logo

సీతారామయ్యా.. ఎంత కష్టమొచ్చిందయ్యా!

పోలవరం ప్రాజెక్టు నిర్వాసితుల పునరావాసం కల్పించడంలో ప్రభుత్వం ఏళ్ల తరబడి నిర్లక్ష్యం వహిస్తూ వారి జీవితాలను చిన్నాభిన్నం చేస్తోంది.

Published : 25 May 2024 02:04 IST

దేవీపట్నం, న్యూస్‌టుడే

పోలవరం ప్రాజెక్టు నిర్వాసితుల పునరావాసం కల్పించడంలో ప్రభుత్వం ఏళ్ల తరబడి నిర్లక్ష్యం వహిస్తూ వారి జీవితాలను చిన్నాభిన్నం చేస్తోంది. ధవళేశ్వరంలోని పోలవరం ప్రాజెక్టు పరిపాలనాధికారి కార్యాలయంలో శుక్రవారం రైతు ఉండమట్ల సీతారామయ్య పురుగు మందు తాగి ఆత్మహత్యా యత్నం చేయడం నిర్వాసిత గ్రామాల ప్రజలను తీవ్రంగా కలచివేసింది. 

ళ్లో పది మందికి పని కల్పించి.. గ్రామానికి తనవంతు సాయం చేస్తూ.. పరిసర గ్రామాల్లో మంచి రైతుగా సీతారామయ్యకు పేరుంది. దేవీపట్నం మండల కేంద్రంలో ఆయన పేరు తెలియని వారుండరు. గ్రామంలో కొండపై ఉన్న చోళరాజుల కాలం నాటి శివాలయానికి ఛైర్మన్‌గా పనిచేశారు. ఆలయం అభివృద్ధికి ఎంతో తోడ్పడ్డారు. చోళరాజుల కాలం నాటి ఆలయం కావడంతో ఏటా శివరాత్రి రోజున వేల సంఖ్యలో వచ్చే భక్తుల అన్న సమారాధన కార్యక్రమంలో ఆయనే ముందుండి నడిపించేవారు. పూర్వ కాలం నుంచి గ్రామంలో పెద్దరైతు కావడంతో అనేక మందికి నిత్యం తన పొలంలో పని కల్పించేవారు. ఆయనకున్న భూమికి, ఇంటికి సైతం ప్రభుత్వం నుంచి పరిహారం పొందారు. అయితే పోలవరం ముంపులో ఆయనను నిర్వాసితుడిగా గుర్తించలేదు. అధికారులు ఆయన కుటుంబాన్ని ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీల్లో అర్హులుగా గుర్తించలేదు. దాదాపు ఐదేళ్లుగా రంపచోడవరం ఐటీడీఏ, ధవళేశ్వరంలో ఉన్న ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతూ ఆ పెద్దాయన అలసిపోయారు. ఈ క్రమంలోనే శుక్రవారం ధవళేశ్వరంలోని పోలవరం ప్రాజెక్టు పరిపాలనాధికారి కార్యాలయానికి వెళ్లారు. అక్కడి అధికారుల తీరుతో మనస్తాపానికి గురై కార్యాలయం వద్దే పురుగుమందు తాగి ఆత్మహత్యాయత్నం చేశారు. 

ముంపు గ్రామాల్లో కలకలం: సీతారామయ్య ఆత్మహత్యాయత్నం తెలుసుకున్న దేవీపట్నం మండలం పోలవరం ముంపు గ్రామాల నిర్వాసితులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. దేవీపట్నంలో ఉన్న నిర్వాసితులు ఆయన కుటుంబ సభ్యులకు ఎప్పటికప్పుడు ఫోన్లు చేస్తూ ఆరోగ్య పరిస్థితి తెలుసుకుంటున్నారు. ఘటనపై స్థానిక అధికారులు సైతం ఆరాతీస్తున్నారు. శనివారం ఆసుపత్రికి ముంపు గ్రామాల నిర్వాసితులు పెద్ద సంఖ్యలో వెళ్లేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు