logo

నడి బజారులో పెద్దాస్పత్రి పరువు..!

ఉత్తరాంధ్రా జిల్లాల ఆరోగ్య ప్రదాయినిగా గుర్తింపు పొందిన కింగ్‌ జార్జి ఆసుపత్రి (కేజీహెచ్‌)లో పరిపాలన పూర్తిగా గాడి తప్పింది. ఎన్నడూ లేని విధంగా అధికారులు, సిబ్బందిలో విచ్చలవిడితనం పెరిగిందన్న ఆరోపణలు వస్తున్నాయి.

Updated : 26 May 2024 03:38 IST

ఆరోపణలపై ఇద్దరు అధికారుల సరెండర్‌ 
బాలికపై ఓ ఉద్యోగి వేధింపులు 
సిబ్బందిపై వెల్లువెత్తుతున్న ఆరోపణలు
కేజీహెచ్‌లో గాడితప్పిన పాలన

ఉత్తరాంధ్రా జిల్లాల ఆరోగ్య ప్రదాయినిగా గుర్తింపు పొందిన కింగ్‌ జార్జి ఆసుపత్రి (కేజీహెచ్‌)లో పరిపాలన పూర్తిగా గాడి తప్పింది. ఎన్నడూ లేని విధంగా అధికారులు, సిబ్బందిలో విచ్చలవిడితనం పెరిగిందన్న ఆరోపణలు వస్తున్నాయి.

గతంలో దిగువ స్థాయి సిబ్బంది, ఉద్యోగులపై ఆరోపణలు వస్తే ఇప్పుడు ఏకంగా కీలక పోస్టుల్లో పనిచేస్తున్న అధికారులపై కూడా ఆరోపణలు వెల్లువలా వస్తున్నాయి. 
స్థానికంగా అందుబాటులో ఉండే అధికారులకు ఫిర్యాదులు చేసినా అతీగతీ లేకపోవడంతో ఏకంగా సీఎంఓకు, ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి కార్యాలయాలకు బాధితులు ఫిర్యాదులు చేస్తున్నారు.

ఇటీవల జరిగిన కొన్ని ఘటనలు..

1. నెల రోజుల వ్యవధిలో నర్సింగ్‌ విభాగ గ్రేడ్‌-1 సూపరింటెండెంట్, డిప్యూటీ సివిల్‌ సర్జన్‌ ఆర్‌ఎంఓ స్థాయి అధికారులను ప్రభుత్వానికి సరెండర్‌ చేస్తూ డీఎంఈ నిర్ణయం తీసుకున్నారు. గతంలో ఎన్నడూ ఉన్నత స్థాయి అధికారులను సరెండర్‌ చేసిన సందర్భాలు లేవు.
2. చికిత్స కోసం వచ్చిన గిరిజన బాలికను వేధింపులకు గురి చేసిన ఆరోపణలపై ఓ ఉద్యోగిపై పోక్సో కేసు నమోదైంది. ఇప్పుడు ఆయనపై విచారణ జరుగుతోంది. ఆరు నెలల క్రితం జరిగిన బదిలీల్లో కేజీహెచ్‌ నుంచి మరో చోటుకు బదిలీ అయిన ఉద్యోగిని అనధికారికంగా కేజీహెచ్‌కు రప్పించారు. ఆ ఉద్యోగే ఇప్పుడు గిరిజన బాలికను వేధించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.

3. కేజీహెచ్‌ నుంచి బదిలీ అయిన మరో ముగ్గురు ఉద్యోగులను డిప్యుటేషన్‌పై మళ్లీ తీసుకొచ్చి కీలక బాధ్యతలు అప్పగించారు. ఆసుపత్రిలో బోలెడంత మంది ఉద్యోగులు ఉండగా వారిని డిప్యుటేషన్‌పై తీసుకు రావడం చర్చనీయాంశమవుతోంది. ఆ ఉద్యోగులపై తీవ్ర ఆరోపణలు వస్తున్నప్పటికీ వారిని కొంతమంది అధికారులు వెనకేసుకొస్తున్నారు.

విచారణతో వెలుగులోకి వాస్తవాలు..: ఆసుపత్రి ఆవరణలోని నర్సింగ్‌ కళాశాలపై కూడా ఇటీవల తీవ్ర ఆరోపణలు వచ్చాయి. ర్యాగింగ్‌ జరుగుతోందని వచ్చిన ఫిర్యాదుపై స్వయంగా డీఎంఈ విచారణ జరిపారు. అదే విధంగా నర్సింగ్‌ విభాగ గ్రేడ్‌-1 సూపరింటెండెంట్, డిప్యూటీ సవిల్‌ సర్జన్‌ ఆర్‌ఎంఓలపై వచ్చిన ఆరోపణలపై డీఎంఈ విచారణ జరిపి వేటు వేశారు. ఈనెల 11న ప్రసూతి విభాగానికి వచ్చిన బాలికను ఉద్యోగి వేధిస్తే కేజీహెచ్‌ అధికారుల దృష్టికి రాకపోవడం గమనార్హం. బాలల హక్కుల కమిషన్‌ సభ్యులు గొండు సీతారాం శనివారం కేజీహెచ్‌ను సందర్శించి ప్రసూతి విభాగంలో జరిగిన ఘటనపై ఆరా తీశారు.

ప్రధానంగా వస్తున్న ఆరోపణలు ఇవీ..

కేజీహెచ్‌లో ఓపీ చీటీలు, కేసు షీట్ల జారీకి రోగుల నుంచి ముడుపులు తీసుకోవడం. వార్డుల వద్ద భద్రతా సిబ్బంది, ఎంఆర్‌ఐ, సీటీస్కాన్, అల్ట్రాసౌండ్‌ స్కాన్, ఎక్స్‌రే విభాగాల వద్ద కొంత మంది ఉద్యోగులు చేతివాటం ప్రదర్శించడం. నర్సులకు సెలవులు ఇవ్వకపోవడం, ఈఎల్‌ మంజూరుకు లంచాలు తీసుకోవడం వంటి అంశాలపై ప్రధానంగా ఆరోపణలు వస్తున్నాయి. కొంతమంది వైద్యులు సమయపాలన పాటించకపోవడం, ఓపీలకు హాజరు కాకపోవడం, సేవల్లో నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారనే ఫిర్యాదులు వచ్చాయి. ఆయా అంశాలను ఎప్పటికప్పుడు చక్కదిద్దాల్సిన స్థానిక అధికారులు పట్టించుకోకపోవడం తీవ్ర విమర్శలకు తావిస్తోంది. కుర్చీని కాపాడుకోవడానికి ప్రాధాన్యమిచ్చి పెద్దాస్పత్రిని గాలికి వదిలేశారనే ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని