logo

పోలీసులు అప్రమత్తంగా ఉండాలి

సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వస్తున్న నేపథ్యంలో జిల్లాలోని పోలీస్‌ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ కేవీ మురళీకృష్ణ తెలిపారు.

Published : 20 May 2024 01:55 IST

సమావేశంలో మాట్లాడుతున్న ఎస్పీ మురళీకృష్ణ

అనకాపల్లి పట్టణం, న్యూస్‌టుడే: సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వస్తున్న నేపథ్యంలో జిల్లాలోని పోలీస్‌ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ కేవీ మురళీకృష్ణ తెలిపారు. జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఆదివారం పోలీస్‌ సిబ్బందితో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ జూన్‌ 1న ఎగ్జిట్పోల్స్‌, జూన్‌ 4న సార్వత్రిక ఎన్నికల ఫలితాలు రానున్న నేపథ్యంలో జిల్లాలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సిబ్బంది అప్రమత్తంగా ఉండి ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలన్నారు. ర్యాలీలు, ఊరేగింపులు, పండగల్లో స్టేజీ ప్రోగ్రాంలకు అనుమతులు లేవన్నారు. పెట్రోలు బంక్‌లో లూజ్‌ పెట్రోలు, డీజిల్‌ అమ్మరాదన్నారు. బాణసంచా తయారీదారులపై నిరంతర నిఘా తనిఖీలు చేయాలన్నారు. రౌడీషీటర్ల కదలికలపై ప్రత్యేక పరిశీలన చేసి ఎవరైనా నిబంధనలు అతిక్రమిస్తే జిల్లా నుంచి బహిష్కరించాలన్నారు. దాబాలు, హోటళ్లు, పాన్‌షాపుల్లో మద్యం లభ్యం కాకుండా పరిశీలించాలన్నారు. బెట్టింగ్‌ వంటి చట్టవ్యతిరేక కార్యక్రమాలను అరికట్టాలని తెలిపారు. గ్రామాల్లో పోలీస్‌ పికెటింగ్‌, పెట్రోలింగ్‌తో పాటుగా చెక్‌పోస్టుల వద్ద తనిఖీలు ముమ్మరం చేయాలన్నారు. అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడే వారు, ప్రజలను ఇబ్బందులు పెట్టే వారిని గుర్తించి బెండోవర్‌ చేయాలని అధికారులకు సూచించారు. ఎన్నికల ఫలితాల నేపథ్యంలో గ్రామాల్లో సమావేశాలు పెట్టి ప్రజలను చైతన్యం చేసేలా పోలీస్‌స్టేషన్ల ఎస్‌హెచ్‌ఓలు ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. ప్రజలను రెచ్చగొట్టే సందేశాలు, నిరాధారమైన ఆరోపణలు చేస్తూ సోషల్‌ మీడియాలో ప్రచారం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గత ఎన్నికల సమయంలో నేరాలకు పాల్పడిన వారిని గుర్తించి వారిని బైండోవర్‌ చేయాలన్నారు. లాడ్జీలను పరిశీలించి అపరిచిత వ్యక్తులు ఎవరైనా ఉంటే వారిపై నిఘా పెట్టాలన్నారు. ఏఎస్పీలు బి.విజయ్‌కుమార్‌, సత్యనారాయణ, అనకాపల్లి, పరవాడ, నర్సీపట్నం డీఎస్పీలు అప్పలరాజు, సత్యనారాయణ, మోహన్‌ పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని