logo

విజయసాయి బంధువులకు రూ.వందల కోట్లలో టీడీఆర్‌

టీడీఆర్‌ (ట్రాన్సఫరబుల్‌ డెవలప్‌మెంట్‌ రైట్‌) పత్రాల జారీ కోసమే దసపల్లా భూముల్లో మాస్టర్‌ ప్లాన్‌ రహదారి-2041ని అభివృద్ధి చేయడానికి జీవీఎంసీ రహదారి అభివృద్ధి ప్రణాళిక (ఆర్‌డీపీ) నోటిఫికేషన్‌ జారీ చేసిందని జనసేన కార్పొరేటర్‌ పీతల మూర్తియాదవ్‌ ఆరోపించారు.

Published : 06 Dec 2023 03:11 IST

మాట్లాడుతున్న పీతల మూర్తియాదవ్‌ చిత్రంలో రూప, పీవీఎస్‌ఎన్‌ రాజు, నాగలక్ష్మి

విశాఖపట్నం, న్యూస్‌టుడే: టీడీఆర్‌ (ట్రాన్సఫరబుల్‌ డెవలప్‌మెంట్‌ రైట్‌) పత్రాల జారీ కోసమే దసపల్లా భూముల్లో మాస్టర్‌ ప్లాన్‌ రహదారి-2041ని అభివృద్ధి చేయడానికి జీవీఎంసీ రహదారి అభివృద్ధి ప్రణాళిక (ఆర్‌డీపీ) నోటిఫికేషన్‌ జారీ చేసిందని జనసేన కార్పొరేటర్‌ పీతల మూర్తియాదవ్‌ ఆరోపించారు. మంగళవారం నగరంలోని ఓ హోటల్‌లో ఆయన విలేకరులతో మాట్లాడారు. దసపల్లా భూములకు సంబంధించి రూ.వందల కోట్ల విలువైన టీడీఆర్‌లను ఎంపీ విజయసాయిరెడ్డి బంధువులకు కట్టబెట్టడానికి వేగంగా దస్త్రాలు సిద్ధం చేస్తున్నారన్నారు. ఎవరికోసం సర్క్యూట్‌ హౌస్‌ నుంచి నౌరోజీరోడ్డు వరకు రహదారిని 100 అడుగులకు విస్తరిస్తున్నారని ప్రశ్నించారు. దసపల్లా భూములు ప్రయివేటు వ్యక్తులవని చిత్రీకరించి, రూ.కోట్ల టీడీఆర్‌లు కట్టబెట్టడానికి వైకాపా ప్రభుత్వం కుట్రపూరితంగా వ్యవహరించిందన్నారు. రాణి వాద్వా పేరిట ఉన్న దస్త్రాలను టాంపరింగ్‌ చేసినట్లు అనుమానాలు ఉన్నాయన్నారు. మరో పక్క జాలారిపేటలోని 361, 362 సర్వే నెంబర్లలో ఉన్న భూములకు రూ.2వేల కోట్ల విలువైన టీడీఆర్‌ జారీ చేయడానికి దస్త్రాలు సిద్ధమవుతున్నాయన్నారు. వుడా పార్కు పక్కన 7వేల చదరపు మీటర్ల స్థలంలో నిర్మాణానికి 2017లో ప్లాను కోసం దరఖాస్తు చేయగా జీవీఎంసీ తిరస్కరించిందన్నారు. తర్వాత అక్కడ అనధికారికంగా నిర్మించిన 84 ఫ్లాట్‌లకు ఆస్తి పన్ను ఎలా విధించారని నిలదీశారు. సమావేశంలో జనసేన ప్రాంతీయ సమన్వయకర్త నాగలక్ష్మి, చోడవరం ఇన్ఛార్జి పీˆవీఎస్‌ఎన్‌రాజు, నాయకులు రూప పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని