logo

ఊదరగొట్టి.. ఊపిరి తీసి..

‘గ్రామాల్లో డిజిటల్‌ గ్రంథాలయాలను నిర్మిస్తాం. నిరుద్యోగ యువత స్థానికంగానే పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యేలా మౌలిక సదుపాయాలు కల్పిస్తాం.

Updated : 23 May 2024 06:13 IST

డిజిటల్‌ గ్రంథాలయాల నిర్మాణం తీరిది

నిరుద్యోగుల ఆశలపై నీళ్లుచల్లిన సర్కారు

ఈనాడు, పాడేరు, అనకాపల్లి: ‘గ్రామాల్లో డిజిటల్‌ గ్రంథాలయాలను నిర్మిస్తాం. నిరుద్యోగ యువత స్థానికంగానే పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యేలా మౌలిక సదుపాయాలు కల్పిస్తాం. సెలవుల్లో ఊళ్లకు వెళ్లే స్టాఫ్‌వేర్‌ ఉద్యోగులు ఈ లైబ్రేరీలను ఉపయోగించుకునేలా తీర్చిదిద్దుతాం’ అని మూడేళ్ల క్రితం సీఎం జగన్‌ ఊదరగొట్టారు. ఉమ్మడి జిల్లాలో 550 పైగా డిజిటల్‌ గ్రంథాలయాలను మంజూరు చేశారు. సామాజిక మాధ్యమాల్లో వాటి నమూనా ఫొటోలు పెట్టి అప్పుడే గ్రామాలు డిజిటల్‌మయం అయిపోయాయి అన్నంతగా ప్రచారం చేసుకున్నారు. తీరా ఈ మూడేళ్లలో నిర్మించిన గ్రంథాలయాలు ఎన్ని అంటే ఒకట్రెండే ఉన్నాయి. వాటిని కూడా వినియోగంలోకి తీసుకురాలేకపోయారు. ‘యువత కల నా కల’ అంటూ పెద్ద ఎత్తున ప్రచారం చేసుకునే జగన్‌  నిరుద్యోగులకు ఉపయోగపడే డిజిటల్‌ గ్రంథాలయాల విషయంతో తీవ్ర నిర్లక్ష్యమే వహించారు.

అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు జిల్లాల పరిధిలో రూ.93.44 కోట్ల అంచనా విలువతో 584 డిజిటల్‌ గ్రంథాలయాలను మూడేళ్ల క్రితం మంజూరు చేశారు. ఉపాధిహామీ నిధులతో నిర్మిస్తామన్నారు. దీనికోసం గ్రామాల్లో అవసరమైన స్థలాలను గుర్తించారు. పనులు పట్టాలెక్కే సమయంలో ఊరికో గ్రంథాలయం కాదు.. మండలానికి ఆరు లైబ్రరీలను నిర్మిస్తామన్నారు. జనాభా ఎక్కువ ఉన్న మొదటి ఆరు గ్రామాలను వీటి నిర్మాణాలకు ఎంపిక చేశారు. తొలుత నిర్మిద్దామనుకున్న 584 గ్రంథాలయాల సంఖ్య 300కు తగ్గిపోయింది. వీటి నిర్మాణాలను మూడు దశల్లో పూర్తి చేయాలనుకున్నారు. తొలిదశ 2022 ఏప్రిల్‌ నాటికి, రెండో దశ 2022 డిసెంబర్‌ నాటికి, మూడో దశగా 2023 ఆగస్టులోగా గ్రంథాలయాలను నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అయితే ఈ మూడేళ్లలో ఒకే ఒక్క లైబ్రరీ నిర్మాణం మాత్రమే పూర్తిచేశారు. కొన్ని పునాదుల దశ కూడా దాటలేదు. చాలావరకు గ్రంథాలయాలన్నీ మôజూరు దశలోనే మగ్గిపోతున్నాయి. 

అప్రాధాన్య పనుల జాబితాలో.. ప్రభుత్వం వెనుకా ముందు చూడకుండా వేల సంఖ్యలో వివిధ శాఖలకు చెందిన భవనాలను మంజూరు చేసేసింది. నిర్మాణాలు మొదలుపెట్టేసరికి నిధులు సమస్య రావడంతో వాటిని ప్రాధాన్యం, అప్రాధాన్య పనులగా విభజించింది. ప్రాధాన్య పనులు చేపట్టిన వారికే ఆలస్యమైనా బిల్లులు చెల్లిస్తూ వచ్చింది. సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, వైఎస్సార్‌ హెల్త్‌ క్లినిక్‌ల నిర్మాణాలను ప్రాధాన్య పనులుగా గుర్తించారు. లక్షల మంది నిరుద్యోగ యువతకు ఉపయోగపడే డిజిటల్‌ లైబ్రరీలను మాత్రం అప్రాధాన్య జాబితాలో చేర్చారు. దీంతో ఈ పనులు పూర్తిగా పడకేశాయి. ప్రాధాన్య హోదా ఉన్న సచివాలయాలు, ఆర్బీకే నిర్మాణాలే నిధుల సమస్యతో నీరుగారిపోయాయి. ఇక అప్రాధాన్య పనులు పట్టాలెక్కే పరిస్థితి లేదు. ఈ నిర్మాణాలపై నిరుద్యోగ యువత పెట్టుకున్న ఆశలపై ప్రభుత్వమే నీళ్లు చల్లేసింది.

డిజిటల్‌ గ్రంథాలయ నమూనా ఇలా..

వసతులు: వార్తా పత్రికలు, మ్యాగ్‌జైన్లు, మూడు డెస్కెటాప్‌ కంప్యూటర్లు, యూపీఎస్, డెస్క్‌టాప్‌ బార్‌కోడ్‌ ప్రింటర్, స్కానర్, యాంటీవైరస్‌ సాఫ్ట్‌వేర్, హైక్వాలిటీతో అన్‌లిమిటెడ్‌ బ్యాండ్‌విడ్త్‌ ఇంటర్నెట్, స్టోరేజి కోసం డేటా సెంటర్లు, కుర్చీలు, టేబుళ్లు.

  • కోటవురట్ల మండలం గొట్టివాడలో డిజిటల్‌ లైబ్రరీ భవనం నిర్మించినా అందులో కంప్యూటర్లు, ఇతర సదుపాయాలేవి ఇంకా కల్పించకపోవడంతో వినియోగానికి దూరంగా ఉండిపోయింది.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని