logo

ఆధునికీకరణకు..ఆదిలోనే అడ్డంకులు..

లిప్టులు 20... ఎస్కలేటర్లు 20.. రెండు వైపులా మల్టీలెవల్‌ కార్‌ పార్కింగ్‌లు.. రెండు ఆధునిక పాదచారుల వంతెనలు.., 9, 10 ప్లాట్‌ఫామ్‌లతో పాటు సరికొత్త హంగులతో జ్ఞానాపురం ద్వారం ఆధునికీకరణ.. ఇదీ విశాఖ రైల్వే స్టేషన్‌ ఉన్నతీకరణ జరగాల్సిన తీరు.

Updated : 26 May 2024 05:29 IST

పనుల్లో జాప్యంతో గుత్తేదారు తొలగింపు
అతీగతీ లేని రైల్వేస్టేషన్‌ ఉన్నతీకరణ

పనులు జరగాల్సిన ప్రాంతంలో నిలిచిన మురుగు 

విశాఖపట్నం, న్యూస్‌టుడే: లిప్టులు 20... ఎస్కలేటర్లు 20.. రెండు వైపులా మల్టీలెవల్‌ కార్‌ పార్కింగ్‌లు.. రెండు ఆధునిక పాదచారుల వంతెనలు.., 9, 10 ప్లాట్‌ఫామ్‌లతో పాటు సరికొత్త హంగులతో జ్ఞానాపురం ద్వారం ఆధునికీకరణ.. ఇదీ విశాఖ రైల్వే స్టేషన్‌ ఉన్నతీకరణ జరగాల్సిన తీరు.. అన్నీ అనుకున్నట్లు జరిగి ఉంటే 2025 చివరి నాటికి ఆయా సౌకర్యాలతో రైల్వేస్టేషన్‌ అందుబాటులోకి వచ్చేది.

ప్రస్తుత పరిస్థితి ఎలా ఉందంటే..

విశాఖ రైల్వేస్టేషన్‌ ఆధునికీకరణ పనులు ఆరంభ శూరత్వంలా మారాయి. పనులు ప్రారంభమైన నాటి నుంచి 36 నెలల్లో పూర్తి కావాల్సి ఉండగా ప్రారంభ దశలోనే నిలిచిపోయాయి. ఏడాదిన్నర గడిచిపోతున్నా ఒక్క అడుగు కూడా ముందుకు పడకపోవడం  గమనార్హం. టెండరులో పేర్కొన్న నిబంధనల ప్రకారం పనులు చేయడం లేదనే కారణంతో వాల్తేరు రైల్వే అధికారులు గుత్తేదారుని తొలగించారు. దాదాపు 5 నెలలుగా ఎవరూ పట్టించుకోకపోవడంతో పనులు చేపట్టిన ప్రాంతం మురుగు నీరు.. పిచ్చిమొక్కలతో దర్శనమిస్తోంది. ఇనుప చువ్వలు సైతం మురుగులోకి చేరి తుప్పు పడుతున్నాయి. ఆధునికీకరణ పనుల కోసం గతంలో పూర్తిగా మూసిన జ్ఞానాపురం వైపు గల గేట్‌-4 ప్రవేశ ద్వారాన్ని ఇటీవల తాత్కాలికంగా వినియోగంలోకి తీసుకొచ్చారు. దీంతో ఇప్పట్లో పనులు మొదలయ్యే అవకాశం లేదనే సంకేతాలు వస్తున్నాయి.

అధికారులు ఏమంటున్నారంటే..

ఆధునికీకరణ పనుల్లో తీవ్ర జాప్యం జరుగతుండటంతో గుత్తేదారుడ్ని తొలగించి తిరిగి టెండర్‌ ఆహ్వానించినట్లు వాల్తేర్‌ రైల్వే అధికారులు  చెబుతున్నారు. ఇంతలో ఎన్నికల నియమావళి రావడంతో ప్రక్రియ నిలిచిపోయినట్లు చెబుతున్నారు. 2025 చివరి నాటికి పూర్తి కావాల్సిన పనులు గుత్తేదారు అలసత్వం కారణంగా ఆలస్యమయ్యాయని, అయితే 2026 చివరి నాటికి పనులు పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటున్నట్లు చెబుతున్నారు. ఆయా పనులు పూర్తయితే విశాఖ రైల్వేస్టేషన్‌ రూపరేఖలు మారుతాయని పేర్కొంటున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు