logo

జలవనరుల ఆధునికీకరణకు జెల్ల

సాగునీటి వనరుల ఆధునికీకరణ, ఆయకట్టు స్థిరీకరణకు జపాన్‌ అంతర్జాతీయ సహకార సంస్థ (జైకా), ప్రపంచ బ్యాంకులు ఆర్థిక సాయం చేయడానికి ముందుకు వచ్చాయి.

Updated : 26 May 2024 03:34 IST

చెరువుల బాగుపై చేతులెత్తేసిన సర్కారు
ప్రపంచబ్యాంకు నిధులిచ్చినా ఉపయోగించుకోని తీరు

ఆధునికీకరణకు నోచుకోని తాజంగి జలాశయం కాలువ 

ఈనాడు అనకాపల్లి: సాగునీటి వనరుల ఆధునికీకరణ, ఆయకట్టు స్థిరీకరణకు జపాన్‌ అంతర్జాతీయ సహకార సంస్థ (జైకా), ప్రపంచ బ్యాంకులు ఆర్థిక సాయం చేయడానికి ముందుకు వచ్చాయి. జలవనరుల శాఖ ప్రతిపాదనలు, అంచనాలకు అయిదేళ్ల క్రితమే ఆమోదం తెలిపాయి. ఆయా పనులు మాత్రం కార్యరూపంలోకి తీసుకురాలేక సర్కారు చేతులెత్తేసింది. విదేశీ సంస్థలు సొమ్ములివ్వడానికి ముందుకొచ్చినా వైకాపా సర్కారు తన వాటాధనం ఖర్చు చేయడానికి వెనకడుగు వేయడంతో అయిదేళ్లలో ఒక్క చెరువు కూడా బాగు చేయలేకపోయారు. ప్రభుత్వంపై నమ్మకం లేక టెండర్లు వేయడానికి గుత్తేదారులు ముందుకు రాలేదు.. వచ్చినవారు మధ్యలోనే పనులు వదిలేసి వెళ్లిపోవడంతో చెరువులకు చేటే మిగిలింది.

ఉమ్మడి జిల్లాలో 69 గొలుసుకట్టు చెరువులతో పాటు రైవాడ జలాశయం కాలువుల ఆధునికీరణకు ప్రపంచబ్యాంకు, జైకా సంస్థలు నిధులివ్వడానికి ఆసక్తి చూపాయి. తాము ఇచ్చే సొమ్ములకు రాష్ట్ర ప్రభుత్వం కూడా కొంత కలిపి సాగునీటి వనరుల అభివృద్ధికి ఖర్చు చేయాలని సూచించాయి. మొత్తం రూ. 89.31 కోట్లతో 14,123 ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ చేయడానికి అడుగులు వేశారు. రూ.58.99 కోట్లతో 39 పనులకు నాలుగేళ్ల క్రితమే టెండర్లు పిలిచి గుత్తేదారులకు అప్పగించారు. వారు కొంత మేర పనులు చేసినా బిల్లులు చెల్లింపుల్లో తీవ్ర జాప్యం చేయడంతో వారంతా మధ్యలోనే వదిలేసి వెళ్లిపోతున్నారు. ఇప్పటికే అయిదు పనులకు సంబంధించి గుత్తేదారులతో ఒప్పందాలు రద్దు చేసేశారు. మిగతా గుత్తేదారులు అదే బాటలో ఉన్నారు. 

జైకా నిధులతో ఆధునికీకరించాల్సిన రైవాడ జలాశయం కాలువ దుస్థితి ఇదీ 

అనకాపల్లి జిల్లాలో..

  • రూ.11.59 కోట్ల జైకా నిధులతో 31 మైనర్‌ ఇరిగేషన్‌ చెరువుల ఆధునికీకరణ పనులు చేయడానికి మూడేళ్ల క్రితమే ఆరు ప్యాకేజీలుగా టెండర్లు పిలిచారు. వీటి ద్వారా 5,596 ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ జరుగుతుందని ఆశించారు. కొన్ని చెరువుల పనులు మొదలుపెట్టినా పూర్తి చేయలేకపోయారు. ఇప్పటివరకు కేవలం రూ. 15 లక్షలు మాత్రమే బిల్లులు చెల్లించారంటే ఈ పనుల ప్రగతి ఏ స్థాయిలో ఉన్నాయో అర్థమవుతుంది. 
  • జైకా నిధులతోనే రైవాడ జలాశయం కాలువ ఆధునికీకరణ చేపట్టారు. రూ. 30.43 కోట్లతో నాలుగేళ్ల క్రితమే టెండర్లు పిలిచి ఓ గుత్తేదారు సంస్థకు అప్పగించారు. మొదటి ఏడాది రూ.4 కోట్ల పనులు చేసినా బిల్లులు సకాలంలో చెల్లించకపోవడం, చేసిన పనులు కాలువ ప్రవాహంలో కొట్టుకుపోవడంతో సదరు గుత్తేదారు సంస్థ మధ్యలోనే వదిలి వెళ్లిపోయింది. 
  • ప్రపంచబ్యాంకు నిధులతో 50 చెరువులను పునరుద్ధరణ కోసం రూ. 33.46 కోట్ల విలువైన పనులకు టెండర్లు నాలుగేళ్ల క్రితమే పిలిచారు. అందులో 33 చెరువుల పనులకు గుత్తేదారులతో ఒప్పందాలు చేసుకున్నారు. మిగతా 17 చెరువు పనులకు కాంట్రాక్టర్లు ఎవరూ ముందుకు రాకపోవడంతో వాటిలో కదలిక లేకుండా పోయింది. గుత్తేదారులు చేపట్టిన పనులు కూడా బిల్లులు చెల్లింపుల్లో జాప్యం కారణంగా మధ్యలోనే వదిలేస్తున్నారు. ఇప్పటివరకు కేవలం రూ. 1.93 కోట్లు పనిమాత్రమే జరిగింది. 

అల్లూరి జిల్లాలో... 

ప్రపంచబ్యాంకు నిధులు రూ.3.36 కోట్లతో అయిదు చెరువుల పునరుద్ధరణ పనులు చేపట్టారు. వాటిలో మూడు పనులకు మాత్రమే గుత్తేదారులు ముందుకు వచ్చారు. మూడేళ్లలో కేవలం రూ. 6.92 లక్షలు మాత్రమే ఈ పనులపై ఖర్చుచేశారు. మిగిలిన రెండు పనుల్లో ఒక గుత్తేదారు మొదటే పనిచేయలేమని తప్పుకొన్నారు. మరోపనికి గుత్తేదారు ఎవరూ ముందుకు రాలేదు. 

ఇదీ పనుల తీరు..

  • రాంబిల్లి మండలం దిమిలి వద్దనున్న తామరచర్ల కాలువ అభివృద్ధికి రూ. 97.37 లక్షల అంచనా విలువతో 2019లోనే గుత్తేదారుకు అప్పగించారు. ఈ పని చేయాల్సిన కాలపరిమితిని రెండుసార్లు పొడిగించినా పని మాత్రం జరగలేదు. 
  • ఎస్‌.రాయవరం మండలం వేమగిరిలో ఉమ్మడి చెరువుతోపాటు 12 అనుసంధాన చెరువులు, కాలువలను బాగు చేయడానికి రూ. 7.47 కోట్ల పనులు గుత్తేదారుకు 2020లో అప్పగించారు. కేవలం 15 శాతం మాత్రమే చేసి మధ్యలోనే వదిలేశారు.
  • చింతపల్లి మండలం తాజంగి జలాశయం అభివృద్ధికి రూ. 92.21 లక్షలు కేటాయించారు. బిల్లుల చెల్లింపులపై అనుమానంతో గుత్తేదారు కేవలం ఆరుశాతం పనులు చేసి నిలిపేశారు.  
  • కొయ్యూరు మండలంలో లుబ్బర్తి జలాశయం అభివృద్ధికి రూ. 44.19 లక్షలు మంజూరు చేశారు. గుత్తేదారు కూడా 75 శాతం పనులు పూర్తిచేశారు. చేసినవాటికి సకాలంలో బిల్లులు అందకపోవడంతో మిగతా 25 శాతం పనులు చేయకుండా నిలిపేశారు. 
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు