logo

ఈసారీ పుస్తకాల్లేని చదువులేనా?

జిల్లాలో ఇంటర్మీడియట్‌ విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు అందడం కలగానే మిగిలింది. గత విద్యా సంవత్సరంలో పాఠ్యపుస్తకాలు అసలు రాకపోగా.. ఈ విద్యా సంవత్సరానికి పుస్తకాలు వస్తాయనే నమ్మకం కొరవడింది.

Updated : 27 May 2024 04:21 IST

జిల్లాలో ఇంటర్‌ విద్యార్థుల అగచాట్లు
1 నుంచి జూనియర్‌ కళాశాలల పునఃప్రారంభం 

పాడేరు పట్టణం, న్యూస్‌టుడేే: జిల్లాలో ఇంటర్మీడియట్‌ విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు అందడం కలగానే మిగిలింది. గత విద్యా సంవత్సరంలో పాఠ్యపుస్తకాలు అసలు రాకపోగా.. ఈ విద్యా సంవత్సరానికి పుస్తకాలు వస్తాయనే నమ్మకం కొరవడింది. జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేటు, గురుకుల జూనియర్‌ కళాశాలలు, కేజీబీవీ విద్యాలయాలు 40 వరకు ఉన్నాయి. ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల విద్యార్థులకు ఇంటర్మీడియట్‌ బోర్డు పాఠ్యపుస్తకాలు అందించాల్సి ఉంది. ఇప్పటికే పుస్తక ముద్రణ, పంపిణీ జరగాల్సి ఉంది. మరి కొద్దిరోజుల్లో కళాశాలలు తెరుచుకోనున్నా పుస్తకాలు అందే పరిస్థితి కనిపించడం లేదు. 

జిల్లాలోని 22 మండలాల్లో మండలానికి ఒకటి చొప్పున 22 ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలు ఉన్నాయి. ఆయా కళాశాలల్లో సుమారు 11 వేల మంది విద్యార్థులు చదువుతున్నారు. వీరికి పాఠ్యపుస్తకాల సరఫరా కాకపోవడంతో బయట మార్కెట్‌లో గైడ్‌లు, ఇతర పుస్తకాలు కొనుగోలు చేసుకుని పరీక్షలకు సన్నద్ధం కావాల్సి వస్తోంది. పాఠ్యపుస్తకాలు లేక ఆయా సబ్జెక్టులపై విద్యార్థులు పట్టు సాధించలేకపోతున్నారు. ఫలితంగా ప్రతి విద్యా సంవత్సరంలో ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులు ఉత్తీర్ణతశాతంలో వెనుకంజలో నిలుస్తున్నారు. ప్రతి ఏడాది విద్యార్థుల సంఖ్య ఆధారంగా పాఠ్య పుస్తకాలు కావాలని అధికారులు ప్రతిపాదనలు పంపుతున్నా ప్రభుత్వం రెండేళ్లుగా ఒక్క పుస్తకం కూడా ఇవ్వలేదు. వేల రూపాయలు ఖర్చు చేసి చదువుకోగలిగే స్థోమత ప్రభుత్వ కళాశాలల్లో చదివే విద్యార్థులకు ఉండదు. దీంతో వీరంతా అరకొర చదువులతోనే పరీక్షలకు వెళ్లాల్సి వస్తోంది.

రెండేళ్లుగా సరఫరా లేదు 

ఇంటర్‌ పాఠ్య పుస్తకాలు రెండేళ్లుగా సరఫరా కావడంలేదు. గతంలో టీటీడీ నుంచి ముద్రించి ఇచ్చేది. విద్యార్థుల సంఖ్యను బట్టి పుస్తకాలు కావాలని ఇండెంట్ పెడతాం. పుస్తకాలు రాగానే విద్యార్థులకు అందిస్తాం. 

- బి.సుజాత, అనకాపల్లి జిల్లా వృత్తివిద్యా శాఖాధికారి 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని