logo

‘నైరుతి’ వచ్చే వరకు భగభగలే..

వాతావరణ మార్పుల కారణంగా ఈ ఏడాది ఫిబ్రవరి నుంచే భానుడి భగభగలు మొదలయ్యాయి. ఏప్రిల్‌ నెలలో తీవ్ర వడగాలులకు తోడు గరిష్ఠ ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకు పైగా నమోదు కావడంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరయ్యారు. 

Updated : 27 May 2024 06:46 IST

ఉమ్మడి జిల్లాలో పెరగనున్న వడగాలులు
గరిష్ఠ ఉష్ణోగ్రతలు 47 డిగ్రీలు దాటే అవకాశం

వాతావరణ మార్పుల కారణంగా ఈ ఏడాది ఫిబ్రవరి నుంచే భానుడి భగభగలు మొదలయ్యాయి. ఏప్రిల్‌ నెలలో తీవ్ర వడగాలులకు తోడు గరిష్ఠ ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకు పైగా నమోదు కావడంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరయ్యారు. 

బంగాళాఖాతంలో ఏర్పడిన రెమాల్‌ తుపాను ప్రభావంతో విశాఖపట్నం తీరాన్ని దట్టంగా తేమ అలముకుంది. ఆదివారం ఆర్కేబీచ్‌ రోడ్డులో తేమ పొగమంచులా అలుముకున్న దృశ్యమిది.   

ఈనాడు డిజిటల్, విశాఖపట్నం: ద్రోణి, ఉపరితల ఆవర్తనాల ప్రభావంతో కొద్దిరోజులుగా వాతావరణం చల్లబడింది. దీంతో జిల్లా వాసులకు ఉక్కపోత నుంచి కొంత వరకు ఉపశమనం లభించింది. బంగాళాఖాతంలో తుపాను ఏర్పడితే వర్షాలు కురుస్తాయని అందరూ భావించారు. కానీ ‘రెమాల్‌’ తుపాను ఉత్తర దిశగా బంగ్లాదేశ్‌ వైపు వెళ్లిపోవడంతో ఆశలు అడియాశలయ్యాయి. కాకినాడ, విజయవాడ నగరాల్లో వర్షాలు కురుస్తున్నా విశాఖలో చినుకు జాడ లేకపోవడం గమనార్హం.

వేడి, ఉక్కపోతతో అవస్థలు 

తుపాను ప్రభావంతో పొడి వాతావరణం నెలకొని.. ఉమ్మడి జిల్లాలో వేడి, ఉక్కపోత పెరిగాయి. నైరుతి రుతుపవనాలు వచ్చేవరకు ఇదే పరిస్థితి కొనసాగుతుందని, వడగాలులు తీవ్రరూపం దాల్చుతాయని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. సోమవారం నుంచి జూన్‌ 3 వరకు గరిష్ఠ ఉష్ణోగ్రతలు మరింత పెరుగుతాయని అంచనా వేస్తున్నారు. జిల్లావ్యాప్తంగా శని, ఆదివారాల్లో ఎండ కనిపించలేదు. కానీ తీవ్ర వేడి, ఉక్కపోత వల్ల చిన్నారులు, వృద్ధులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు అధికంగా ఉండటంతో వేడి వాతావరణం నెలకొంటుంది. నగరంలో ఎండ, వేడికి తేమ తోడు కావడంతో చర్మం జిడ్డుగా మారుతోంది. జిల్లాలో తేమ శాతం ప్రస్తుతం 65 నుంచి 70 శాతం ఉండగా రాబోయే రోజుల్లో మరింత పెరిగే అవకాశముంది.

2 నుంచి 4 డిగ్రీలు పెరిగే అవకాశం

సముద్ర తీరానికి సమీపంలో ఉన్నా జిల్లాలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు భారీగా పెరుగుతున్నాయి. పద్మనాభం పరిసర ప్రాంతాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలు దాటుతున్నాయి. మంగళవారం నుంచి గరిష్ఠ ఉష్ణోగ్రతలు 2 నుంచి 4 డిగ్రీలు పెరిగే అవకాశముందని అమరావతి వాతావరణ కేంద్రం పేర్కొంది. ‘సోమవారం అనకాపల్లి జిల్లాలో 14, అల్లూరి సీతారామరాజు జిల్లాలో 10 వడగాలులు వీచే అవకాశముంది. మంగళవారం ఉమ్మడి జిల్లాలోని 43 మండలాల్లో వడగాలులు వీయొచ్చు’ అని విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని