logo

‘ఇప్పటికైనా కళ్లు తెరవండి జగన్‌మోహన్‌రెడ్డి’

‘అమరావతే ఏపీ రాజధాని అని కేంద్రం మరోసారి స్పష్టంగా చెప్పింది. ఇప్పటికైనా మీ కళ్లు తెరవండి జగన్‌మోహన్‌రెడ్డి గారు..’ అంటూ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు తన ట్విటర్‌ ద్వారా స్పందించారు.

Published : 06 Dec 2023 02:56 IST

విశాఖపట్నం, న్యూస్‌టుడే: ‘అమరావతే ఏపీ రాజధాని అని కేంద్రం మరోసారి స్పష్టంగా చెప్పింది. ఇప్పటికైనా మీ కళ్లు తెరవండి జగన్‌మోహన్‌రెడ్డి గారు..’ అంటూ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు తన ట్విటర్‌ ద్వారా స్పందించారు. ‘ఇప్పుడు ఎన్నికలకు మూడు నెలల ముందు ఉత్తరాంధ్ర వెనుకబాటుతనం గుర్తుకొచ్చిందా? మీ రాజధాని మాకొద్దు మహాప్రభో, మా విశాఖలో మునుపటి ప్రశాంతతను మిగల్చండని విశాఖ వాసులు వాపోతున్నారు. 2024లో మీ ప్రభుత్వ పతనం ఇదే విశాఖ నుంచే ప్రారంభమవుతుందని గుర్తుంచుకోండి. హైకోర్టు త్రిసభ్య ధర్మాసనం కార్యాలయాల మార్పు కుదరదని ఇచ్చిన తీర్పును గౌరవించకుండా, ఉత్తరాంధ్ర అభివృద్ధి పర్యవేక్షణను కారణంగా చూపుతూ క్యాంపు కార్యాలయాల పేరుతో విశాఖకు ప్రభుత్వ కార్యాలయాలను తరలించవల్సిన అవసరం ఏమొచ్చింది. చట్ట పరంగా సాధ్యం కాదని తేలడంతో దొడ్డిదారిని ఎంచుకున్నారు. ఇలా అమరావతి రైతులను ఇబ్బంది పెడుతూ ఏమి సాధిద్దామనుకుంటున్నారు. రుషికొండను బోడిగుండుగా మార్చి సర్వ నాశనం చేశారు. రుషికొండను టూరిజం రిసార్టు అభివృద్ధి పేరుతో విచక్షణారహితంగా తవ్వేసి పరిమితికి మించి నిర్మాణాలు చేపట్టారు. టూరిజం ప్రాజెక్టు నిర్మిస్తున్నామని చెప్పి రూ.140 కోట్లు బ్యాంకుల నుంచి రుణం తెచ్చి దాదాపు రూ.500 కోట్లు సీఎం కార్యాలయానికి వెచ్చించారు. మీకు ఉత్తరాంధ్ర వెనుకబాటు తనం నిజంగా గుర్తుంటే ఈ నాలుగున్నరేళ్ల పాలనలో ఉత్తరాంధ్ర అభివృద్ధికి తోడ్పడే భోగాపురం ఎయిర్‌పోర్టు గురించి కానీ, రైల్వే జోన్‌, మెట్రో కోసం, స్టీల్‌ప్లాంటు ప్రైవేటీకరణ, ఉత్తరాంధ్ర ప్రజలు ఎదుర్కొంటున్న సాగునీరు, తాగునీరు కష్టాలను తీర్చగలిగే ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టు గురించి పాటుపడేవా’రని పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు