్నారని, ఇప్పటి వరకు నగర పరిధిలో 12 కేసులు నమోదయ్యాయని నగర పోలీసు కమిషనర్‌ రవిశంకర్‌ వెల్లడించారు. ఇప్పటి వరకు 12 కేసుల్లో బాధితులు రూ.5.93 కోట్ల మేర నష్టపోయారన్నారు. బాధితులు సకాలంలో స్పందించి 1930కి ఫోన్‌ చేసి ఫిర్యాదు చేయటంతో రూ.1.04 కోట్ల మేర నగదును వేరే ఖాతాలకు వెళ్లకుండా అడ్డుకున్నామన్నారు. ఇటీవల కాలంలో ఈ తరహా మోసాలు ఎక్కువగా జరుగుతున్నాయన్నారు. ఫెడెక్స్‌ కొరియర్‌ పార్సిల్‌లో నిషేధిత వస్తువులు ఉన్నాయని, బెదిరింపులకు పాల్పడుతూ వారి నుంచి నగదును దోచుకుంటారని, అందువల్ల ప్రజలంతా ఈ తరహా ఫోన్లకు స్పందించవద్దని కోరారు.బీ బర్మాకాలనీకి సంబంధించి రెండు కుటుంబాల మధ్య జరిగిన గొడవపై డీసీపీ స్థాయి అధికారితో విచారణ జరిపిస్తున్నామని సి.పి. రవిశంకర్‌ తెలిపారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు