logo

ఊళ్లన్నీ నీళ్లు.. ఉప్పొంగే కన్నీళ్లు..

వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చి అయిదేళ్లు పూర్తయింది. ఎన్నికలు జరిగాయి. మరో 10 రోజుల్లో ఫలితాలు వస్తాయి. ఈ ఐదేళ్లలో ప్రభుత్వం పోలవరం నిర్వాసితుల గోడు కాస్తయినా పట్టించుకోలేదు.

Published : 25 May 2024 02:03 IST

ఏటేటా అదే బతుకు భయం 
పోలవరం నిర్వాసితుల దయనీయ జీవనం 
వరరామచంద్రాపురం, న్యూస్‌టుడే 

మరికొన్ని రోజుల్లో వర్షాకాలం రానుంది. ఎగువ ప్రాంతంలో వర్షాలు పడితే గోదావరి నదిలో నీటిమట్టం పెరుగుతుంది. నదిలో నీళ్లు పెరిగితే.. పోలవరం ప్రాజెక్టు నిర్వాసితుల గుండెల్లో రైళ్లు పరిగెడతాయి. కాళ్ల కింద నేల కనుమరుగై.. ఊరూవాడా.. చెట్టుపుట్టా మాయమైపోతుంది. బతుకు భయంతో కుటుంబమంతా ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఎక్కడెక్కడికో పరుగు తీసిన గత అనుభవాలు ఇంకా నిర్వాసితుల కళ్లముందే ఉన్నాయి. పట్టించుకోవాల్సిన పాలకులు పత్తా లేకుండాపోవడంతో గంపెడాకలితో.. గుండెనిండా బరువుతో కొండాకోనలపై వారాల తరబడి బతకాల్సి వచ్చింది. ఈ ఏడాదీ వర్షాకాలం ఇలాగే గడపాల్సి వస్తుందన్న నిజం నిర్వాసితులకు నిద్ర  పట్టనివ్వడం లేదు. 

నిర్వాసితుల సమస్యలపై చింతూరు ఐటీడీఏ చైతన్య వద్ద ‘న్యూస్‌టుడే’ ప్రస్తావించగా కాలనీలు పూర్తిచేసి నిర్వాసితులను తరలించడానికి ప్రత్యేక ప్రణాళిక సిద్ధం చేశాం. నిర్వాసితులతో కూడా ఇప్పటికే సమావేశాలు నిర్వహించామన్నారు. ప్రభుత్వం నుంచి అనుమతులు రాగానే నిర్వాసితులను తరలిస్తామని, వారికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూస్తామని పీఓ వివరించారు.

వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చి అయిదేళ్లు పూర్తయింది. ఎన్నికలు జరిగాయి. మరో 10 రోజుల్లో ఫలితాలు వస్తాయి. ఈ ఐదేళ్లలో ప్రభుత్వం పోలవరం నిర్వాసితుల గోడు కాస్తయినా పట్టించుకోలేదు. పునరావాసం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందాన ఉండిపోయింది. రేపు ఓట్ల లెక్కింపు తరవాత కొత్త ప్రభుత్వం కొలువుదీరి నిర్వాసితుల సమస్యపై కార్యాచరణ ప్రారంభించే సమయానికి వర్షాలు అధికమై గోదావరి పోటెత్తుతుంది. ఆ వరద ముంపు గ్రామాలపై పడుతుంది. మళ్లీ సమీపంలోని కొండలపైన, గుట్టలపైన, పరాయి గ్రామాల్లో గుడారులు వేసుకుని మూడు నెలల వణకాల్సిందే. ప్రభుత్వ తీరుపై నమ్మకం లేకపోవడంతో మారుమూల గ్రామాల ప్రజలు 2022లో కొండలపై వేసుకున్న గుడిసెలు తొలగించలేదు. 


కొండలే అండగా..

2022లో వచ్చిన వరదలకు, ప్రభుత్వ అధికారుల ముందస్తు హెచ్చరికలు లేకపోవడంతో కూనవరం, వరరామచంద్రాపురం మండలాల నిర్వాసితులు అధికంగా నష్టపోయారు. ఇళ్లను ముంచెత్తిన వరదను తప్పించుకోవడానికి సమీపాన ఉన్న కొండలే, అండగా నిలిచి ప్రాణాలు కాపాడాయి. తుమ్మిలేరు, పోచవరం, శ్రీరామగిరి పంచాయతీల్లోని అన్ని గ్రామాల ప్రజలు పక్కనున్న కొండలపైకి ఎక్కారు నాలుగు నెలలు అక్కడే ఉండిపోయారు. శ్రీరామగిరి వాసులకు రామయ్య ఆలయం కొండే అండగా నిలిచింది. జీడిగుప్ప పంచాయతీలో జీడిగుప్ప, కొటారుగొమ్ము, ఇప్పూరు తదితర గ్రామాలు, చిన్నమట్టపల్లి పంచాయతీలోని గ్రామాలన్నీ దూరంలో ఉన్న కొండలపైన పాకలు వేసుకుని చీకటిలో, బురదలో వర్షాలకు తడస్తూ, చలికి వణుకుతూ వరద తగ్గేవరకు కాలం వెళ్లదీశారు. ఆ ఏడాది మూడుసార్లు వరద వచ్చి ప్రజలను ఇక్కట్లపాలు చేసింది. కొండలు లేకపోతే వందల సంఖ్యలో నిర్వాసితుల ప్రాణాలు నీటిపాలయ్యేవి. చింతరేవుపల్లికి చెందిన వ్యక్తి అనారోగ్యంతో మృతి చెందితే, పడవలను తీసుకుని సమీప అటవీ ప్రాంతానికి తీసుకెళ్లి దహన సంస్కారాలు చేయాల్సి వచ్చింది. 


ప్రభుత్వం చొరవచూపకే ఈ కష్టాలు

- రంగారెడ్డి, జడ్పీటీసీ సభ్యుడు, వరరామచంద్రాపురం   

తెదేపా ప్రభుత్వ హయాంలో పోచవరం పంచాయతీ గిరిజనులకు జంగారెడ్డిగూడెం దగ్గరలో పునరావాస కాలనీలకు ఏర్పాట్లు చేశారు. దాదాపుగా 70 శాతం పనులు పూర్తిచేసేసరికి ఎన్నికలు వచ్చి ప్రభుత్వం మారిపోయింది. మా కాలనీల్లో పనులు ఆగిపోయాయి. వైకాపా ప్రభుత్వం చొరవ చూపి, మిగిలిన పనులు పూర్తిచేసి ఉంటే ఈ రోజున తుమ్మిలేరు, పోచవరం పంచాయతీ పరిధిలోని గ్రామాలు ఖాళీ అయ్యేవి. అయిదేళ్లు అలాచేస్తాం, ఇలాచేస్తాం అని కాలం కరగదీశారు, మాకు వరద కష్టాలు మిగిల్చారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని