logo

అమలవ్వని నిషేధం.. తప్పదా అపాయం!

ఆంధ్రాఊటీ అరకులోయలో ప్రకృతి రమణీయత దెబ్బతీసేలా ఉన్న పాలిథిన్‌ వాడకాన్ని నిషేధించాలని హైకోర్టు న్యాయమూర్తి ఆదేశించినా.. ఇక్కడి అధికారులకు పట్టడం లేదు.

Updated : 23 May 2024 06:06 IST

విచ్చలవిడిగా పాలిథిన్‌ వినియోగం

అరకులోయలో పేరుకుపోయిన పాలిథిన్‌ వ్యర్థాలు 

అరకులోయ, న్యూస్‌టుడే

ఆంధ్రాఊటీ అరకులోయలో ప్రకృతి రమణీయత దెబ్బతీసేలా ఉన్న పాలిథిన్‌ వాడకాన్ని నిషేధించాలని హైకోర్టు న్యాయమూర్తి ఆదేశించినా.. ఇక్కడి అధికారులకు పట్టడం లేదు. నిషేధం మాటల్లో తప్ప చేతల్లో అమలు కావడం లేదు. రెండేళ్ల క్రితం సబ్‌ కలెక్టర్, ఐటీడీఏ పీవోలు పాలిథిన్‌ వాడకంపై పూర్తి నిషేధం ప్రకటించారు. అరకులోయ పట్టణంలో ప్రతి రోజూ పంచాయతీ అధికారులు లౌడ్‌ స్పీకర్లలో పాలిథిన్‌ వాడకంపై నిషేధం విధించినట్లు పేర్కొనడమే తప్ప ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం గమనార్హం.  

అరకులోయలో విచ్చలవిడిగా పాలిథిన్‌ వాడకం జరుగుతోంది. విక్రయాలు యథేచ్ఛగా సాగుతున్నాయి. ప్రతిరోజూ పారిశుద్ధ్య కార్మికులు అరకులోయలో 100 కేజీల పైచిలుకు పాలిథిన్‌ వ్యర్థాలను సేకరిస్తున్నారు. దుకాణాలపై దాడులు చేయకపోవడం, ఉన్నతాధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో ప్లాస్టిక్‌ వినియోగం విచ్చలవిడిగా జరుగుతోంది. ఈ వ్యర్థాలకు నిప్పు పెడుతుండటంతో ప్రజలకు అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. ఇటీవల అరకులోయ ప్రాంతంలో క్యాన్సర్‌ వంటి ప్రాణాంతక వ్యాధుల కేసులు నమోదు కావడం గమనార్హం. భవిష్యత్తు తరాలకు మంచి వాతావరణం కల్పించాలంటే పాలిథిన్‌పై ఉక్కుపాదం మోపాల్సి ఉంది. అరకులోయ వంటి ప్రకృతి రమణీయ ప్రాంతంలో పరిశుభ్రమైన గాలి పీల్చుకునే వెసులుబాటు కల్పించాలన్నా.. పర్యటకుల మనసు చూరగొనాలన్నా నిషేధాన్ని పకడ్బందీగా అమలు చేయాలి. తాగునీటి ప్యాకెట్ల విక్రయాలను గతంలో నిలిపివేశారు. అధికారులు పర్యవేక్షణ లేకపోవడంతో వీటిని ప్రస్తుతం విచ్చలవిడిగా వినియోగిస్తున్నారు. శృంగవరపుకోట నుంచి ప్రతి రోజూ వ్యాన్లలో వేలాదిగా ఇవి అరకులోయ వస్తున్నాయి. అధికారులు ఎటువంటి ఆంక్షలు విధించకపోవడంతో వాటికి అడ్డూ అదుపు లేకుండా పోతోంది. అరకులోయ ప్రాంతంలో ఎటువంటి శుభకార్యాలు జరిగినా అక్కడ గుట్టలుగుట్టలుగా తాగునీటి ప్యాకెట్ల వ్యర్థాలే దర్శనమిస్తున్నాయి. అధికారులు ఇప్పటికైనా స్పందించి ఆంధ్రాఊటీ అరకులోయలో పాలిథిన్‌ నిషేధాన్ని పటిష్ఠంగా అమలు చేయాలని స్థానికులు, పర్యటకులు కోరుతున్నారు.

పాలిథిన్‌ నిషేధం అమలు కాకపోవడంపై జిల్లా పంచాయతీ అధికారి కొండలరావుని ‘న్యూస్‌టుడే’ వివరణ కోరగా.. వ్యాపార సంస్థలపై దాడులు నిర్వహించి పాలిథిన్‌ విక్రయించే వారికి అపరాధ రుసుం విధించాలని ఆదేశించామన్నారు. అప్పటికీ మార్పు రాకుంటే కేసులు నమోదు చేస్తామన్నారు. త్వరలోనే అరకులోయలో దుకాణదారులు, ప్రజలతో సమావేశం నిర్వహించి నిషేధం పూర్తిస్థాయిలో అమలయ్యేలా చర్యలు తీసుకుంటామన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు