logo

ఏజెన్సీలో ఉచిత న్యాయ సేవలే లక్ష్యం

ఏజెన్సీ ప్రాంతంలో పేద, బడుగు, బలహీన వర్గాల వారికి జాతీయ న్యాయ సేవా సంస్థ ద్వారా ఉచిత న్యాయ సహాయాన్ని అందించనున్నట్లు రంపచోడవరం ఫస్ట్‌క్లాస్‌ మేజిస్ట్రేట్, మండల లీగల్‌ సర్వీసెస్‌ అథారిటీ చైర్మన్‌ పి.బాబు పేర్కొన్నారు.

Published : 25 May 2024 01:48 IST

మేజిస్ట్రేట్‌ బాబు

రంపచోడవరం, న్యూస్‌టుడే: ఏజెన్సీ ప్రాంతంలో పేద, బడుగు, బలహీన వర్గాల వారికి జాతీయ న్యాయ సేవా సంస్థ ద్వారా ఉచిత న్యాయ సహాయాన్ని అందించనున్నట్లు రంపచోడవరం ఫస్ట్‌క్లాస్‌ మేజిస్ట్రేట్, మండల లీగల్‌ సర్వీసెస్‌ అథారిటీ చైర్మన్‌ పి.బాబు పేర్కొన్నారు. స్థానిక ఐటీడీఏ సమావేశ మందిరంలో శుక్రవారం న్యాయవాదులు, ఐసీడీఎస్, గిరిజన సంక్షేమ, పోలీసు శాఖ అధికారులతోపాటు సచివాలయాల మహిళా పోలీసులు, మహిళా సంఘాల వారితో న్యాయవిజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా మేజిస్ట్రేట్‌ బాబు మాట్లాడుతూ కొంతమంది మహిళలు పొట్టకూటి కోసం వ్యభిచార ఊబిలోకి దిగుతున్నారని, దీనికి స్వస్తి పలికేలా వారికి అవగాహన కల్పించాలన్నారు. రేషన్, ఆధార్, ఓటరు ఐడీ కార్డులు లేనివారు దరఖాస్తు చేస్తే లీగల్‌ సెల్‌ ద్వారా న్యాయం చేయవచ్చన్నారు. కొండపోడు వ్యవసాయం చేసుకుంటున్న గిరిజనులకు అటవీ హక్కుల చట్టం అమలులో ఉందన్నారు. 18 నుంచి 22 ఏళ్ల వయసున్న వారిని గంజాయి కూలీలుగా వినియోగిస్తున్నారని పేర్కొన్నారు. సీఐ వాసా వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ఏజెన్సీలో చాలామంది మహిళలకు మండల లీగల్‌ సర్వీసెస్‌ అథారిటీ ఉందని తెలియదన్నారు. గ్రామస్థాయిలో అవగాహన కల్పించేందుకు ప్రతిఒక్కరూ కృషి చేయాలని కోరారు. సదస్సులో ఐటీడీఏ ఏపీఓ శ్రీనివాసరావు, గిరిజన సంక్షేమశాఖ ఉప సంచాలకులు అబ్సులోము, ఎంపీడీఓ హరికృష్ణ, వెలుగు ఏపీడీ శ్రీనివాసరావు, సీడీపీఓలు సంధ్యారాణి, ప్రసన్నలక్ష్మి, న్యాయవాదులు ఎం.వి.ఆర్‌.ప్రకాష్, సత్యప్రసాద్, చుక్కా సంతోష్‌కుమార్, వెంకట్రావు, జిలానీ తదితరులు పాల్గొన్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని