logo

మేల్కొంటే ఓటు..లేకుంటే చేటు

ప్రజాస్వామ్యంలో ఓటే వజ్రాయుధం. ఓటుతో మన భవిష్యత్తుకు మనమే బాటలు వేసుకుంటాం. అంతటి కీలకమైన ఓటు హక్కు విషయంలో నిర్లక్ష్యం చూపితే చివరికి చేటే కలుగుతుంది.

Updated : 02 Dec 2023 06:00 IST

ముసాయిదా లోపాల సవరణకు ఇదే చివరి అవకాశం

 నేడు, రేపు పోలింగ్‌ కేంద్రాల్లో ప్రత్యేక నమోదు శిబిరాలు

ప్రజాస్వామ్యంలో ఓటే వజ్రాయుధం. ఓటుతో మన భవిష్యత్తుకు మనమే బాటలు వేసుకుంటాం. అంతటి కీలకమైన ఓటు హక్కు విషయంలో నిర్లక్ష్యం చూపితే చివరికి చేటే కలుగుతుంది.
ఈనాడు, అనకాపల్లి, న్యూస్‌టుడే, అనకాపల్లి, పాడేరు: రెండు నెలల క్రితం ఎన్నికల సంఘం విడుదల చేసిన ముసాయిదా ఓటర్ల జాబితా అంతా తప్పులతడకగా ఉంది. స్వచ్ఛీకరణ చేస్తామంటూ నెల్లాళ్ల పాటు ఇంటింటా సర్వే చేసినా ఫలితం లేకుండాపోయింది. చనిపోయిన ఓటర్ల పేర్లు జాబితాల్లో ప్రత్యక్షం అవుతున్నాయి.. శాశ్వత వలసలు పోయినోళ్లు ఊరిలోనే ఉంటున్నట్లు చూపారు. కొందరికి ఓటే లేదంటే మరికొందరికి ఒకటికి మించి రెండు మూడు ఓట్లు కనిపిస్తున్నాయి. ఇక ఇంటి నంబర్లయితే తికమక పడాల్సిందే. సున్నా ఓట్లు ఎన్నున్నాయో లెక్కేలేదు.. ఒకే ఇంటి నంబర్‌పై పది కంటే ఎక్కువ ఓట్లు ఉన్న ఇళ్లు వేలల్లోనే ఉన్నాయి. ఇంత లోపభూయిష్టంగా ముసాయిదా జాబితాను ప్రచురించారు. వీటిని ప్రదర్శించాక వెలుగులోకి వచ్చిన లోపాలను సవరించడానికి ఎన్నికల సంఘం మరోసారి అవకాశం కల్పించింది. ఇప్పటికే గత నెలలో రెండు రోజులు ప్రత్యేక ఓటరు నమోదు శిబిరాలను నిర్వహించారు. వాటి గురించి అవగాహన లేక, ప్రచారం చేయకపోవడంతో క్లెయిమ్‌లు చాలా తక్కువ వచ్చాయి. తాజాగా శని, ఆదివారాల్లో మరోసారి పోలింగ్‌ కేంద్రాల వద్ద ప్రత్యేక శిబిరాలను నిర్వహిస్తున్నారు. ఈసారైనా ఓటు లోటుపాట్లను బీఎల్వోల దృష్టికి తీసుకువెళ్లగలిగితే జనవరి 5న ప్రచురితమయ్యే తుది జాబితా మెరుగవ్వడానికి అవకాశం ఉంటుంది.

ఈసారైనా స్పందిస్తారా..?

ముసాయిదాలో లోపాల సవరణతోపాటు కొత్త ఓటర్ల నమోదు కోసం నవంబర్‌ 4, 5 తేదీల్లో ప్రత్యేక శిబిరాలు నిర్వహించారు. ఆ రెండు రోజుల్లో అనకాపల్లి జిల్లాలోని 1,529 పోలింగ్‌ కేంద్రాల నుంచి కేవలం 5,772 క్లెయిమ్‌లు మాత్రమే వచ్చాయి. సగటున ఒక్కో కేంద్రం నుంచి రెండు రోజుల్లో మూడు దరఖాస్తులు మాత్రమే వచ్చాయి. ముసాయిదా నిండా తప్పులే ఉన్నా వాటిని ఎత్తిచూపడానికి, సవరించుకోవడానికి పెద్దగా ఎవరూ ముందుకు రాలేదు. తెదేపా నేతలు జిల్లాలో ఓటర్ల జాబితా వడపోసి మొత్తంగా అన్ని కేటగిరీల్లో లోపాలు కలిపి 48,496 వరకు ఉన్నట్లు గుర్తించారు. ఆ మేరకు నేడు, రేపు నిర్వహించే ప్రత్యేక ఓటరు శిబిరాల్లో వాటిని సరిదిద్దేలా అధికారుల దృష్టికి తీసుకువెళతారా అనేది చూడాలి.

అపరిష్కృత క్లెయిమ్‌లు 12 వేలపైనే..

అల్లూరి జిల్లాలోని పాడేరు, అరకు, రంపచోడవరం నియోజకవర్గాల పరిధిలో చేర్పులు, తొలగింపులు, సవరణల కోసం 1,35,356 దరఖాస్తులు వచ్చాయి. వాటన్నింటిని పరిశీలించి చాలావరకు ఆమోదించారు. ఇంకా 12,533 క్లెయిమ్‌లను పరిష్కరించకుండా పెండింగ్‌లో పెట్టారు. మూడు నియోజకవర్గాల నుంచి చేర్పుల కోసం 36,491 దరఖాస్తులు వస్తే అందులో 33,554 దరఖాస్తులకు ఆమోదం తెలిపారు. ఇంకా 2,241 పెండింగ్‌లో ఉంచారు. అలాగే తొలగింపులకు 30,836 దరఖాస్తులు రాగా వాటిలో 1,551 అపరిష్కృతంగా ఉన్నాయి. సవరణల కోసం వచ్చిన ఫారం-8లలో 8,741 దరఖాస్తులను పరిష్కరించాల్సి ఉంది. శని, ఆదివారాల్లో వచ్చే దరఖాస్తులను చూసుకుని అన్నింటిని పరిష్కరించి తుది జాబితా సిద్ధం చేయాలని అక్కడి అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు