logo

సూపర్‌వైజర్‌ శ్రీధర్‌ అనుమానాస్పద మృతి

శరగడం శ్రీధర్‌ (24) అనుమానాస్పదస్థితిలో మృతి చెందాడు. ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం.. పాడేరు నుంచి మైదాన ప్రాంతంలోని స్వగ్రామానికి శ్రీధర్‌ మంగళవారం ద్విచక్రవాహనంపై బయలుదేరాడు.

Published : 06 Dec 2023 03:04 IST

పాడేరు, న్యూస్‌టుడే: వి.మాడుగుల మండలం వీరనారాయణం గ్రామానికి చెందిన యువకుడు శరగడం శ్రీధర్‌ (24) అనుమానాస్పదస్థితిలో మృతి చెందాడు. ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం.. పాడేరు నుంచి మైదాన ప్రాంతంలోని స్వగ్రామానికి శ్రీధర్‌ మంగళవారం ద్విచక్రవాహనంపై బయలుదేరాడు. పాడేరు ఘాట్‌ 12 మైలు కూడలి సమీపంలో అతని వాహనం నుంచి పేలుడు శబ్దం వచ్చింది. ఎడమ కణితిపై గాయమైంది. ప్రధాన రహదారి పక్కన స్పృహతప్పి పడిపోయాడు. వెనుక మరో ద్విచక్ర వాహనంపై వస్తున్న అతడి స్నేహితుడు ఆదిబాబు.. శ్రీధర్‌ను పైకి లేపుతుండగా అప్పటికే మృతి చెందాడు. సాయంత్రం ఆరు గంటల ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని పాడేరు జిల్లా ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటన రోడ్డు ప్రమాదం అయితే కాదని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. అన్ని కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. శ్రీధర్‌ డుంబ్రిగుడ మండలం కించుమండ - సంపంగి గెడ్డ వంతెన నిర్మాణ పనుల్లో సూపర్‌వైజర్‌గా పనిచేస్తున్నాడు. తుపాను కారణంగా వంతెన పనులు నిలిపివేసి స్వగ్రామానికి వెళ్తుండగా ఈ ఘటన జరిగిందని పోలీసులు తెలిపారు. పూర్తి వివరాలు శవ పరీక్ష అనంతరం తెలియజేస్తామని సీఐ సుధాకర్‌ చెప్పారు. గిరిజన ప్రాంతంలో నాటు తుపాకులతో కాల్పుల మోత ఎక్కువగా ఉంటుంది. నాటు తుపాకీతో ఎవరైనా కాల్చి ఉండవచ్చన్న అనుమనాలు వ్యక్తమవుతున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని