logo

సెలవుల్లో రయ్‌రయ్‌..

వేసవి సెలవులు నర్సీపట్నం స్కేటింగ్‌ క్రీడాకారుల్లో మరింత ఉత్సాహాన్ని నింపుతున్నాయి. ఇందులో మరింత పట్టు పెంచుకునేందుకు ఈ సమయాన్ని వినియోగించుకుంటున్నారు. జాతీయ పోటీల్లోనూ పతకాలు గెలుపొందాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నారు. 

Updated : 26 May 2024 03:37 IST

స్కేటింగ్‌లో పతకాలపై నర్సీపట్నం బాలల గురి

జాతీయ పోటీలకు సాధన చేస్తున్న క్రీడాకారులు 
నర్సీపట్నం, న్యూస్‌టుడే: వేసవి సెలవులు నర్సీపట్నం స్కేటింగ్‌ క్రీడాకారుల్లో మరింత ఉత్సాహాన్ని నింపుతున్నాయి. ఇందులో మరింత పట్టు పెంచుకునేందుకు ఈ సమయాన్ని వినియోగించుకుంటున్నారు. జాతీయ పోటీల్లోనూ పతకాలు గెలుపొందాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నారు. 
నర్సీపట్నానికి చెందిన బాలలు కొన్నేళ్లుగా స్కేటింగ్‌లో అందరిని దృష్టిని ఆకర్షిస్తున్నారు. పూర్తిస్థాయి సదుపాయాలు కొరవడినప్పటికీ కేవలం ఉత్సాహం, పట్టుదలతో పతకాల పంట పండిస్తున్నారు. ఒకరిని చూసి మరొకరు ముందుకు వస్తున్న ఫలితంగా ఈ క్రీడలో అనేకమంది చిన్నారులు పోటీల్లో పాల్గొనే స్థాయికి చేరుకుంటున్నారు. జిల్లా, రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొన్న కొందరు పతకాలు సైతం గెలుపొందారు. వీరిలో ఇద్దరు చెన్నైలోని జాతీయ స్థాయిలోనూ పతకాలతో మెరిశారు. ఇటీవల మరో ఇద్దరు సైతం గోవా పోటీల్లోనూ పాల్గొన్నారు. ఇప్పుడు మరి కొందరు జాతీయ పోటీలకు ప్రత్యేక సాధనలో నిమగ్నమయ్యారు. 

నర్సీపట్నంలో ఎప్పటి నుంచో 14 ఏళ్లలోపు వయసు బాలబాలికలు స్కేటింగ్‌లో శిక్షణ పొందుతున్నారు. వీరిలో బాగా రాణిస్తున్న పలువురు ప్రస్తుత వేసవి సెలవుల్లో రాష్ట్ర, జాతీయ పోటీలకు సిద్ధమవుతున్నారు. జూన్‌ 6న రాయ్‌పూర్‌లో ఏడో జాతీయ ర్యాంకింగ్‌ ఓపెన్‌ స్కేటింగ్‌ ఛాంపియన్‌ పోటీలు జరగనున్నాయి. వీటిలో పాల్గొనేందుకు ఇక్కడ ఏకంగా 20 మంది బాలలు ఎంపిక కావడం విశేషం. స్థానిక రింక్‌ బాగా చిన్నది కావడంతో ఊరికి దూరంగా రోడ్డుపైన సైతం వీరికి శిక్షణ కొనసాగుతోంది.

పసిడి పతకమే ధ్యేయం 

నేను నాలుగో తరగతి చదువుతున్నాను. రెండేళ్లుగా స్కేటింగ్‌లో శిక్షణ పొందుతున్నాను. గోవాలో ఈనెల 16న జరిగిన ఆరో జాతీయ ర్యాంకింగ్‌ స్కేటింగ్‌ ఓపెన్‌ ఛాంపియన్‌షిప్‌ పోటీల్లో పాల్గొన్నాను. పతకాలు రాకపోయినా జాతీయ పోటీల్లో పాల్గొన్న అనుభవం సాధించాను. ఎప్పటికైనా బంగారు పతకం సాధించాలని పట్టుదల పెరిగింది. ఇందులో ఛాంపియన్‌గా పేరు తెచ్చుకోవాలని ఉంది. కాళ్లకు ధరించే బూట్లకు మధ్యలో వరుసగా నాలుగు చక్రాలతో కూడిన ‘ఇన్‌లైన్‌’ స్కేటింగ్‌లో బాగా రాణించగలుగుతున్నాను.

- లక్ష్మి ఆద్య, నర్సీపట్నం


క్రీడా కోటాలో ఉద్యోగం లక్ష్యం

నర్సీపట్నంలోని ప్రగతి కళాశాలలో ఇంటర్‌ చదువుతున్నాను. అయిదేళ్లుగా ఈ క్రీడలో తర్ఫీదు పొందుతున్నాను. ఇప్పటికే రాష్ట్రస్థాయి పోటీల్లో ఒక స్వర్ణం. రెండు రజత పతకాలు గెలుపొందాను. గోవాలో జరిగిన పోటీల్లో పాల్గొన్నాను. పతకం దక్కకపోయినా ఈ పోటీలు నాలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించాయి. క్రీడా కోటాలో మెడిసిన్‌ సీట్‌ సాధించాలన్నది ధ్యేయం. దీనికోసం నిర్విరామంగా సాధన చేస్తున్నాను. జాతీయ పోటీల్లో స్వర్ణం దక్కించుకొని వైద్య వృత్తిలో స్థిరపడి ప్రజాసేవ చేయాలన్నది ఆశయం.

- పి.జాన్సన్, నర్సీపట్నం


సెలవులను సద్వినియోగం చేసుకుంటున్నారు

నర్సీపట్నలో స్కేటింగ్‌లో రాణిస్తున్న చిన్నారులు వేసవి సెలవులను చక్కగా సద్వినియోగం చేసుకుంటున్నారు. ఇప్పటికే ఇద్దరు గోవా పోటీల్లో పాల్గొన్నారు. ఇప్పుడు ఏకంగా 20 మంది రాయ్‌పూర్‌ పోటీలకు సన్నద్ధమవుతున్నారు. ఇక్కడ రింక్‌ తగినంతగా లేకపోవడంతో విద్యార్థులకు డౌనూరు రోడ్డుపైన, అలాగే స్థానిక ఆర్‌అండ్‌బీ అతిథి గృహంలో కొత్తగా నిర్మించిన రహదారి మీద శిక్షణ ఇస్తున్నాం. వీరిలో కొందరు తప్పక జాతీయ పోటీల్లో పతకాలు సాధించే అవకాశం ఉంది. నర్సీపట్నంలోని రింక్‌నే 200 మీటర్ల స్థాయికి అభివృద్ధి చేస్తే చిన్నారులు బయటకు వెళ్లాల్సిన పని లేదు.
- మణికంఠ, స్కేటింగ్‌ కోచ్, నర్సీపట్నం

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని