logo

నీటికి నిలకడ నేర్పుతూ...!

కాలం మారుతున్నా గిరిజన ప్రాంతాల్లో ఇప్పటికీ రైతులు సంప్రదాయ పద్ధతులనే ఆచరిస్తున్నారు. ఇవి పది మందికీ ఆదర్శంగా నిలుస్తున్నాయి. ప్రధానంగా వర్షపునీటిని సద్వినియోగం చేసుకోవడంలో వీరు ముందుంటున్నారు. 

Updated : 25 May 2024 10:26 IST

చింతపల్లి, న్యూస్‌టుడే 

కాలం మారుతున్నా గిరిజన ప్రాంతాల్లో ఇప్పటికీ రైతులు సంప్రదాయ పద్ధతులనే ఆచరిస్తున్నారు. ఇవి పది మందికీ ఆదర్శంగా నిలుస్తున్నాయి. ప్రధానంగా వర్షపునీటిని సద్వినియోగం చేసుకోవడంలో వీరు ముందుంటున్నారు. 

గిరిజన ప్రాంతాల్లో వ్యవసాయం అత్యధిక శాతం కొండ, ఏటవాలు ప్రాంతాల్లోనే జరుగుతుంటుంది. అక్కడ కేవలం వర్షాధారంగా పంటలను పండించడం తప్ప మరో ప్రత్యామ్నాయం లేదు. దీంతో రైతులు ఎప్పుడు వర్షం పడినా ఆ నీటిని ఒడిసిపట్టి సాగునీటిగా మలుచుకుంటూ ఆదర్శంగా నిలుస్తున్నారు. సాధారణంగా ఖరీఫ్‌ పనులను జూన్, జులై నెలల్లో వర్షాలు కురిసే సమయంలో ప్రారంభిస్తుంటారు. అల్లూరి జిల్లాలో గిరి రైతులు ఇందుకు ప్రత్యేకమనే చెప్పాలి. వీరు నెలలతో సంబంధం లేకుండా ఎప్పుడు వర్షం పడితే అప్పుడే వ్యవసాయ పనులను ప్రారంభిస్తుంటారు. ప్రస్తుతం మే నెల అయినప్పటికీ అడపాదడపా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో మన్యంలో అప్పుడే వ్యవసాయ పనులు ప్రారంభించేశారు.


రాతికట్టల నిర్మాణం

గిరిజన ప్రాంతాల్లో 90 శాతం మంది రైతులు కేవలం వర్షాధారంగానే దాదాపు అన్ని రకాల పంటలు సాగు చేస్తున్నారు. సాగునీటి వనరులున్నా తగినన్ని చెక్‌డ్యాంలు, కాలువలు లేక, ఉన్నవి పనిచేయక నీరందడం లేదు. ఈ కారణంగానే రబీలో దాదాపు పొలాలన్నీ ఖాళీగా కనిపిస్తుంటాయి. పశువులను యథేచ్ఛగా వదిలేస్తుంటారు. ప్రస్తుతం వర్షాలు పడుతుండటంతో అన్నదాతలు వాననీటి సద్వినియోగం చేసుకునే పనుల్లో నిమగ్నమయ్యారు. కొండ దిగువన ఉన్న పంట పొలాలకు నీరందించడంతోపాటు సాగునీటి నిల్వకు రాతికట్టలను నిర్మిస్తున్నారు. కొండలపై పడే వర్షపునీరు లోతట్టు ప్రాంతాల్లోకి కొట్టుకుపోకుండా ఇవి ఉపయోగపడుతున్నాయి. 

కేజీ బియ్యం ఉత్పత్తి చేయడానికి అవసరమయ్యే నీరు ఎంతో తెలుసా.. అక్షరాలా నాలుగు నుంచి ఐదువేల లీటర్లు. నమ్మలేకపోయినా ఇది నిజం. శాస్త్రవేత్తలు దీన్ని నిర్ధారించారు. భూగర్భ జలాలు అడుగంటుతుండటంతో నీటి వనరులు తగినంతగా లేక వ్యవసాయానికి కొందరు దూరమవుతున్నారు. ఈ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని పంటలకు అవసరమైనంత నీటి వినియోగంపై చింతపల్లి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనాస్థానం శాస్త్రవేత్తలు అన్నదాతలకు అవగాహన కల్పిస్తున్నారు.


వాననీటిలో వినియోగించేది 15 శాతమే..

పంటకైనా సరే అవసరానికి మించి నీరు వాడితే లాభం కన్నా నష్టమే అధికంగా ఉంటుంది. వర్షపు నీటిని గిరిజన రైతులు కేవలం 10 నుంచి 15 శాతం మాత్రమే వినియోగించుకోగలుగుతున్నారు. సుమారు 40 శాతం వర్షపునీరు భూమిలోకి ఇంకకుండా వృథాగా పోతోంది. దీనివల్ల నీటితోపాటు పంటకు అందాల్సిన విలువైన పోషకాలతో కూడిన మట్టి సైతం కొట్టుకుపోతోంది. ఈ పరిస్థితిని నివారించాలంటే వర్షపు నీటిని ఎక్కడికక్కడ నిల్వ ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి. గిరి రైతులకు శాస్త్రీయ విధానాలు తెలియకపోయినా వారు సంప్రదాయ విధానాలతోనే నీటి సంరక్షణ విషయంలో ముందుంటున్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు