logo

కన్నతల్లులకు కడుపు కోతలు!

ఎస్‌.రాయవరానికి చెందిన వివాహిత గర్భం దాల్చడంతో నక్కపల్లిలోని ప్రభుత్వ ఆసుపత్రిలో నెలవారీ తనిఖీలు చేయించుకుంది. నెలలు నిండటంతో ప్రసవానికి వస్తే బీపీ పెరిగిందని చెప్పి అనకాపల్లి ఆసుపత్రికి పంపించారు.

Published : 27 May 2024 04:45 IST

జిల్లాలో పెరుగుతున్న ప్రసూతి శస్త్రచికిత్సలు
ప్రైవేటు ఆసుపత్రుల్లో దందా
కొరవడుతున్న పర్యవేక్షణ 

చికిత్స కోసం వచ్చిన గర్భిణులు 

ఎస్‌.రాయవరానికి చెందిన వివాహిత గర్భం దాల్చడంతో నక్కపల్లిలోని ప్రభుత్వ ఆసుపత్రిలో నెలవారీ తనిఖీలు చేయించుకుంది. నెలలు నిండటంతో ప్రసవానికి వస్తే బీపీ పెరిగిందని చెప్పి అనకాపల్లి ఆసుపత్రికి పంపించారు. ఇక్కడికి ఇలా వచ్చీరాగానే పరీక్ష చేసిన వైద్యులు విశాఖపట్నం కేజీహెచ్‌కు వెళ్లాలని చెప్పారు. దీంతో వీరు ఆందోళన చెంది అనకాపల్లిలోని ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లగా పావుగంటలో సిజేరియన్‌ చేశారు. చాలామంది రికమండేషన్‌ చేయడంతో అన్ని ఖర్చులు కలుపుకొని రూ. 55 వేలు బిల్లు వేశారు. 

అనకాపల్లికి చెందిన గర్భిణి ప్రైవేటు ఆసుపత్రిలో నెలవారీగా తనిఖీ చేయించుకుంది. రిపోర్టులు అన్నీ బాగానే ఉన్నాయని వైద్యులు చెబుతూ వచ్చారు. సాధారణ ప్రసవం అవుతుందని చెప్పారు. తీరా నెలలు నిండాక ఉమ్మనీరు సమస్య ఉందని, శస్త్రచికిత్స చేయాలని చెప్పడంతో చేసేది లేక కుటుంబ సభ్యులు ఆపరేషన్‌ చేయించారు. రూ. 80 వేల వరకు ఖర్చయ్యింది. 

అనకాపల్లి పట్టణం, న్యూస్‌టుడే: ఇలా ఎంతో మంది గర్భిణులకు అవసరం ఉన్నా.. లేకున్నా  శస్త్రచికిత్సలు చేసేస్తున్నారన్న విమర్శలు ఎక్కువవుతున్నాయి. ప్రైవేటు ఆసుపత్రుల్లో జరిగే ప్రసవాల్లో అధికంగా శస్త్రచికిత్సలు చేస్తుండడం అందరిలో ఆందోళన కలిగిస్తోంది. గర్భిణులకు నెల వారీగా చేసే తనిఖీ నివేదికల ఆధారంగా సాధారణ ప్రసవానికి వేచిచూసి, అత్యవసరమైతేనే శస్త్రచికిత్సలు చేయాలి. దీనికి భిన్నంగా ఆపరేషన్‌ చేస్తూ కొంతమంది సొమ్ము చేసుకుంటున్నారు. ఆపరేషన్‌ చేయడానికి ఫీజుతోపాటు మందులు, వార్డులో ఉండటానికి ఇలా అన్ని ఖర్చులు కలిపి ప్యాకేజీ రూపంలో రూ. 60 వేల నుంచి రూ. 80 వేల వరకు మాట్లాడుకుంటున్నట్లు సమాచారం. రోజుకు ఒకటి, రెండు ఆపరేషన్‌లు చేసినా చాలు అన్నట్లు కొంతమంది వైద్యులు వ్యవహరిస్తుండటంతో కన్నతల్లులకు కడుపుకోతలు అధికమవుతున్నాయి. 

జిల్లాలోని నర్సీపట్నంలోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో గర్భిణులకు శస్త్రచికిత్సలు ఎక్కువగా చేస్తున్నారంటూ జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ కార్యాలయం నుంచి నోటీసులు ఇచ్చారు. చాలావరకు ఆసుపత్రుల్లో అవసరం లేకున్నా ఇలా శస్త్రచికిత్సలు చేస్తున్నారు. వీరిపై సరైన పర్యవేక్షణ లేదు.

ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఒకలా.. ప్రైవేటులో మరోలా ... జిల్లాలోని 45 పీహెచ్‌సీలు, 6 సీహెచ్‌సీలు, ఒక ఏరియా ఆసుపత్రి, మరొకటి జిల్లా ఆసుపత్రి ఉన్నాయి. ఇక్కడికి గర్భిణులకు ప్రతి నెల తనిఖీలతోపాటు అన్ని రకాల పరీక్షలు చేసి నివేదిక తయారుచేస్తారు. గర్భం దాల్చినప్పటి నుంచి ప్రసవ తేదీ ఇచ్చి, ప్రసవం అనంతరం చికిత్సను ఒక పుస్తకంలో సమగ్రంగా రాస్తారు. సాధారణ ప్రసవానికి చాలా సమయం వేచి చూశాక అత్యవసరం అయితేనే శస్త్రచికిత్స చేస్తారు. ఆపరేషన్‌ ఎందుకు చేయాల్సి వచ్చిందో ఉన్నతాధికారులకు నివేదికను పంపాల్సి ఉంటుంది. దీనిపై నిరంతర పర్యవేక్షణ ఉంటుంది. ప్రైవేటు ఆసుపత్రుల్లో ఈ తరహా పర్యవేక్షణ లేకపోవడంతో శస్త్రచికిత్సలు పెరుగుతున్నాయని పలువురు విమర్శిస్తున్నారు. జిల్లాలో 214 ప్రైవేటు ఆసుపత్రులు, క్లినిక్‌లు ఉండగా వీటిలో 53 ఆసుపత్రుల్లో ప్రసూతి సేవలు అందిస్తున్నారు. నిజంగా అవసరమైతే ఆపరేషన్‌ చేసినా ఫర్వాలేదు. కాసుల కోసం కక్కుర్తిపడి కడుపుకోత పెట్టడం తగదని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గర్భిణులకు చేసే శస్త్రచికిత్సలపై ఉన్నతాధికారులు నిరంతర పర్యవేక్షణ జరపాలని కోరుతున్నారు.

అవసరం లేకుండా ఆపరేషన్‌ చేస్తే చర్యలు.. గర్భిణులకు అత్యవసరం లేకుండా శస్త్రచికిత్సలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. దీనిపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సీరియస్‌గా ఉన్నాయి. నర్సీపట్నంలోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో శస్త్రచికిత్సలు ఎక్కువగా చేస్తున్నారని నోటీసులు ఇచ్చాం. వారి వద్దకు వచ్చేవి అత్యవసర కేసులు వస్తున్నాయని, ఆపరేషన్‌ చేయక తప్పడం లేదని వారు సమాధానం ఇచ్చారు. ఇది నిజమా, కాదా అన్నది సమగ్ర పరిశీలన చేస్తున్నాం. సాధారణంగా ప్రైవేటు ఆసుపత్రులకు అత్యవసర కేసులు రిఫరల్‌గా వస్తుంటాయి. వారు శస్త్రచికిత్సలు చేయాల్సి ఉంటుంది. ఇందులో నిజానిజాలు గర్భిణుల రిపోర్టులకు పరిశీలించి నిరంతర పర్యవేక్షణ జరిపేలా చూస్తాం.  

- డాక్టర్‌ హేమంత్, జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని