logo

కాలువలే కన్నీరు పెడుతున్నాయ్‌..!

‘ఏటా ఖరీఫ్‌ సీజన్‌కు ముందు పూడికతీత పనులు పూర్తిచేసుకుని సాగుకు నీరందించడానికి పంట కాలవులన్నీ ముస్తాబయ్యేవి. తమ మీదుగా గలగలా పారే నీటితో కాలువలు కళకళలాడేవి.

Updated : 23 May 2024 06:17 IST

నీటి వనరుల నిర్వహణలో అయిదేళ్లుగా అంతులేని నిర్లక్ష్యం

పాడేరు మండలం తుంపాడ గ్రామ సమీపంలో చెక్‌డ్యామ్‌లో పేరుకుపోయిన పూడిక 

ఈనాడు, పాడేరు: ‘ఏటా ఖరీఫ్‌ సీజన్‌కు ముందు పూడికతీత పనులు పూర్తిచేసుకుని సాగుకు నీరందించడానికి పంట కాలవులన్నీ ముస్తాబయ్యేవి. తమ మీదుగా గలగలా పారే నీటితో కాలువలు కళకళలాడేవి. వేల ఎకరాల్లో పంటల సాగుకు భరోసానిచ్చి అన్నదాతలకు తోడుగా నిలిచేవి..’ ఇది పంట కాలువల గత వైభవం. 

నేడు ఆ పరిస్థితి పూర్తిగా భిన్నంగా ఉంది. ఉమ్మడి జిల్లాలో సాగునీటి వనరులన్నీ చతికిలపడిపోయాయి. నిధుల్లేక.. నిర్వహణకు నోచుకోక కాలువలన్నీ అధ్వానంగా తయారయ్యాయి. గత కొన్నేళ్లుగా ఈ సాగునీటి వనరుల నిర్వహణ గాడితప్పడంతో రైతులకు సాగునీటి భరోసాను ఇవ్వలేకపోతున్నాయి. కాలువల్లో షట్టర్లు ఎక్కడా కనిపించడం లేదు. పూడికలతో నిండిపోయి పిచ్చిమొక్కలతో చిట్టడవులను తలపిస్తున్నాయి. తమ దయనీయ స్థితిని చూసి కాలువలే కన్నీరుపెడుతున్నాయి. 

అప్పలరాజుపేటలో కోతకు గురైన వట్టిగెడ్డ జలాశయం రక్షణ గట్లు 

న్యూస్‌టుడే, పాడేరు/పట్టణం: పాడేరు మండల పరిధిలో తుంపాడ, వంతాడపల్లి మధ్యలో చెక్‌డ్యామ్‌ ఏర్పాటు చేశారు. దీని ద్వారా 100 ఎకరాల్లో వరి సాగుకు నీరు అందుతోంది. మూడు దశాబ్దాల కిందట ఏర్పాటు చేసిన ఈ సాగునీటి వనరు పూర్తిగా శిథిల స్థితికి చేరుకుంది. మరమ్మతులు లేకపోవడంతో నిరుపయోగంగా మిగిలింది. లగిశపల్లి, పాడేరు పంచాయతీల మధ్యలో బొర్రమామిడి వద్ద ఓ చెక్‌డ్యామ్‌ ఉంది. పాడైపోయిన ఈ చెక్‌డ్యాంను ఏళ్ల తరబడి బాగుచేయకుండా వదిలేయడంతో పాడేరు, లగిశపల్లి పంచాయతీ పరిధిలో వంద ఎకరాల ఖరీఫ్‌కు సాగు అందే పరిస్థితి లేదు.

ఇవీ సమస్యలు..

  • కోతకు గురైన రక్షణ గట్లు..
  • బలహీనపడిన ప్రధాన కాలువ గట్లు, శిథిలావస్థకు చేరిన ఏజెన్సీ పదకొండు మండలాల్లో 1556 చిన్న నీటి వనరులున్నాయి. వీటికింద 66,393 ఎకరాల ఆయకట్టు ఉంది. ఈ నీటి వనరుల్లో ఎక్కువ భాగం మరమ్మతులకు గురికావడంతో ఆయా చెక్‌డ్యామ్‌ల ద్వారా సాగు నీరు అందే పరిస్థితులు కనిపించడం లేదు.ొర్లు కట్టలు, పలు చోట్ల గండ్లు
  • పూడికతీత పనులు చేపట్టక వ్యర్థాలతో నిండి ఉన్న కాలువ
  • తూరలు సరిగా లేకపోవడం, మరమ్మతులకు గురైన డిస్ట్రిబ్యూషన్‌ పాయింట్లు, షట్టర్‌

న్యూస్‌టుడే, రాజవొమ్మంగి: మండలంలో వట్టిగెడ్డ జలాశయం అతిపెద్ద సాగునీటి వనరు. ఏడాది పొడవునా నీటి నిల్వతో ఉంటుంది. సుమారు 200 ఎకరాల చెరువు గర్భం కలిగి అప్పలరాజుపేట, రాజవొమ్మంగి, దూసరపాము, తంటికొండ, వట్టిగడ్డ, డి.మల్లవరం తదితర గ్రామాల రైతులకు చెందిన దాదాపు 3 వేల ఎకరాలకు సాగు నీరందిస్తోంది. ఈ కాలువ పూడికతీత పనులు చేపట్టకపోవడంతో పిచ్చిమొక్కలు, ప్లాస్టిక్‌ వ్యర్థాలతో నిండిపోయింది. ఇటీవల కొంతమేర రైతులే స్వచ్ఛందంగా పూడికతీత చేపట్టినా సరే శివారు భూములకు నీరు మాత్రం అందడం లేదు. స్పందనలో సైతం ఫిర్యాదు చేసినా సమస్య పరిష్కారానికి నోచుకోలేదు.. 

పంట వేసి పశువులకు వదిలేశాం..

జలాశయంలో నిండుగా నీరున్నా ఉన్నా ప్రధాన కాలువలో పూడికతీత పనులు చేపట్టకపోవడం, డ్రాపులు మరమ్మతులకు గురికావడంతో శివారు భూములకు నీరు అందడం లేదు.  ఇటీవల వట్టిగెడ్డ కింద 18 ఎకరాల్లో పొలం పంటలు వేశాం. నీరు లేక పంట ఎండిపోవడంతో పశువులకు వదిలేశాం. అరటి, చెరకు, మొక్కజొన్న, అపరాలు సాగు చేద్దామని ఉన్నా నీరందక ఆశలు వదులుకుంటున్నాం.
- పల్లి.సత్యనారాయణ. రైతు. వట్టిగెడ్డ


చివరి భూములకు నీరందితే ఒట్టు

చింతపల్లి, న్యూస్‌టుడే: చింతపల్లి మండలంలో ప్రధాన సాగునీటి చెరువులు రెండే. అందులో ఒకటి తాజంగి, రెండోది చౌడుపల్లి సమీపంలºని పశువులబంద. ఈ చెరువు గర్భం సుమారు 7.50 ఎకరాలు, దీని పరిధిలో ఆయకట్టు 350 ఎకరాల పైమాటే. ఏళ్ల తరబడి ఈ చెరువులో పూడిక తియ్యలేదు. కనీసం కాలువలను శుభ్రం చేయకపోవడంతో చెరువు గర్భం సహా కాలువలన్నీ పూర్తిగా పూడికతో నిండిపోయాయి. ఏడున్నర ఎకరాల చెరువు గర్భం కాస్తా కుంచించుకుపోయి ఎకరా చెరువుగా మారిపోయింది. పంట కాలువ పూర్తిగా మరమ్మతులకు గురవడంతోపాటు పూడిక పెరిగిపోవడంతో సాగునీరు చివరి పొలాలకు అందడం లేదు. ప్రస్తుతం 150 ఎకరాలకు మించి పొలాలకు సాగునీరందని పరిస్థితి నెలకొంది. 


 ఏటా ప్రతిపాదనలు పెడుతున్నాం..

పంట కాలువలను బాగుచేయడానికి, పూడికతీతకు ఏటా ప్రతిపాదనలు పంపిస్తున్నాం. నిధులు మంజూరు లేకపోవడంతో ఉపాధి హామీ పథకం ఉపయోగించుకుని బాగుచేయిస్తున్నాం. అనకాపల్లి, అల్లూరి జిల్లాల్లో చాలావరకు కాలువలను నరేగాలో బాగుచేయించాం. ఈ ఖరీఫ్‌లో సాగునీటి సమస్య రాకుండా చర్యలు తీసుకుంటాం.
-సూర్యకుమార్, ఎస్‌ఈ, జలవనరుల శాఖ


వృథాగా పొలాలు

పశువులబంద చెరువును ఆనుకుని వందలాది ఎకరాల భూములున్నా అవి సాగునీరందక వృథాగా ఉండిపోతున్నాయి. కేవలం 150 ఎకరాల భూమిలో వరి, 50 ఎకరాల్లో కాయగూరలు పండిస్తున్నాం. అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా చెరువు, కాలువల్లో పూడిక తీయడం లేదు. విసిగిపోయిన మేమే ప్రతి రెండునెలలకు ఒకసారి శ్రమదానంతో పూడిక తీసుకుంటున్నాం. 
- వంతల ప్రశాంత్, గిరిజన రైతు, చౌడుపల్లి

కాలువలు కొట్టుకుపోయాయి..

గతంలో వర్షాలతో ప్రధాన కాలువలు కొట్టుకుపోవడంతో సాగు భూముల్లో నీరు చేరడం లేదు. అయిదేళ్లుగా కాలువలు మరమ్మతు చేసి. పూడికలు తొలగించి సాగునీరు అందించాలని ప్రజా ప్రతినిధులకు, అధికారులకు విన్నవించిన పట్టించుకోకపోవడంతో ఇబ్బందులు పడుతున్నాం. - గొల్లోరి గంగులు, గిరిరైతు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని