logo

పరిశీలన జాగు.. జాబితాలెప్పటికి బాగు?

ఇంటింటా సర్వేతో పాటు అంతకు ముందు ఏప్రిల్‌ 15 నుంచి ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌లో వచ్చిన దరఖాస్తులు చాలావరకు పెండింగ్‌లో ఉన్నాయి

Updated : 22 Sep 2023 06:04 IST

వచ్చేనెల్లో ఓటర్ల జాబితా ముసాయిదా ప్రదర్శన
పెండింగ్‌లో ఫాం-7, 8 దరఖాస్తులే ఎక్కువ

ఓటర్ల జాబితాలు, దరఖాస్తుల పునఃపరిశీలన

ఈనాడు, పాడేరు, న్యూస్‌టుడే, పాడేరు పట్టణం: ఓటర్ల జాబితా స్వచ్ఛీకరణకు జులై 21 నుంచి ఆగస్టు 21 వరకు ఇంటింటి సర్వే చేపట్టారు. ఓట్ల చేర్పులు, తొలగింపులు, మార్పులపై భారీగా దరఖాస్తులు స్వీకరించారు. ప్రస్తుతం వాటిని పునః పరిశీలన చేస్తున్నారు. వచ్చేనెలలోనే ముసాయిదా జాబితాను ప్రదర్శించబోతున్నారు. ఆలోగా ఈ దరఖాస్తులన్నింటినీ పరిశీలించే అవకాశాలు ఏమాత్రం కనిపించడం లేదు.

ఇంటింటా సర్వేతో పాటు అంతకు ముందు ఏప్రిల్‌ 15 నుంచి ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌లో వచ్చిన దరఖాస్తులు చాలావరకు పెండింగ్‌లో ఉన్నాయి. వాటిని ఆధారాలతో సహా పరిశీలించిన తర్వాతనే సమ్మతించడమో, తిరస్కరించడమో చేయాలి. ఈ ప్రక్రియ మందకొడిగా జరుగుతోంది. బీఎల్వోలుగా ఎక్కువ మంది వీఆర్వోలు, సచివాలయ సిబ్బంది ఉన్నారు. వీరికి రోజువారీ విధులతో పాటు ఈ దరఖాస్తుల పరిశీలన చేయాల్సి ఉండడంతో జాప్యం జరుగుతోంది. దీంతో అక్టోబర్‌ 17 నాటికి జాబితా పూర్తిస్థాయిలో స్వచ్ఛీకరణ జరిగే అవకాశం లేదని అధికారులే చెబుతున్నారు.

జిల్లాలోని మూడు నియోజకవర్గాల్లో 7.34 లక్షల మంది ఓటర్లు ఉండగా, సర్వే గడువు ముగిసే నాటికి 97 శాతం పరిశీలన చేసినట్లు అధికారులు ప్రకటించారు. ఇంటింటి సర్వేలో చాలా లోపాలు ఉన్నాయని బూత్‌లెవల్‌ ఏజెంట్లు ఆరోపిస్తున్నారు. చనిపోయిన వారి వివరాలను ఎప్పటికప్పుడు బీఎల్‌వోలు తమ లాగిన్‌ ఐడీలో అప్‌లోడ్‌ చేయాల్సి ఉండగా.. ఆ విషయంలో నిర్లిప్తత ప్రదర్శించినట్లు వారు చెబుతున్నారు. సర్వే సమయంలో మరణ ధ్రువీకరణ పత్రాలు తీసుకోకుండా తర్వాత వచ్చి తీసుకుంటామంటూ వెళ్లిపోవడంతో పునఃపరిశీలన జాప్యమవుతోంది. ఎన్నికల సంఘం ఇచ్చిన ఆదేశాల ప్రకారం ఈ ప్రక్రియ పకడ్బందీగా సాగడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కొందరు అధికారులు మాత్రమే క్షేత్రస్థాయి పరిశీలనలో భాగస్వాములు అవుతున్నారని బీఎల్‌ఏలంటున్నారు.


తూతూమంత్రపు పరిశీలన

తొలగింపు జాబితాలోని ఓటర్లను వారి చిరునామాలకు వెళ్లి ప్రత్యక్షంగా పరిశీలించాలని కలెక్టర్‌ సుమిత్‌కుమార్‌ ఎన్నికల అధికారులను ఆదేశించారు. ఫాం-7 ద్వారా ఎవరిదైనా ఓటు తొలగిస్తే వారి కుటుంబసభ్యులకు నోటీసు జారీచేయాలని, దరఖాస్తు చేసిన వ్యక్తిని కూడా పిలిపించాలని సూచించారు. జిల్లాలో ఈ ఏడాది ఏప్రిల్‌ 15 నుంచి సెప్టెంబర్‌ 12 వరకు ఓట్ల తొలగింపునకు 25 వేలకు పైగా దరఖాస్తులు వచ్చాయి. వారందరికీ నోటీసులు జారీచేసి 15 రోజులు సమయం ఇచ్చి వివరణ తీసుకోవాలి. అప్పటికీ సమాధానం రాకపోతే బీఎల్‌వో ద్వారా నోటీసు పంపి ఏడు రోజుల సమయం ఇవ్వాలి. ఈ ప్రక్రియకు కనీసం 21 రోజులు పట్టనుంది. ఇక్కడ బీఎల్‌వోలు అంత సమయం తీసుకోవడం లేదు. తూతూమంత్రపు పరిశీలనతో వచ్చిన దరఖాస్తులను వచ్చినట్లే ఆమోదించి తొలగించేస్తున్నారు. ఫాం-8లో సవరణల కోసం 45 వేలకు పైగా వస్తే అందులో 11,689 మాత్రమే ఇప్పటి వరకు ఆమోదించారు.. ఇంకా 31 వేలకు పైగా దరఖాస్తులు పెండిగ్‌లో పెట్టారు. వాస్తవానికి సవరణలే వేగంగా జరగాలి.. తొలగింపులపై ఆచితూచి ముందుకు వెళ్లాలి. ఇక్కడ అధికారులు ఇందుకు భిన్నంగా వెళుతున్నారు. దీనివల్ల ముసాయిదా జాబితా మరలా తప్పులతడకగా విడులయ్యే అవకాశం ఉందని పేరు చెప్పడానికి ఇష్టపడని ఓ రెవెన్యూ అధికారి తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని