logo

1200వ రోజుకు చేరిన ఉక్కు రిలే దీక్షలు

ఉక్కు ప్రైవేటీకరణను ఉపసంహరించుకునేంత వరకు పోరాటం కొనసాగుతుందని పోరాట కమిటీ ఛైర్మన్‌ సీహెచ్‌ నర్సింగరావు అన్నారు. కూర్మన్నపాలెం కూడలిలో కొనసాగుతున్న రిలే దీక్షలు 1200వ రోజుకు చేరుకున్న సందర్భంగా ఆయన కార్మికులను ఉద్దేశించి ఆదివారం మాట్లాడారు.

Updated : 27 May 2024 04:18 IST

మాట్లాడుతున్న పోరాట కమిటీ ఛైర్మన్‌ నర్సింగరావు, హాజరైన నాయకులు, కార్మికులు

విశాఖపట్నం, న్యూస్‌టుడే: ఉక్కు ప్రైవేటీకరణను ఉపసంహరించుకునేంత వరకు పోరాటం కొనసాగుతుందని పోరాట కమిటీ ఛైర్మన్‌ సీహెచ్‌ నర్సింగరావు అన్నారు. కూర్మన్నపాలెం కూడలిలో కొనసాగుతున్న రిలే దీక్షలు 1200వ రోజుకు చేరుకున్న సందర్భంగా ఆయన కార్మికులను ఉద్దేశించి ఆదివారం మాట్లాడారు. కేంద్ర, రాష్ట్రాల్లో ఏ సర్కారు వచ్చినా ప్రభుత్వ రంగంలో కొనసాగిస్తామని స్పష్టమైన నిర్ణయం ప్రకటించాలని డిమాండ్‌ చేశారు. కేంద్రం, ఉక్కు యాజమాన్యం కుమ్మక్కై పరిశ్రమను నిర్వీర్యం చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. గత మూడేళ్లుగా రాష్ట్ర ప్రభుత్వం ఉక్కు పరిరక్షణపై మొసలి కన్నీరు కార్చిందని తూర్పారబట్టారు. 

కమిటీ మరో ఛైర్మన్‌ డి.ఆదినారాయణ మాట్లాడుతూ ఉక్కు పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలకు కేంద్రం, స్థానిక యాజమాన్యం అనాలోచిత నిర్ణయాలే ప్రధాన కారణమన్నారు. ఉక్కు యాజమాన్యం తీసుకున్న నిర్ణయాలపై కాగ్‌ నివేదికలు తప్పుబట్టినా పట్టించుకోవడం లేదన్నారు. ఉత్పత్తికి అవసరమైన ముడి సరకు సరఫరా ఒప్పందాలను తుంగలో తొక్కి ఒంటెత్తు పోకడలతో పరిశ్రమను నష్టాల్లోకి నెట్టేశారని ఆరోపించారు. ఉక్కు అమ్మకానికి వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటాల్లో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పోరాట కమిటీ నాయకులు ఎం.రాజశేఖర్, ఎన్‌.రామారావు, ఎన్‌.రామచంద్రరావు, కేఎస్‌ఎన్‌రావు, యు.రామస్వామి, వైటీ దాస్, వి.రామ్మోహన్‌కుమార్, బొడ్డు పైడిరాజు, శ్రీనివాసులు నాయుడు, నమ్మి సింహాద్రి, రమణ తదితరులు పాల్గొన్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని