logo

ఆ నిధులు వెనక్కు ఇచ్చేయండి

రాష్ట్రంలో గిరిజన సంక్షేమ శాఖ కోసం విడుదల చేసిన నిధులు ఖర్చు కాకపోవడంతో ఆ నిధులన్నీ పక్కాగా తమకు తిరిగి ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి ఇటీవల ఆదేశించినట్లు విశ్వసనీయంగా తెలిసింది.

Published : 26 May 2024 02:07 IST

గిరిజన సంక్షేమానికి కేటాయించిన సొమ్ము దారి మళ్లింపు
రాష్ట్ర ప్రభుత్వ తీరుపై కేంద్రం ఆగ్రహం

చింతపల్లి మండలం తాజంగిలో గిరిజన మ్యూజియం పనులు 

పాడేరు పట్టణం, చింతపల్లి, న్యూస్‌టుడే: రాష్ట్రంలో గిరిజన సంక్షేమ శాఖ కోసం విడుదల చేసిన నిధులు ఖర్చు కాకపోవడంతో ఆ నిధులన్నీ పక్కాగా తమకు తిరిగి ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి ఇటీవల ఆదేశించినట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఈ నేపథ్యంలో నిధుల వివరాల సేకరణలో ఆ శాఖ మల్లగుల్లాలు పడుతోంది. రాష్ట్ర గిరిజన సంక్షేమశాఖకు ఏటా కేంద్రం నుంచి రూ. కోట్లలో నిధులు విడుదల అవుతుంటాయి. ఈ నిధులతో ప్రధానంగా ఆదివాసీ గిరిజనుల సంక్షేమంతోపాటు వనబంధు కల్యాణ యోజన, ఏకలవ్య పాఠశాలలు, గురుకులాల అభివృద్ధితోపాటు ఇతర కార్యక్రమాలు చేయాల్సి ఉంది. ఆయా నిధులను రాష్ట్రంలోని తొమ్మిది ఐటీడీఏలకు జనాభా ప్రాతిపదికన గిరిజన సంక్షేమశాఖ కమిషనరేట్‌ కేటాయిస్తోంది. ఖర్చుల వివరాలను ఎప్పటికప్పుడు నివేదిక రూపంలో కేంద్రానికి పంపాల్సి ఉంది. వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కేంద్రం నుంచి విడుదలవుతున్న నిధులు వేర్వేరు పథకాలకు మళ్లిస్తోంది. దీనిపై తీవ్రంగా స్పందించిన కేంద్ర ప్రభుత్వం ఆయా నిధుల ఖర్చులు, జమపై తమకు పది రోజుల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశించినట్లు సమాచారం. ఒక వేళ ఖర్చు కాకపోతే వడ్డీతో లెక్కించి తమకు వాపసు చేయాలని ఆదేశించడం చర్చనీయాంశంగా మారింది.

  • రాష్ట్రంలో పెద్దదైన పాడేరు ఐటీడీఏకు కేంద్రం నుంచి నిధులు భారీగా సమకూరాయి. ప్రధానంగా సుమారు రూ.89.2 కోట్లతో 2020-21లో ఏర్పాటు చేసిన పసుపు ప్రాజెక్టుకు కేంద్రం వాటాగా సుమారు రూ. 55.02 కోట్ల వరకూ కేటాయించారు. ఈ నిధులు వేర్వేరు పథకాలకు మళ్లించడంతో ప్రాజెక్టు నిర్వీర్యమైంది. చింతపల్లి మండలం తాజంగిలో రూ. 35 కోట్లతో నిర్మిస్తున్న గిరిజన మ్యూజియంకు కేంద్రం వాటాగా సుమారు రూ. 20 కోట్లు విడుదల చేశారు. ఆయా నిధులు రాష్ట్ర ప్రభుత్వం వేర్వేరు అవసరాలకు వినియోగించడంతో ఈ పనులు నత్తనడకన సాగుతున్నాయి. ఈ మ్యూజియం పనుల పరిశీలనకు గతంలో కేంద్ర బృందం వచ్చింది. వనబంధు పథకం ద్వారా జి.మాడుగుల మండల అభివృద్ధికి రూ. 10 కోట్లు కేంద్రం విడుదల చేయగా.. ఆ నిధులు పూర్తిస్థాయిలో ఖర్చు కాలేదని స్థానికులు పలుమార్లు ఫిర్యాదు చేశారు. ప్రతి మండలంలో ఏకలవ్య పాఠశాల నిర్మాణం నిమిత్తం ఒక్కో పాఠశాలకు రూ. 25 కోట్ల వరకు కేంద్రం కేటాయించింది. గురుకుల పాఠశాలల అభివృద్ధి, పీవీటీజీ, సీసీడీపీ తదితర పథకాల ద్వారా పాడేరు ఐటీడీఏకు నిధులు భారీగా సమకూరాయి. ఈ లెక్కలన్నీ ఇప్పుడు కేంద్రానికి ఐటీడీఏ సమర్పించాల్సి ఉంది. 
  •  పీఎం- జన్‌మన్‌ పథకం ద్వారా పాడేరు ఐటీడీఏ పరిధిలోని 274 పీవీటీజీ గ్రామాల్లో తాగునీరుతోపాటు ఇతర సదుపాయాలు కల్పించాల్సి ఉంది. దీని కోసం ఒక్కో గ్రామానికి రూ. 25 లక్షల వరకూ కేటాయించారు. ఈ పథకం అమలు తీరుపై గత ఏడాది అరకులోయ కేంద్రంగా ప్రధానమంత్రి మోదీ వర్చువల్‌గా సమీక్షించారు. పీవీటీజీల పురోగతిపై ఆరా తీశారు. 
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు