logo

Suicide: ప్రియురాలి తీరుతో మనస్తాపం.. యువకుడి ఆత్మహత్య

ఎన్ని సార్లు ఫోన్‌ చేసినా ప్రియురాలు తీయడంలేదని మనస్తాపం చెందిన రోమాల గంగాధర్‌ (24) ఆమె పుట్టిన రోజు నాడు ఆత్మహత్య చేసుకున్నారు.

Updated : 29 May 2024 07:37 IST

గంగాధర్‌ (పాత చిత్రం)

ఎలమంచిలి, న్యూస్‌టుడే: ఎన్ని సార్లు ఫోన్‌ చేసినా ప్రియురాలు తీయడంలేదని మనస్తాపం చెందిన రోమాల గంగాధర్‌ (24) ఆమె పుట్టిన రోజు నాడు ఆత్మహత్య చేసుకున్నారు. అనకాపల్లి జిల్లా ఎలమంచిలి పట్టణ ఎస్సై పాపినాయుడు కథనం ప్రకారం.. పట్టణంలోని ద్వారకానగర్‌కు చెందిన గంగాధర్‌ చాలా కాలంగా ఓ యువతిని ప్రేమిస్తున్నాడు. ఏడాదిగా ఆమె ఇతనితో మాట్లాడటం మానేసింది. సోమవారం ఆమె పుట్టిన రోజు కావడంతో ఆ అమ్మాయికి ఫోన్‌ చేశాడు. ఆమె తీయకపోవడంతో మనస్తాపంతో అదే రోజు రాత్రి ఇంటిలోని వంటగదిలో ఫ్యాన్‌ హుక్కుకు చీరతో ఉరివేసుకున్నాడు. మంగళవారం ఈవిషయం వెలుగులోకి వచ్చింది.


బాలికపై అత్యాచారం కేసులో ఆటోడ్రైవర్‌కు 20 ఏళ్ల జైలు

విశాఖ లీగల్, న్యూస్‌టుడే: బాలికపై అత్యాచారం చేసిన నేరం రుజువు కావడంతో నిందితుడికి 20ఏళ్ల జైలుశిక్షతోపాటు రూ.10వేల జరిమానా విధిస్తూ పోక్సో న్యాయస్థానం ప్రత్యేక న్యాయమూర్తి జి.ఆనందిని తీర్పునిచ్చారు. బాధితురాలికి రూ.4లక్షల నష్టపరిహారం చెల్లించాలని ప్రభుత్వాన్ని ఆదేశించారు. పోక్సో న్యాయస్థానం ప్రత్యేక పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ కరణం కృష్ణ తెలిపిన వివరాలిలా ఉన్నాయి.. గాజువాక డ్రైవర్స్‌కాలనీకి చెందిన మైచర్ల గణేష్‌ అలియాస్‌ ద్రాక్ష ఆటోడ్రైవర్‌గా పనిచేసేవాడు. అతనిపై పలు క్రిమినల్‌ కేసులు కూడా వున్నాయి. నడుపూరు ప్రాంతానికి చెందిన బాలిక (11) ఐదో తరగతి చదివేది. ఆమె కుటుంబంతో గణేష్‌కు కొద్దిపాటి పరిచయం ఉండేది. ఈ నేపథ్యంలో 2017 జూన్‌ 14న సాయంత్రం ఆడుకుంటున్న బాలికను బలవంతంగా ఆటో ఎక్కించుకుని గాజువాక సమీపంలోని కొంగపాలెం రహదారి చివరన నిర్మాణుష్యంగా ఉన్న ప్రదేశానికి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. అనంతరం బాలికను ఆమె ఇంటి దగ్గరలో విడిచిపెట్టి పారిపోయాడు. బాధితురాలు ఏడుస్తూ ఇంటికొచ్చి జరిగిన విషయాన్ని కుటుంబసభ్యులకు తెలియజేసింది. ఈ మేరకు బాధితులు న్యూపోర్టు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు నిందితుడిని పట్టుకుని న్యాయస్థానంలో హాజరు పరిచారు. సాక్ష్యాధారాలను పరిశీలించిన న్యాయమూర్తి పైవిధంగా శిక్ష విధించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు