logo

కష్టంలో కొండంత అండగా..

సాధారణంగా పాతికేళ్ల వయసులో యువత ఆలోచనా విధానాలు వేరుగా ఉంటాయి. సరదాగా స్నేహితులతో ఆడుతూ.. పాడుతూనో.. లేదా పుస్తకాలే ప్రపంచంగా బతకడం వంటివి చేస్తుంటారు.

Published : 29 Mar 2023 02:22 IST

చింతపల్లి యువత చొరవ
చింతపల్లి, న్యూస్‌టుడే

హెల్పింగ్‌హ్యాండ్స్‌ సభ్యులు

సాధారణంగా పాతికేళ్ల వయసులో యువత ఆలోచనా విధానాలు వేరుగా ఉంటాయి. సరదాగా స్నేహితులతో ఆడుతూ.. పాడుతూనో.. లేదా పుస్తకాలే ప్రపంచంగా బతకడం వంటివి చేస్తుంటారు. అదే యువత సమాజ సేవకోసం ఆలోచిస్తే.. ఆధ్యాత్మిక బాటలో పయనిస్తే మరెందరికో స్ఫూర్తిదాయకంగా నిలుస్తారు. చింతపల్లికి చెందిన కొందరు యువకులు ఇదేవిధంగా.. పదుగురు మెచ్చేలా సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.

చింతపల్లికి చెందిన సుర్ల వీరేంద్రకుమార్‌ ల్యాబ్‌ టెక్నీషియన్‌ కోర్సు పూర్తిచేసి చింతపల్లిలోనే సొంతంగా ల్యాబ్‌ పెట్టుకున్నారు. స్నేహితులైన గాజుల శ్రీను, నాయుడు, తారక్‌, మనోజ్‌... మరికొద్ది మందితో కలసి ముత్యాలమ్మ మెగా హెల్పింగ్‌ హ్యాండ్స్‌ సంఘంగా ఏర్పడ్డారు. పలువురి ప్రాణాలను నిలిపే రక్తదాన శిబిరాలను స్వచ్ఛందంగా నిర్వహించాలని నిర్ణయించారు. సామాజిక మాధ్యమాల వేదికగా వీరంతా ఏర్పాట్లు చేసుకున్నారు. గడిచిన రెండేళ్ల వ్యవధిలో ఇప్పటివరకూ మూడు సార్లు చింతపల్లి కేంద్రంగా మెగా రక్తదాన శిబిరాలను నిర్వహించారు. రెడ్‌క్రాస్‌, ఫస్ట్‌ బ్లడ్‌బ్యాంక్‌ల సహకారంతో ప్రతి ఆరు నెలలకూ ఒకసారి రక్తదాన శిబిరాలను నిర్వహిస్తున్నారు. ప్రతి శిబిరంలోనూ సుమారు వంద యూనిట్ల వరకూ రక్తాన్ని వీరు సేకరిస్తున్నారు. వీటిని రెడ్‌క్రాస్‌తోపాటు కేజీహెచ్‌కు అందిస్తున్నారు.

హెల్పింగ్‌ హ్యాండ్స్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన రక్తదాన శిబిరం (పాత చిత్రం)

చింతపల్లికి చెందిన రవి వైద్యారోగ్య శాఖలో ఒప్పంద ఉద్యోగి. రెండేళ్ల కిందట అనుకోకుండా జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి మరణించారు. అదే ప్రమాదంలో ఆయన నాలుగేళ్ల కుమారుడు తలకు బలమైన గాయమైంది. చావుబతుకుల్లో కొట్టుమిట్టాడుతున్న ఆ చిన్నారికి మెరుగైన వైద్యం అందించేందుకు అంతా ప్రయత్నించారు. ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందించారు. వైద్యానికి అధిక మొత్తంలో ఖర్చయ్యే పరిస్థితి నెలకొంది. దీన్ని గుర్తించిన చింతపల్లికి చెందిన యువకులు వీరేంద్ర, శ్రీను, మనోజ్‌ తదితరులు తమకు తోచిన విధంగా సాయం అందించాలని భావించారు. దీనికోసం సామాజిక మాధ్యమాలను వేదికగా చేసుకున్నారు.

చిన్నారి వైద్యానికి దాతలు ఉదారంగా సాయం అందించాలని వారు వేడుకున్న తీరు నెటిజన్లను కదిలించింది. అంతే వందలు, వేలు, లక్షలు వచ్చి పడ్డాయి. అలా దాతలనుంచి సుమారు రూ. 20 లక్షలకు పైగా సాయం అందింది. దీంతో ఆ చిన్నారి వైద్యానికి ఎటువంటి ఇబ్బందులు ఎదురుకాలేదు. తామున్నామంటూ అంతా తలో చేయి వేయడంతో ఆ చిన్నారి ఆరోగ్య మెరుగుపడింది. దీనంతటికీ కారణం చింతపల్లికి చెందిన యువకులే కారణం.


ముత్యాలమ్మ తల్లికి ఆలయ నిర్మాణం

చింతపల్లిలో నూతనంగా నిర్మించిన ముత్యాలమ్మ తల్లి ఆలయం

చింతపల్లిలో ముత్యాలమ్మ తల్లి ఆలయానికి నేటివరకూ సొంత ఆలయం లేదు. సుర్ల వంశీయుల ఇలవేల్పుగా పూజలందుకుంటున్న  అమ్మవారి మూలవిరాట్‌ విగ్రహం చాలా ఏళ్లు చెట్టునీడనే పూజలందుకునేది. కాలక్రమంలో రేకుల షెడ్డు నిర్మించారు. ఇది హుద్‌హుద్‌ తుపానులో కూలిపోయింది. ఇక అప్పటినుంచి అమ్మవారి మూలవిరాట్‌ ఎండకు ఎండి, వానకు తడుస్తూ ఉంది. అప్పటి ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి కొంత సాయం అందించడంతో మళ్లీ అమ్మవారికి రేకుల భవనం నిర్మించారు.

ఏటా అమ్మవారి ఉత్సవాలను రూ.లక్షలు వెచ్చించి ఘనంగా నిర్వహిస్తున్నా ఆలయ నిర్మాణానికి ఎవరూ ముందుకు రాలేదు. ఈ పరిస్థితుల్లో సుర్ల వీరేంద్రకుమార్‌ చొరవ తీసుకున్నారు. తన స్నేహితులైన నాయుడు, శ్రీను, ఇతరులతో కలిసి ఆలయ నిర్మాణానికి సంకల్పించారు. అవసరమైన సామగ్రిని దాతలు ఎవరికి తోచింది వారు విరాళంగా అందించారు. ఉగాది నాడు ఈ ఆలయాన్ని ప్రారంభించారు.

చింతపల్లికి చెందిన పెయింటర్‌ తన కుమార్తెకు ఆరోగ్యం బాగోలేక ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నాడు. దీన్ని గుర్తించిన యువకులు ఆ కుటుంబానికీ ఉదారంగా సాయం అందించారు. ఇలా చింతపల్లిలో ఎవరికి ఏ కష్టమొచ్చినా తామున్నామంటూ ఈ యువకులు తమవంతు సాయం అందించేందుకు ముందుంటున్నారు.


అంతా కలసికట్టుగా : చింతపల్లిలో యువకుల సంఖ్య అధికంగా ఉంది. ఆడుతూ పాడుతూ కాలాన్ని వృథా చేయకుండా యువత కొంతైనా సామాజిక సేవ వైపు దృష్టిసారించాలన్న ఆలోచన వచ్చింది. అనుకున్నదే తడవుగా స్నేహితులంతా కలసి కొన్ని పనులకు శ్రీకారం చుట్టాం. ప్రధానంగా ఆపదలో ఉన్నవారికి ఏ సమయంలోనైనా అవసరమైన రక్తాన్ని అందించేందుకు మేము సిద్ధంగా ఉన్నాం. మాకున్న నెట్‌వర్క్‌తో విశాఖ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న వారికీ సకాలంలో రక్తాన్ని అందించగలుగుతున్నాం. భవిష్యత్‌లో మరిన్ని సేవా కార్యక్రమాలను చేస్తుంటాం.

గాజుల శ్రీను, చింతపల్లి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు