logo

రహదారిపైనే సంత..తప్పని చింత!

మన్యంలో వారపు సంతలకున్న ప్రాధాన్యత, ఆదరణే వేరు. గ్రామాల్లో దుకాణాలున్నా గిరిజనులు వారపు సంతలకే అధికంగా ప్రాధాన్యమిస్తారు.

Published : 25 May 2024 01:28 IST

చింతపల్లి, న్యూస్‌టుడే: మన్యంలో వారపు సంతలకున్న ప్రాధాన్యత, ఆదరణే వేరు. గ్రామాల్లో దుకాణాలున్నా గిరిజనులు వారపు సంతలకే అధికంగా ప్రాధాన్యమిస్తారు. మైదాన ప్రాంతాల నుంచి వ్యాపారులు వందలాది వాహనాల్లో వచ్చి దుకాణాలు ఏర్పాటు చేస్తుంటారు. ఇక్కడ దొరకని వస్తువంటూ ఉండదు. దీంతో మన్యంలో సంతలన్నీ సూపర్‌మార్కెట్లను తలపిస్తుంటాయి. చాలా చోట్ల ఇవి రహదారులకు ఆనుకునే నిర్వహించడం వల్ల అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. వాహనాల సంఖ్య పెరగడంతో ట్రాఫిక్‌ సమస్యలు తలెత్తుతున్నాయి. 

చింతపల్లి మండలంలో ఆదివారం కోరుకొండ, సోమవారం అన్నవరం, మంగళవారం లోతుగెడ్డ కూడలి, బుధవారం చింతపల్లి, గురువారం లంబసింగిలో వారపుసంతలు జరుగుతాయి. ఒక్క అన్నవరం మినహా మిగతాచోట్ల వీటికి ప్రత్యేకంగా స్థలాలు లేవు. దీంతో వ్యాపారులు రహదారికి ఇరువైపులా దుకాణాలు వేసి వ్యాపారాలు కొనసాగిస్తున్నారు. లోతుగెడ్డ కూడలిలో గతంలో దుకాణాలను మార్కెట్‌యార్డు నిధులతో నిర్మించినా వాటిని వ్యాపారులు వినియోగించడం లేదు. ఇవి నిరుపయోగంగా మారాయి. రహదారికి ఆనుకునే ఇరువైపులా అన్ని రకాల దుకాణాలూ వేయడం వల్ల ట్రాఫిక్‌ సమస్య అధికంగా ఉంటోంది. ఇటీవల ఆటోలు, జీపులు వంటి ప్రైవేటు వాహనాలు బాగా పెరిగాయి. ద్విచక్రవాహనాల వినియోగం బాగా పెరిగింది. సంతల రోజున వాహనాలు తప్పుకోవాలంటే ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఎదురెదురుగా వస్తున్న వాహనాలు తప్పుకొనే క్రమంలో ఒక్కోసారి ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. గతంలో లంబసింగి వారపుసంతను పంచాయతీ కార్యాలయం వెనుక ఖాళీగా ఉన్న స్థలంలో ఏర్పాటు చేసేందుకు అధికారులు ప్రయత్నించినా భూ యజమాని అంగీకరించకపోవడంతో మార్పు జరగలేదు. ట్రాఫిక్‌ క్రమబద్ధీకరణ కోసం పోలీసులు వెళ్లాల్సిన పరిస్థితి ఎదురవుతోంది. అధికార యంత్రాంగం మన్యంలోని వారపు సంతలకు ప్రత్యేక స్థలాలు కేటాయిస్తే ఇబ్బందులు తప్పుతాయి. ఈ ఇబ్బందులను అధిగమించేందుకు చర్యలు చేపడతామని తహసీల్దారు రామకృష్ణ తెలిపారు. త్వరలో వ్యాపారులు, ప్రజాప్రతినిధులు, పోలీసు, పంచాయతీ పాలకవర్గాలతో సమావేశాన్ని ఏర్పాటు చేసి సలహాలు తీసుకుంటామని పేర్కొన్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని