logo

లాడ్జిలో ఉరేసుకుని వృద్ధుడు ఆత్మహత్య

పాయకరావుపేటలోని లాడ్జిలో ఓ వృద్ధుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఎస్సై సత్యనారాయణ కథనం ప్రకారం.. నంద్యాలకు చెందిన రమణ అప్పుడప్పుడు పాయకరావుపేట వచ్చి గణేష్‌ భవన్‌ హోటల్‌లో బస చేసేవారు.

Updated : 02 Dec 2023 06:07 IST

పాయకరావుపేట: పాయకరావుపేటలోని లాడ్జిలో ఓ వృద్ధుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఎస్సై సత్యనారాయణ కథనం ప్రకారం.. నంద్యాలకు చెందిన రమణ అప్పుడప్పుడు పాయకరావుపేట వచ్చి గణేష్‌ భవన్‌ హోటల్‌లో బస చేసేవారు. ఇక్కడి నుంచే జిల్లాలోని దేవాలయాలను సందర్శిస్తూ ఉండేవారు. గురువారం రాత్రి లాడ్జిలో బస చేసిన ఆయన శుక్రవారం తలుపు తీయలేదు. అనుమానం వచ్చి తలుపులు తెరవగా గదిలోని కిటికీకి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు గుర్తించారు. లాడ్జి యజమాని ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు ఎస్సై చెప్పారు.


మనస్తాపంతో బాలిక

 గాజువాక, న్యూస్‌టుడే: చదువులో రాణించలేకపోతున్నానని.. మనస్తాపం చెందిన బాలిక ఆత్మహత్య చేసుకున్న ఘటన శుక్రవారం గాజువాక పోలీసుస్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్‌ఐ నజీర్‌ వివరాల మేరకు... స్థానిక గోపాలరెడ్డినగర్‌లో తల్లిదండ్రులు, సోదరితో కలిసి నివాసం ఉంటున్న బాలిక (15) కణితిరోడ్డు ప్రైవేటు పాఠశాలలో పదో తరగతి చదువుతోంది. నాలుగు రోజుల కిందట తల్లి తీర్థయాత్ర నిమిత్తం శ్రీశైలం వెళ్లగా... కుమార్తెలిద్దరూ, తండ్రి ఇంట్లోనే ఉన్నారు. పెద్ద కుమార్తె ఇంజినీరింగ్‌ చదువుతోంది. ఇటీవల చదువులో వెనుకబడి ఉంటున్న చిన్నకుమార్తెను బాగా చదువుకోవాలని తండ్రి నచ్చజెప్పి, విధులకు వెళ్లిపోయారు. సాయంత్రం పెద్దకుమార్తె ఇంటికి వచ్చి చూడగా... చిన్న కుమార్తె పైఅంతస్తు గదిలో సీలింగ్‌ ఫ్యాన్‌కు చీరతో ఉరేసుకుని వేలాడుతూ కనిపించింది. వెంటనే తండ్రి ఇంటికి చేరుకుని... పోలీసులకు సమాచారం అందించారు. తల్లి యాత్ర నుంచి వచ్చి కన్నీరుమున్నీరయ్యారు. ‘పాఠశాలలో చదివిన పాఠ్యాంశాలు గుర్తుండడం లేదని, పరీక్షలు ఎలా రాయాలని’ తమ కుమార్తె తరచూ బాధ పడేదని తల్లిదండ్రులు తెలిపారు. గాజువాక సీఐ భాస్కరరావు ఆధ్వర్యంలో ఎస్‌ఐ నజీర్‌ కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని