logo

భారీ వానలు..రహదారికి బీటలు

ముంచంగిపుట్టు మండలంలో శుక్రవారం రాత్రి కురిసిన భారీ వర్షానికి వనుగుమ్మ పంచాయతీ డాబుగుడ, సంగడ మధ్యలో ఆర్‌అండ్‌బీ ప్రధాన రహదారి కోతకు గురైంది

Published : 26 May 2024 02:00 IST

లోతుగెడ్డ కూడలిలో రోడ్డు దుస్థితి 

ముంచంగిపుట్టు గ్రామీణం, న్యూస్‌టుడే: ముంచంగిపుట్టు మండలంలో శుక్రవారం రాత్రి కురిసిన భారీ వర్షానికి వనుగుమ్మ పంచాయతీ డాబుగుడ, సంగడ మధ్యలో ఆర్‌అండ్‌బీ ప్రధాన రహదారి కోతకు గురైంది. ఇటీవల సెల్‌ టవర్ల నిర్మాణంలో భాగంగా కేబుల్‌ పనుల కోసం రహదారి అంచులను తవ్వారు. దీంతో అరకొర నాణ్యతా ప్రమాణాలతో నిర్మించిన ప్రధాన రహదారి పలుచోట్ల దెబ్బతింది. తాజా వర్షానికి కోతకు గురైంది. వనుగుమ్మ, రంగబయలు, దోడిపుట్టు పంచాయతీవాసులతోపాటు ఒడిశా ప్రజలు ఇదే రహదారిపై ఆధారపడుతుంటారు. రోడ్డు కోతకు గురవడంతో భారీ వాహనాల రాకపోకలకు కొంత మేర ఆటంకం కలిగింది. ఇక్కడ ఏమాత్రం ఏమరుపాటుగా ఉన్నా ప్రమాదం చోటుచేసుకుంటుందని వాహన చోదకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గతంలో లబ్బూరు సమీపంలో రహదారి కోతకు గురైతే ఏడాది వరకు సంబంధిత ఆర్‌అండ్‌బీ అధికారులు స్పందించలేదు. దీనిని కూడా ఇలాగే వదిలేస్తే రాకపోకలు స్తంభించిపోతాయని ఈప్రాంత వాసులు చెబుతున్నారు. అధికారులు స్పందించి వెంటనే మరమ్మతులు జరిపించాలని ఉప ఎంపీపీ భాగ్యవతి, సర్పంచి మిల్కి తదితరులు కోరుతున్నారు.

జాతీయ రహదారి.. చిత్తడిగా మారి!

మన్యంలో కురుస్తున్న వర్షాల కారణంగా జాతీయ రహదారి (516-ఈ) చిత్తడిగా మారుతోంది. ప్రస్తుతం చింతపల్లి మండలం లోతుగెడ్డ కూడలిలో విస్తరణ పనులు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా రహదారిపై మట్టిపోసి చదును చేస్తున్నారు. వర్షాలు పడుతుండటంతో మట్టి అంతా కొట్టుకుపోయి చిత్తడిగా మారుతోంది. దీంతో రాకపోకలకు వాహన చోదకులు ఇబ్బందులు పడుతున్నారు.
- చింతపల్లి, న్యూస్‌టుడే 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని