logo

నేరేడుబంద.. సమస్యలే నిండా

అది మండలానికి శివారు ఆదివాసీ గ్రామం. దట్టమైన అటవీ ప్రాంతం. అక్కడ వన్యప్రాణులు సంచరిస్తుంటాయి.

Published : 28 Jan 2023 03:23 IST

జి.మాడుగుల, న్యూస్‌టుడే

బడి ఏర్పాటు చేయాలని నినదిస్తున్న గ్రామస్థులు

అది మండలానికి శివారు ఆదివాసీ గ్రామం. దట్టమైన అటవీ ప్రాంతం. అక్కడ వన్యప్రాణులు సంచరిస్తుంటాయి. విద్యార్థులు ఉన్నా.. పాఠశాల లేదు. చిన్నారులు, గర్భిణులు, బాలింతలు ఉన్నా చెంతనే అంగన్‌వాడీ కేంద్రం లేదు. సుమారు నాలుగు కిలోమీటర్ల దూరం బాలలు సాహసోపేత ప్రయాణం చేసి చదువుకోవాల్సిందే. దట్టమైన అటవీ ప్రాంతం గుండా విద్యార్థులు పాఠశాలకు ప్రాణాలు అరచేత పెట్టుకొని వెళ్లాల్సిన పరిస్థితి.జి.మాడుగుల మండలంలోని గడుతూరు పంచాయతీ నేరేడుబంద గ్రామంలో పీటీజీ తెగకు చెందిన 70 మంది నివసిస్తున్నారు. వీరిలో 28 మంది పిల్లలు ఉండగా.. 15 మంది మైదాన ప్రాంతమైన రావికమతం మండలంలోని చీమలపాడు పంచాయతీ జెడ్‌.జోగంపేట ప్రాథమిక పాఠశాలలో చదువుతున్నారు. జి.మాడుగుల మండలానికి ఓ వైపు విసిరేసినట్టుగా ఉండే గ్రామం ఇది కావడంతో ఈ గ్రామస్థులకు ఇటు అల్లూరి సీతారామరాజు జిల్లా నుంచి, అటు అనకాపల్లి జిల్లా యంత్రాంగం నుంచి ఎటువంటి సేవలు అందడం లేదు. ప్రభుత్వ పథకాలు అందడం లేదు. చిన్నారులు, గర్భిణులు, బాలింతలు ఉన్నా అంగన్‌వాడీ కేంద్రం లేకపోవడంతో పోషకాహారం అందని ద్రాక్షగా మారింది. దశాబ్దాలుగా నరకయాతన అనుభవిస్తున్నా పట్టించుకునే నాథుడే లేడని ఆదివాసీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

శ్రమదానంతో తాత్కాలిక రహదారి

దట్టమైన అటవీ ప్రాంతం మధ్యలో ఉండే నేరేడుబందకు కనీస రహదారి సదుపాయం లేదు. గ్రామంలో ఎవరైనా అనారోగ్యానికి గురైతే ఆసుపత్రులకు తరలించేందుకు డోలీమోతలే దిక్కు. నేరేడుబంద నుంచి నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్న జెడ్‌.జోగంపేటలో బడికి విద్యార్థులు వెళ్లేందుకు కనీస రహదారి సదుపాయం లేదు. కొండలు, వాగులు, రాళ్లు, తుప్పలు దాటుకొని వెళ్లాలి. వర్షాకాలంలో వీరి బాధలు వర్ణనాతీతం. గ్రామస్థులందరూ ఐక్యంగా శ్రమదానంతో జెడ్‌.జోగంపేట వరకు తాత్కాలిక మట్టి రోడ్డు ఇటీవలే నిర్మించుకున్నారు. విద్యార్థులు సైతం ఇందులో చేయిచేయి కలిపారు. చిట్టి చేతులతో పలుగు, పారలు పట్టుకొని రహదారిని వేసుకున్నారు.

గుర్రాలపై పాఠశాలకు..

దట్టమైన అటవీ ప్రాంతం కావడంతో విద్యార్థులు పాఠశాలకు వెళ్లేందుకు భయాందోళన చెందేవారు. జంతువుల భయంతో చిన్నారులు కొన్ని సమయాల్లో పాఠశాలకు వెళ్లలేని పరిస్థితి. గ్రామంలోనే బడి ఏర్పాటు చేయాలని పలుమార్లు ఉన్నతాధికారులకు విన్నవించినా ఫలితం లేదు. తమ పిల్లలను ఎలాగైనా చదివించుకోవాలనే దృఢ సంకల్పంతో తల్లిదండ్రులు గుర్రాలెక్కించి రోజూ నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్న జెడ్‌.జోగంపేటకు తీసుకెళ్తున్నారు. వర్షాకాలంలో బడికి వెళ్లలేని పరిస్థితులు ఏర్పడుతున్నాయి. తల్లిదండ్రులు, గుర్రాలు అందుబాటులో లేకపోతే ఆ రోజు బడికి సెలవే.


శాశ్వత రహదారి నిర్మించాలి

నేరేడుబంద గ్రామానికి శాశ్వత రహదారి నిర్మించాలి. రోడ్డు లేక ఇబ్బందులు పడుతున్నాం. రోగులు, గర్భిణులను ఆసుపత్రులకు తరలించేందుకు డోలీమోతలపై ఆధార పడాల్సి వస్తోంది. అంగన్‌వాడీ కేంద్రం మంజూరు చేసి పోషకాహారం అందించాలి

- కిల్లో పొట్టిదొర, నేరేడుబంద


పిల్లలు భయపడుతున్నారు

నేరేడుబందలో పాఠశాల ఏర్పాటుచేయాలి. గ్రామంలో 28 మంది చిన్నారులు ఉంటే 15 మంది నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్న జెడ్‌.జోగంపేట పాఠశాలకు వెళ్లి చదువుకుంటున్నారు. కనీస రహదారి లేదు. దట్టమైన అటవీ ప్రాంతం గుండా రోజూ విద్యార్థులు పాఠశాలకు వెళ్లేందుకు భయాందోళన చెందుతున్నారు. రోజూ మేమే గుర్రాలపై పాఠశాలకు తీసుకెళ్తున్నాం.

- డిప్పల అప్పారావు, నేరేడుబంద


గ్రామాన్ని సందర్శిస్తాం

గ్రామంలో సమస్యలు నేరుగా తెలుసు కునేందుకు నేరేడుబందలో పర్యటిస్తాం. అక్కడి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తాం. ఈ వారంలో ఒక రోజు గ్రామాన్ని సందర్శిస్తాం. అక్కడ రహదారి, పాఠశాల ఏర్పాటుకు చర్యలు చేపడతాం.

- గోపాలకృష్ణ, ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి, పాడేరు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని