logo

వైకాపా నాయకత్వం.. ఆరంభ శూరత్వం..!!

సింహాచలం కొండ చుట్టూ ప్రహరీ పేరుతో హడావుడి ఎంపీ విజయసాయిరెడ్డి ప్రతిపాదనతో తొలుత చకచకా సగం చేసి చేతులెత్తేసిన తీరుపై విమర్శలు సింహాచలం కొండ చుట్టూ ప్రహరీ  నిర్మాణం కొన్ని నెలల క్రితం వాయువేగంతో  ప్రారంభించారు.

Updated : 23 May 2024 06:08 IST

సింహాచలం కొండ చుట్టూ ప్రహరీ పేరుతో హడావుడి
ఎంపీ విజయసాయిరెడ్డి ప్రతిపాదనతో తొలుత చకచకా
సగం చేసి చేతులెత్తేసిన తీరుపై విమర్శలు
 

హనుమంతువాక వద్ద తవ్వి వదిలేసిన కొండవాలు

సింహాచలం కొండ చుట్టూ ప్రహరీ పేరుతో హడావుడి ఎంపీ విజయసాయిరెడ్డి ప్రతిపాదనతో తొలుత చకచకా సగం చేసి చేతులెత్తేసిన తీరుపై విమర్శలు సింహాచలం కొండ చుట్టూ ప్రహరీ  నిర్మాణం కొన్ని నెలల క్రితం వాయువేగంతో  ప్రారంభించారు. ప్రస్తుతం పనులు  ఆగిపోయాయి. నాడు ఎందుకు చకచకా సాగించారు...నేడెందుకు చేయడం లేదనే అంశం చర్చనీయాంశంగా మారింది. పైగా... చేసిన పనులు కూడా మొక్కుబడిగా ఉన్నాయి. దీని వల్ల నిధులు వృథా  తప్ప పూర్తి ప్రయోజనం కనిపించడం లేదనే విమర్శలొస్తున్నాయి.

ఎంపీ విజయసాయిరెడ్డి వైకాపా ఉత్తరాంధ్ర సమన్వయకర్తగా ఉన్నప్పుడు ఈ పనులపై చేసిన హడావుడి అంతాఇంతా కాదు. వాస్తవానికి కొండ చుట్టూ ఆక్రమించేందుకు ఎక్కడెక్కడ అవకాశముందో గుర్తించిన తరువాత ఆ ప్రాంతంలో గోడ పనులు మొదలుపెట్టారన్న ఆరోపణలు కూడా నాడు వచ్చాయి.

సింహాచలం కొండ చుట్టూ ఎంపీ లాడ్స్‌ నిధులు రూ. 5 కోట్లతో ప్రహరీ నిర్మాణానికి ఎంపీ విజయసాయిరెడ్డి ప్రతిపాదించారు. వీఎంఆర్‌డీఏ ఆధ్వర్యంలో పనులు చేయాలని నిర్ణయించారు.సింహాచలం అధికారులకు ఈ ప్రహరీ నిర్మాణంపై మొదటి నుంచి ఆసక్తి లేదు. అయినప్పటికీ ముందుకే వెళ్లారు. ఒక విధంగా చెప్పాలంటే సింహాచలం దేవస్థానానికి సంబంధం లేకుండా వీఎంఆర్‌డీఏ అధికారులే అన్ని రకాల అంచనాలు తయారు చేసి పనులు మొదలుపెట్టారు. అకస్మాత్తుగా ప్రహరీ నిర్మాణమంటే వివాదాలు తలెత్తుతాయని. ‘కొండపై ఔషధ మొక్కల పరిరక్షణ అనే అంశాన్ని తెరమీదికి తెచ్చారు. అరుదైన వృక్ష జాతుల సంరక్షణకు గోడ నిర్మిస్తున్నట్లు చెప్పుకొచ్చారు. ఒక విధంగా దేవాదాయశాఖ ప్రమేయం లేకుండానే పనులు ఆరంభించారు. కీలక నేత అప్పగించిన బాధ్యత కావడంతో ఎవరూ అడ్డు చెప్పలేదు. అత్యవసరంగా టెండర్లు పిలిచి పనులు ప్రారంభించేశారు. కొండ చుట్టూ అయిదు దశల్లో ఈ పనులు చేయాలని నిర్ణయించారు. అప్పటికే అడవివరం నుంచి కొంతవరకు ప్రహరీ ఉంది. గోడ లేని చినగదిలి నుంచి హనుమంతువాక వరకు రెండు దశల్లో పనులు చేపట్టారు.

అంతా తాత్కాలికమే..

రెండు కి.మీ. మేర రూ.2 కోట్లతో పనులు చేసినట్లు సమాచారం. ప్రస్తుతం గత కొంత కాలంగా ఈ పనులు నిలిపేశారు. హనుమంతువాక వద్ద ఈ పనుల కోసం కొండ వాలును తవ్వి వదిలేశారు. ఇప్పుడది ప్రమాదకరంగా మారింది.

  • సింహాచలం దేవస్థానం మొదట్లో భూమి అప్పగించిన మేర పనులు చేపట్టగా ఆ తర్వాత వదిలేశారు. ముఖ్యంగా విజయసాయిరెడ్డిని ఉత్తరాంధ్ర ఇన్‌ఛార్జి పదవి నుంచి తప్పించి వైవీ సుబ్బారెడ్డిని నియమించినప్పటి నుంచి పనులు నెమ్మదించాయి. ఆ తర్వాత పూర్తిగా పట్టించుకోవడమే మానేశారు. చేసిన పనులు కూడా అంతంత మాత్రంగానే ఉన్నాయి. పూర్తిస్థాయిలో ప్రహరీ నిర్మించకుండా సిమెంటు పలకలతో తాత్కాలికంగా నిర్మించడంపైనా విమర్శలు వస్తున్నాయి.  పునాదులు కొంత వరకు తవ్వి అందులో ఈ పలకలను అమర్చారు. వీటి వల్ల ఎటువంటి ఉపయోగం లేదని స్థానికులు వాపోతున్నారు. తాత్కాలిక నిర్మాణాలు కావడంతో  ఇప్పటికే కొన్ని చోట్ల పలకలను ఎత్తుకెళ్లిపోయారు. మధ్యమధ్యలో కొన్నింటిని తీసి పారేశారు.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని