logo

యువతకు ఉపాధి.. ఉద్యోగాలేవీ?

ఉన్నత చదువులు చదివి ఉద్యోగాలు, ఉపాధి అవకాశాల్లేక యువత ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొత్త పరిశ్రమలు రాకపోగా, విశాఖ సాగరతీరంలో ఉన్న ఐటీ చతికిలపడింది. సాఫ్ట్‌వేర్‌ కొలువులు పోయి చాలా మంది యువత స్విగ్గీ, జొమోటాలో డెలివరీ బాయ్స్‌గా, క్యాబ్‌ డ్రైవర్లుగా మారారు.

Updated : 27 May 2024 04:19 IST

గత ఐదేళ్లుగా విశాఖలో చతికిలపడిన ఐటీ
కొత్త పరిశ్రమల ఊసే లేదు
ఏజెంట్ల మోసాల బారిన నిరుద్యోగులు

ఉన్నత చదువులు చదివి ఉద్యోగాలు, ఉపాధి అవకాశాల్లేక యువత ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొత్త పరిశ్రమలు రాకపోగా, విశాఖ సాగరతీరంలో ఉన్న ఐటీ చతికిలపడింది. సాఫ్ట్‌వేర్‌ కొలువులు పోయి చాలా మంది యువత స్విగ్గీ, జొమోటాలో డెలివరీ బాయ్స్‌గా, క్యాబ్‌ డ్రైవర్లుగా మారారు. మరికొందరు ఉద్యోగ వేటలో ఏజెంట్ల మాయమాటలు నమ్మి మోసపోతున్నారు.

ఈనాడు - విశాఖపట్నం: నిరుద్యోగులను ఆసరాగా చేసుకొని పలువురు విదేశాల్లో ఉపాధి కల్పిస్తామంటూ ఏకంగా మానవ అక్రమ రవాణాకు తెగబడుతున్నారు. డేటా ఎంట్రీ, ఆన్‌లైన్‌ తదితర ఉద్యోగాలంటూ ఆశ చూపుతూ.. డబ్బులు వసూళ్లు చేస్తున్నారు. తీరా అక్కడికి తీసుకెళ్లి చిత్రహింసల పాల్జేస్తున్నారు. ఇటీవల విశాఖ ఏజెంట్ల ద్వారా కాంబోడియా, మయన్మార్, బ్యాంకాక్‌లో ఉద్యోగాల కోసమని వెళ్లి సైబర్‌ నేరగాళ్ల వలలో నిరుద్యోగులు చిక్కుకున్నదే ఇందుకు తార్కాణం.

ఊదరగొట్టి వదిలేశారు....

వైకాపా అధికారంలోకి రాకముందు ఏటా జ్యాబ్‌ క్యాలెండర్‌ విడుదల చేస్తామంటూ ఊదరగొట్టింది. అధికారంలోకి వచ్చాక నిరుద్యోగమే మిగిల్చింది. గడిచిన ఐదేళ్లలో రాష్ట్రంలో యువతకు ఉపాధి కల్పించే ముఖ్యమైన పరిశ్రమలు రాలేదు. విశాఖకు వచ్చిన ‘లులు’ మాల్‌ వంటి వాటిని తరిమేశారు. ప్రధానంగా ఐటీ వెలుగులు ఆర్పేశారు. వైకాపా అధికారంలోకి రాగానే హెచ్‌ఎస్‌బీసీ, ఐబీఎం వంటి కంపెనీలు వెళ్లిపోయాయి. వందకు పైగా స్టార్టప్‌లు మూతపడ్డాయి. కొత్త ఐటీ కంపెనీలు రాలేదు. పెట్టుబడుల సదస్సులో రూ.13లక్షల కోట్లతో ఒప్పందాలు జరిగినట్లు జగన్‌ సర్కార్‌ గొప్పలు చెప్పినా, క్షేత్రస్థాయిలో రూ.లక్ష కోట్ల పెట్టుబడులు గగనంగానే వచ్చాయి. పర్యాటక రంగం పూర్తిగా పడకేసింది. యువతకు ఉద్యోగాలు, ఉపాధి కల్పనలో రాష్ట్ర ప్రభుత్వం ఒక్కమాటలో చెప్పాలంటే విఫలమైంది. ఉన్న ఊరిలో ఉపాధి దొరక్క చాలా మంది ఇతర రాష్ట్రాలకు వలసలు వెళుతున్నారు. ఉన్నత చదువులు చదివిన యువత ఉద్యోగాల్లేక ఉపాధి హామీ పనులకు వెళుతున్నారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.

ఉపాధి ఆశల్లో చిక్కుకుని..

‘తక్కువ చదివినా పర్వాలేదు.. విదేశాల్లో పెద్ద ఉద్యోగం, రూ.లక్షల్లో సంపాదన, ఏసీ రూంలలో కూర్చొని పనిచేయొచ్చు’ అంటూ నిరుద్యోగులకు కొందరు ఉపాధి వల వేస్తున్నారు. ఇటీవల విశాఖ పోలీసులు ‘ఆపరేషన్‌ కాంబోడియా’ పేరుతో డేటా ఎంట్రీ ఉద్యోగాల పేరిట సైబర్‌ నేరగాళ్ల ఉచ్చులో చిక్కుకున్న 25 మంది యువకులను రక్షించారు. తాజాగా మరో ఇద్దరు ఏజెంట్లను పోలీసులు అరెస్టు చేశారు. గాజువాక ప్రాంతానికి చెందిన కన్సల్టెన్సీ ఏజెంటు నిరుద్యోగ యువతకు కాంబోడియాలో డేటాఎంట్రీ ఆపరేటర్‌ అవకాశాలు అంటూ రూ.1.20లక్షలు కమీషనుగా తీసుకుని మానవ అక్రమ రవాణాకు పాల్పడ్డాడు. కాంబోడియాలో ‘ఫేక్‌ లోన్‌ యాప్‌లు, టాస్‌ గేమ్, క్రిప్టో కరెన్సీ ఇన్వెస్ట్‌మెంట్, ట్రేడింగ్‌ ఇన్వెస్ట్‌మెంట్, ఫెడెక్స్‌ స్కాం, ఫేక్‌ ఫేస్‌బుక్, హనీ ట్రాప్‌’ వంటి మోసాలు ఎలా చేయాలో నేర్పించి యువతను చిత్రహింసలకు గురిచేసినట్లు వెలుగులోకి వచ్చింది. చైనా ఏజెంట్ల వలలో వేలాది మంది నిరుద్యోగులు చిక్కుకున్నట్లు అంచనా. యువతకు ఉపాధి, ఉద్యోగావకాశాలు లేవకపోవడమే ఇలాంటి ఘటనలకు ప్రధాన కారణం. ప్రతి ఐదు మంది యువకుల్లో ఒకరు నిరుద్యోగిగా ఉన్నారని కేంద్ర మంత్రిత్వ శాఖ ఇటీవల వెల్లడించింది. ఏపీలో యువత పరిస్థితి మరింత దారుణంగా ఉంది.

అటకెక్కిన నైపుణ్య శిక్షణ, జాబ్‌మేళాలు

మ్మడి విశాఖ జిల్లాలో 5లక్షల మంది నిరుద్యోగులుంటారని అంచనా. స్థానికంగా పరిశ్రమల్లో ఉపాధి కల్పించేందుకు నైపుణ్య శిక్షణలు పూర్తిగా ఐదేళ్లలో అటకెక్కించారు. జాబ్‌ మేళాల ఊసేలేదు. కొన్ని కంపెనీలు డేటా ఎంట్రీలు, మార్కెటింగ్, కంప్యూటర్‌ ఆపరేటింగ్‌ అంటూ దూరప్రాంతాలకు తీసుకువెళుతున్నాయి. తీరా అక్కడికి వెళ్లాక చేయిస్తున్న పని మరొకటి. పెరుగుతున్న ఖర్చులకు కంపెనీలిచ్చే జీతాలు సరిపోక, చాలా మంది యువత అక్కడి నుంచి ఉసూరుమంటూ వెనుతిరుగుతున్నారు. గాజువాక ఆటోనగర్‌లో నైపుణ్య శిక్షణ ఇచ్చేందుకు ప్రత్యేకంగా స్థలం తెదేపా హయాంలో కేటాయించినప్పటికీ, వైకాపా ప్రభుత్వం దాన్ని పట్టించుకోలేదు. గతంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో గ్రామీణ, పట్టణ ప్రాంత యువత, మహిళలకు ప్రత్యేక నైపుణ్య శిక్షణ ఇచ్చేవారు. ప్రస్తుతం నైపుణ్య శిక్షణలు అందక, మారుతున్న సాంకేతికతను అందిపుచ్చుకోవడంలో యువత ఇబ్బందులు పడుతున్నారు. దీని కారణంగా ఉపాధి పొందలేక పోతున్నారు. యువత స్వయం ఉపాధికి సైతం రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీ రుణాలు అందించడంలోనూ విఫలమైంది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని