logo

సింహాద్రినాథుడికి వైభవంగా సహస్రనామార్చన

సింహగిరిపై కొలువైన అప్పన్న స్వామి సన్నిధిలో శనివారం సహస్రనామార్చన ప్రత్యేక పూజా కార్యక్రమం వైభవోపేతంగా జరిగింది

Updated : 26 May 2024 05:26 IST

అలంకరణలో స్వామి, అమ్మవార్లు 

సింహాచలం, న్యూస్‌టుడే: సింహగిరిపై కొలువైన అప్పన్న స్వామి సన్నిధిలో శనివారం సహస్రనామార్చన ప్రత్యేక పూజా కార్యక్రమం వైభవోపేతంగా జరిగింది. అర్చకులు వేకువజామున స్వామిని సుప్రభాత సేవతో మేల్కొలిపి ఆరాధన, బాలభోగం సేవలు జరిపారు. శ్రీదేవి, భూదేవి సమేత గోవిందరాజ స్వామిని పట్టు పీతాంబరాలు, ఆభరణాలతో అలంకరించి ఆలయ కల్యాణ మండపంలోని ఉత్సవ వేదికపై ఆశీనులను చేశారు. తులసీదళాలతో స్వామిని సహస్రనామాలతో అర్చించారు. అనంతరం అదే వేదికపై దేవతామూర్తుల నిత్య కల్యాణోత్సవాన్ని కనులపండువగా జరిపించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామిని సేవించారు. అర్చకులు వేదమంత్రాలతో భక్తులను ఆశీర్వదించి కల్యాణ తలంబ్రాలు, శేషవస్త్రాలు అందజేశారు.

భక్తజన సందోహంగా సింహగిరి

సింహాచలం అప్పన్న స్వామి క్షేత్రం శనివారం భక్తజన సందోహంగా మారింది. వారాంతం, వేసవి సెలవుల నేపథ్యంలో ఉత్తరాంధ్ర, ఒడిశా ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వచ్చారు. భక్తుల రాకతో సింహగిరి బస్టాండు, ప్రసాదాల విక్రయశాలలు, కేశఖండనశాల, గంగధార ప్రాంతాలు రద్దీగా మారాయి. దర్శనం కోసం భక్తులు గంటల తరబడి క్యూలైన్లలో బారులుతీరారు.

అంతరాలయ దర్శనం కల్పించలేదని వాగ్వాదం

భక్తుల రద్దీ నేపథ్యంలో నీలాద్రి ద్వారం నుంచే భక్తులకు దర్శనం కల్పించారు. రూ.300 టిక్కెట్‌ కొనుగోలు చేసిన ఓ భక్తుడు అంతరాయం దర్శనం కల్పించలేదని పీఆర్‌వో కార్యాలయంలో వాగ్వాదానికి దిగారు. అంతరాలయం దర్శనం కల్పించలేనప్పుడు తనకు టిక్కెట్‌ ఎందుకు ఇచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. టిక్కెట్‌ సొమ్ము తిరిగి ఇవ్వాలని డిమాండ్‌ చేయడంతో ఈవో ఆదేశాల మేరకు వాపసు చేయడంతో వివాదం సద్దుమణిగింది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని