logo

జాబ్‌ క్యాలెండర్‌ జాడేది..!

మన్యంలో నిరుద్యోగుల పరిస్థితి దయనీయంగా మారింది. నానా ఇబ్బందులు ఎదుర్కొని డిగ్రీలు పూర్తి చేసినా సకాలంలో నోటిఫికేషన్లు లేక ఇళ్లకే పరిమితం అవుతున్నారు.

Published : 29 Mar 2023 02:22 IST

మన్యంప్రాంత యువత ఆవేదన
నిరుద్యోగ భృతి నిలిచి ఇబ్బంది
ఎటపాక, న్యూస్‌టుడే

న్యంలో నిరుద్యోగుల పరిస్థితి దయనీయంగా మారింది. నానా ఇబ్బందులు ఎదుర్కొని డిగ్రీలు పూర్తి చేసినా సకాలంలో నోటిఫికేషన్లు లేక ఇళ్లకే పరిమితం అవుతున్నారు. గత ప్రభుత్వం నిరుద్యోగులకు ఆసరాగా ఉండేందుకు నిరుద్యోగ భృతి అందించి ఆదుకుంది. ప్రస్తుత ప్రభుత్వం అది పెంచుతామని చెప్పి ఉన్నది కూడా రద్దు చేసిందని నిరుద్యోగులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. డిగ్రీ పట్టాలు పుచ్చుకొని ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న యువత సంఖ్య ఏటా వేలల్లో ఉంటోంది. జాబ్‌ క్యాలెండర్‌ ప్రకటిస్తామని ఇచ్చిన హామీ అమలు చేయకపోవడంపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తం అవుతోంది.

ఎన్నో ఆశలతో పుస్తకాలు పట్టి చదివి సిద్ధమవుతున్నా.. నోటిఫికేషన్‌లు రాకపోవడంతో నిరాశే మిగులుతోందని నిరుద్యోగులు చెబుతున్నారు. రంపచోడవరం నియోజకవర్గంలోని చింతూరు, రంపచోడవరం డివిజన్ల పరిధిలో ఏటా సుమారు ఐదువేల మంది ప్రభుత్వ, ప్రయివేటు కాలేజీల్లో డిగ్రీలు పూర్తి చేసుకుంటున్నారు. చాలామంది ఉద్యోగాలు దొరక్క ఏదో చిన్న వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగించే పరిస్థితి. పోలీస్‌ కానిస్టేబుల్‌, గ్రూప్స్‌ పరీక్షలకు సిద్ధమవుతున్నా... ప్రభుత్వం చొరవ చూపకపోవడంతో అసహనం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై యువత అభిప్రాయాలు ఇలా ఉన్నాయి.


నిరుద్యోగులకు విలువ లేదు

-కట్టా వెంకటరమణ ఏంఏ తెలుగు, నిరుద్యోగి, గోగుబాక

రాష్ట్రంలో వైఎస్సార్‌ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఏటా జాబ్‌ క్యాలెండర్‌ విడుదల చేస్తామని హామీ ఇచ్చారు. ఇంతవరకు నోటిఫికేషన్‌ ఇవ్వలేదు. మా ప్రాంతంలో పరిశ్రమలు, సంస్థలు లేవు. విద్యార్థులకు అమ్మఒడి కింద డబ్బులిచ్చారు. వారికి ఉన్న విలువ కూడా చదువుకున్న విద్యావంతులకు లేకుండా పోయింది. ఈ ప్రాంతం వదలి మరో ప్రాంతానికి వెళ్లి బతకాలంటే అక్కడిచ్చే వేతనం ఇంటి అద్దె ఖర్చులకూ సరిపడని పరిస్థితి. దయచేసి నిరుద్యోగ భృతి అందించాల్సి ఉంది.


తల్లిదండ్రులకు భారం కాలేక ఇబ్బంది

-చింతా వెంకన్నబాబు, ఇంజినీరింగ్‌, నిరుద్యోగి, గోగుబాక

పెద్ద చదువులు చదివి ఖాళీగా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఏవైనా ప్రైవేటు ఉద్యోగాలు తెచ్చుకుందామని ఆశపడినా మా ప్రాంతం చుట్టుపక్కల పరిశ్రమలు లేవు. తల్లిదండ్రులకు దూరంగా వెళ్తే వారి బాగోగులు ఎవరు చూడాలి?, నేను ఇంజినీరింగ్‌ చదివాను. ఇంతవరకూ ఉద్యోగం లేదు. ఏటా జాబ్‌ క్యాలెండర్‌ విడుదల చేస్తుందనే ఆశతో ఉన్నాం. నాలుగేళ్లు గడిచినా జాబ్‌ క్యాలెండర్‌ విడుదల కాలేదు. వేల సంఖ్యలో కొలువులు ఖాళీగా ఉన్నా భర్తీ చేయడం లేదు. మమ్మల్ని కన్న తల్లిదండ్రులకు భారం కాలేక ఇబ్బంది పడుతున్నాం. విద్యావంతులకు తగినట్లు ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ విడుదల చేయాలని కోరుతున్నాను.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని