logo

పట్టాలపై అలజడి

వేలాది మంది ప్రయాణికులతో కిక్కిరిసిన విశాఖ-లింగంపల్లి (12805) జన్మభూమి ఎక్స్‌ప్రెస్‌ బుధవారం ఉదయం 6.20గంటల సమయంలో స్టేషన్‌ నుంచి బయలుదేరింది.

Updated : 23 May 2024 06:02 IST

జన్మభూమి రైలు నుంచి విడిపోయిన బోగీలు 
తెగిపోయిన ఏసీ బోగీ కప్లింగ్‌! 
3 గంటల పాటు ప్రయాణికుల పాట్లు

రైల్వేస్టేషన్, న్యూస్‌టుడే: వేలాది మంది ప్రయాణికులతో కిక్కిరిసిన విశాఖ-లింగంపల్లి (12805) జన్మభూమి ఎక్స్‌ప్రెస్‌ బుధవారం ఉదయం 6.20గంటల సమయంలో స్టేషన్‌ నుంచి బయలుదేరింది. రైలంతా కోలాహలంగా ఉంది. కొద్ది దూరం ప్రయాణించిన తర్వాత కంచరపాలెం వంతెన సమీపంలో ఎం1 ఏసీ బోగీకి చెందిన కప్లింగ్‌ తెగిపోవడంతో రైలు నుంచి విడిపోయింది. దాని వెనుక ఎం2, సీ1 ఏసీ బోగీలు, మరో నాలుగు జనరల్‌ బోగీలు ఉన్నాయి. దీంతో ప్రయాణికుల్లో అలజడి మొదలైంది. ఏమి జరుగుతుందో తెలియక కొందరు గట్టిగా కేకలు వేశారు. విషయం తెలుసుకున్న అధికారులు రైలును నిలిపివేసి తిరిగి 7వ నెంబరు ప్లాట్‌ఫామ్‌పైకి తీసుకొచ్చారు. అక్కడ మరమ్మతులు చేసిన అనంతరం ఉదయం 9.30 గంటల సమయంలో రైలు బయలుదేరి వెళ్లింది.  దాదాపు 3గంటలపాటు స్టేషన్‌లోనే ఉండిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కొందరు ప్రయాణాన్ని రద్దు చేసుకొని వెనుదిరిగారు. రైలు తక్కువ వేగంతో వెళ్తున్న సమయంలో  బోగీలు విడిపోవడంతో ఎలాంటి ప్రమాదం చోటు చేసుకోలేదు.

నిర్వహణలో లోపాలే కారణమా?

వాల్తేర్‌ కోచింగ్‌ యార్డులో ఈ రైలు నిర్వహణ పనులు పూర్తి చేసి బుధవారం ఉదయం 5.30 గంటల సమయంలో ప్లాట్‌ ఫామ్‌పైకి తీసుకొచ్చారు. అప్పటికే పలు బోగీలపై అనుమానంతో తొలగించి వాటి స్థానంలో ఇతర బోగీలను జతచేసి రైలును సిద్ధం చేసినట్లు సమాచారం. బోగీలను మార్పు చేసినప్పటికీ ఇలా జరగడం ఏమిటని అధికారులు మండిపడుతున్నారు. ఏడీఆర్‌ఎం సుధీర్‌కుమార్‌ గుప్తా స్టేషన్‌ అధికారులతో సమావేశమై కప్లింగ్‌ విడిపోవడానికి గల కారణాలపై ఆరా తీశారు. దీనిపై నివేదిక ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. అయితే వాల్తేర్‌ అధికారులు మాత్రం రైలు బయలుదేరడానికి ముందు ఆయా బోగీలకు విద్యుత్తును సరఫరా చేసే కప్లర్‌లో సాంకేతిక లోపాలను గుర్తించామని, దీంతో వాటిని మార్పు చేసి పంపినట్లు చెబుతుండడం గమనార్హం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని